Wednesday, May 27, 2020

సౌందర్యలహరిలోని ప్రతి శ్లోకం ఒక మంత్రమే



సౌందర్యలహరిలోని ప్రతి శ్లోకం ఒక మంత్రమే

ఈ జగత్తు సృష్టిస్థితి లయ కారణాలకు మూలమైన ఒక మహాశక్తి శ్రీ లలితా పరమేశ్వరి అనేది దేవతలు సహితం విశ్వసిస్తారు. ఆ శక్తిని అనేక నామాలతో, అనేక రూపాలతో ఆరాధిస్తారు. శ్రీ శంకరాచార్యులవారు జగన్మాతను స్తుతిస్తూ అనేక స్తోత్రాలు చెప్పారు. అందులో సౌందర్యలహరి చాలా ముఖ్యమైనది.

యాదేవి సర్వభూతేషు శక్తిరూపేణ సంస్థితా౹
నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమోనమః౹౹

సర్వభూతములలో ఏ శక్తి వ్యాపించి ఉందో ఆ శక్తికి నమస్కారము. మన భారతీయ సంస్కృతిలో మంత్రములకు చాలా ప్రాముఖ్యము ఉంది. ఏకాక్షరీ రూపమై బహు దేవతాత్మకమైన 'ఓం'కార బీజాక్షరం మొదలు ఎన్నో మంత్రాలు మనకి మంత్రద్రష్టలైన మహర్షులు ప్రసాదించారు. నారాయణ మంత్రం పంచాక్షరీ మంత్రం, గాయత్రి మంత్రము ఇంకా మనకున్న దేవతలందరికీ మహర్షులు వారి దివ్యజ్ఞాన శక్తితో మంత్రాలను సృజించి మానవులకందించి తరించారు.

జగద్గురువు శ్రీ ఆదిశంకరాచార్యులవారు అద్వైత సిద్ధాంత యోగముతో శివకేశవ శాక్తేయ, గాణపత్య మతాలను సమన్వయ పరచి అన్నీ దేవీ దేవతల స్తోత్రాలు గానం చేశారు. వారి అపూర్వ సృష్టిలోనిది 'సౌందర్య లహరి' అర్థం కాని వారికి కూడా ఆ శ్లోకాలు చదువుతూంటే సౌందర్యాధిదేవత ఆ జగన్మాత సాక్షాత్కరించిన ఆనందలహరిలో లీనమయిపోతున్న అనుభూతి కలుగుతుంది.

శ్రీ శంకరులు 'సౌందర్యలహరి'లో ప్రతి శ్లోకంలోనూ ఒక మంత్రము, ఒక యంత్రం, ఆ యంత్ర పూజా విధాన భాగమైన తంత్రమును పొందుపరచారు. అయితే తాంత్రికారాధన అందరి కోసమూకాదు అనేది గ్రహించాలి.

భక్తి శ్రద్ధలు కలవారు, గురుముఖతః ఈ విధివిధానాలు తెలుసుకున్నవారు మాత్రమే దీనిని అనుష్టించాలి. మన భారతీయ సంస్కృత సాహిత్యంలో ఎటువంటి శక్తి సంపన్నమైన మంత్రశక్తి ఉన్నదో ప్రజలకు తెలియజేయడానికి ఈ శ్లోకాలు ప్రతీకలు.

అర్థవత్ వీర్యవత్తరం భవతి" అను వాక్యాన్ని అనుసరించి అర్థవంతముగా , ఆర్తిగా, ఉచ్చారణ దోషములు లేకుండా, ఒక్కసారి చేసినా జగన్మాత సంతోషపడుతుంది.

పారాయణ ప్రతి విషయమును శ్రీమాతృ చరణారావిందములకు సమర్పించుట మన కర్తవ్యము.

పారాయణ చేసిన ప్రతిశ్లోకాన్ని , నిరంతరం మననముద్వారా, సమర్పణద్వారానే, శ్రీమాతృ అనుగ్రహానికి పాత్రులుకాగలరు.

కనుక "భవానీ భవనాగమ్యా" అనే లలితా సహస్రనామాన్ని మనస్సునందుంచుకొని, భావన, మననము ద్వారా శ్రీమాతృచరణార్చనను నిర్వహించవలెను.

"సౌందర్యలహరి"లోని ప్రతి అక్షరము శ్రీమాత అక్షర ఆకారములోని భాగమే.

. ఎంత ఆర్తితో చేసాము అన్నది ముఖ్యం. లెక్క కాదు.  ఇదే మా గురువు గారు మాకు తెలియ చేసినది


ఇట్లు 
శివపరివారం 

No comments:

Post a Comment