Tuesday, May 12, 2020

కేయూరాణి న భూషయన్తి


*నరసింహ సుభాషితం - కేయూరాణి న భూషయన్తి*

*శ్లోకం:*

*केयूराणि न भूषयन्ति पुरुषं हारा न चन्द्रोज्ज्वला*  
*न स्रानं न विलेपनं न कुसुमं नालङ्कृता मूर्धजाः* I
*वाण्येका समलङ्करोति पुरुषं या संस्कृता धार्यते*
*क्षीयन्तेखिल भूषणानि सततं वाग्भूषणं भूषणम्* II

भर्तृहरि नीतिशतकम्  ।

*శ్లోకం:*

*కేయూరాణి న భూషయన్తి పురుషం హారా న చన్ద్రోజ్జ్వలా*
*న స్నానం న విలేపనం న కుసుమం నాలఙ్కృతా మూర్ధజాః* ।
*వాణ్యేకా సమలఙ్కరోతి పురుషం యా సంస్కృతా ధార్యతే*
*క్షీయన్తేఖిల భూషణాని సతతం వాగ్భూషణం భూషణమ్* ॥

భర్తృహరి నీతిశతకం

పై శ్లోకములోని నాలుగవ పాదానికి పాఠాంతరం:

*క్షీయన్తే ఖలు భూషణాని, సతతం, వాగ్భూషణం భూషణం*

*పద విభాగం:*
 
కేయూరాణి, న భూషయన్తి, పురుషం, హారాః, న, చన్ద్రోజ్జ్వలాః, న స్నానం, న విలేపనం, న కుసుమం, నాలఙ్కృతాః, మూర్ధజాః, వాణీ, ఏకా, సమలఙ్కరోతి, పురుషం, యా సంస్కృతా, ధార్యతే,
క్షీయన్తే, అఖిల భూషణాని, సతతం, వాగ్భూషణం, భూషణమ్.

*ప్రతిపదార్థం:*
 
కేయూరాణి = భుజ కీర్తులు లేదా దండ కడియాలు, న భూషయన్తి = అలంకరింపవు, పురుషం = పురుషుని, హారాః = ముత్యాల హారములు, న = న భూషయంతి = అలంకరింప బడవు, చన్ద్రోజ్జ్వలాః = చంద్రును వలె ప్రకాశించునటువంటి, న స్నానం = పన్నీటి జలకాలు అలంకరింపవు, న విలేపనం = పచ్చ కర్పూరము, కస్తూరి, కుంకుమ పువ్వు, మంచి గంధము మొదలగు సుగంధ ద్రవ్యాల సువాసనలతో కూడిన మైపూత అలంకరింపవు, న కుసుమం = పూవులు ధరించుట అలంకరింపదు, నాలఙ్కృతాః = అలంకరణలని ఈయజాలదు, మూర్ధజాః = వివిధ రకాల కేశాలంకరణలు,  

వాణీ = ఏ వాక్కు, (సా = ఆ వాణి) ఏకా = ఒక్కటియే, సమలఙ్కరోతి = సరిగా అలంకరించునది, పురుషం = పురుషుని, యా సంస్కృతా = వ్యాకరణాది శాస్త్రములచే సంస్కరింప బడినటువంటి, ధార్యతే = ధరింపబడుచున్నదో, క్షీయన్తే = కాలక్రమేణా నశించును,  అఖిల భూషణాని = మిగిలిన అఖిలములైన భూషణాలు, సతతం = ఎల్లప్పుడూ, వాగ్భూషణం = వాక్కు అనే ఆభరణము, భూషణమ్ = నిజమైన ఆభరణము. ఖలు = కదా!

*Meaning:*

The armlets on the upper arms are not the ones that adorn a man. Nor the necklaces and moon white colored pearls adorn a man. The luxurious baths, the expensive fragrantly body lotions, the garlands with beautiful flowers and the fashionable hair styles are not the ones that really adorn a man.  The pleasant, crisp and grammatically error free language of speech, the “Vaakku” that comes only with a good educational background is only the real jewelry that adorns a man.  
All other conventional jewelry gets spent out, whereas the good speech is only the real jewelry.      

*తాత్పర్యం:*

వాక్కు అనగా విద్య. ఆ వాక్కు యొక్క ప్రాముఖ్యాన్ని, దాని విలువని ప్రస్ఫుటముగా తెలియజెప్పే భర్తృహరి నీతిశతకములోని చక్కటి సుభాషితము.  

భుజ కీర్తులు గానీ దండ కడియాల వంటి అలంకరణలు పురుషుని అలంకరింపవు.  
చంద్రుని కాంతివలె ఉజ్జ్వలముగా ప్రకాశిచునటువంటి ముత్యాల హారములు, చంద్రహారములు సూర్య హారములు వంటి హారములు గానీ పురుషుని అలంకరింపవు. పన్నీటి జలకాలు, సుగంధ ద్రవ్యాల సువాసనలతో కూడిన శరీర లేపనములు మైపూతలు పురుషుని అలంకరింపవు. పూల ధారణలు, వివిధ రకాలా కేశాలంకరణలూ పురుషునికి నిజమైన అలంకరణలు కా జాలవు.

వ్యాకరణాది శాస్త్రములచేత సంస్కరింపబడినటువంటి ఏ వాక్కు అయితే పురుషునిచే ధరింపబడుచున్నదో ఆ ఒక్క వాక్కు మాత్రమే పురుషునికి సరియైన  అలంకారప్రాయమగు భూషణము. తక్కిన సువర్ణమయాదిభూషణములన్నియును క్రమేణ క్షీణించును. ఎల్లప్పుడును ధరింపబడియున్నట్టి వాక్భూషణమే నశించనటువంటి నిజమైన భూషణము.

భర్తృహరి యొక్క సుభాషితములలోని  నీతి శతకములో *వాక్కు* యొక్క ప్రాసస్థ్యాన్ని తెలియపరచే   తలమానికమైనట్టి ఈ సుభాషితమునకు, ఏనుగు లక్ష్మణ కవి యొక్క అంతటి దీటైన తెలుగు సేత ఈ క్రింది పద్యము.

ఉ.
*భూషలుగావు మర్త్యులకు భూరిమయాంగద తారహారముల్*,
*భూషిత కేశపాశ మృదు పుష్ప సుగంధ జలాభిషేకముల్ *
*భూషలుగావు, పూరుషుని భూషితుజేయు పవిత్ర వాణి, వా*
*గ్భూషణమే సుభూషణము, భూషణముల్ నశియించునన్నియున్* 

All India Radio ఆకాశ వాణి సంస్క్రుత భాషాధ్యయన కార్యక్రమములో గత 40 సంవత్సరాలకి పైగా ఆ కార్యక్రమము ఈ శ్లోకముతోనే ఆరంభమగుట ఈ శ్లోకము యొక్క విశిష్టతని తెలియ జేస్తోంది.  ఇది చాలామందికి సుపరిచితమైన సుభాషితము.  పురుషునకు విద్యయే ఆభరణము కాని వేరు కాదు అని సుస్పష్ఠము.

No comments:

Post a Comment