Thursday, April 16, 2026

సాంప్రదాయ వివాహం పద్దతి



" నాన్నా ఈ అమ్మాయి ఫోటో నాకు బాగా నచ్చింది అంటూ
 చేతిలో ఉన్న పది ఫోటోల్లో ఒకటి సెలెక్ట్ చేసి తండ్రి కి
 చూపించాడు రఘు. ఈ అమ్మాయి బీఎస్సీ బీడీ చదువుకుంది   రా !మరి నువ్వేమో సాఫ్ట్వేర్ ఇంజనీర్ వి మీ ఇద్దరికీ ఎలా
 కుదురుతుంది ?పైగా పిల్ల ఎక్కడో కోనసీమలో ఉంటోoది అన్నాడు రఘు తండ్రి రఘురామయ్య.

" లేదు నాన్న  టీచర్ ఉద్యోగమే బెస్ట్ ఆడవాళ్ళ కి. బోల్డన్ని సెలవులు ఉంటాయి . పైగా టైమింగ్ లు కూడా చాలా సౌకర్యంగా
 ఉంటాయి. నాకు ఆ కోనసీమ అంటే ఇష్టం. మనం రేపే
 పెళ్లిచూపులుకి వెళదాం అంటూ తండ్రి రఘురామయ్యని
 తొందరపెట్టాడు రఘు. రఘురామయ్యగారి భార్యతో ఆలోచించి పెళ్లి చూపులకు వస్తున్నామని పెళ్లికూతురు సీతాదేవి తండ్రి కృష్ణారావు గారికి కబురు పంపారు.

కృష్ణారావు గారు కోనసీమలోని అయినవిల్లి గ్రామంలో సైన్స్ టీచర్ గా పని చేస్తున్నారు. ఆయనకి ఇద్దరు పిల్లలు. కొడుకు కూతురులు ఇద్దరినీ బిఎస్సి బీఈడీ చదివించారు. 

చాలా సాంప్రదాయమైన కుటుంబం అని మధ్యవర్తుల ద్వారా విని రఘురామయ్య గారు భార్య పెళ్లి కొడుకు ,పెళ్లి కొడుకు చెల్లి హైదరాబాదులో రాత్రి 10 గంటలకు బస్సు ఎక్కి  తెల్లవారుజామున నాలుగు గంటలకి రావులపాలెంలో దిగి హోటల్ రూమ్ తీసుకుని కాసేపు ఫ్రెష్ అయిన తర్వాత కార్లో అయినవిల్లి గ్రామం బయలుదేరారు.

 ఫలనా రోజున పెళ్లి చూపులకు వస్తున్నామని కృష్ణారావు గారికి ముందుగానే కబురు పంపారు.ఎప్పుడూ కోనసీమ అందాలు పుస్తకాల్లోనూ, యూట్యూబ్లోనూ చూడడం తప్పితే ప్రత్యక్షంగా ఎప్పుడూ చూడలేదు రఘు. చుట్టూ అందమైన కొబ్బరి తోటలు, పచ్చటి వరి పొలాలు, గోదావరి నది ఒడ్డు, చల్లటి గాలి  అబ్బ స్వర్గంలో ఉన్నట్టుంది అనుకున్నాడు కారులో ప్రయాణిస్తూ రఘు.  రోడ్లు కూడా చాలా బాగున్నాయి అనుకుంటూ కోనసీమ అందాలను ఆస్వాదిస్తున్న సమయంలోనే పెళ్లి వారి ఇల్లు వచ్చేసింది.

పెళ్లి వారు కారు దిగిన వెంటనే కృష్ణారావు గారి దంపతులు ఎదురు వచ్చి నమస్కారం చేసి  కాళ్లు కడుక్కుని  "లోపలికి రండి  అంటూ పెద్ద ఇత్తడి  చెంబుతో నీళ్ళు అందించారు. అప్పటికే అక్కడ పెద్ద గంగాళం తోటి నీళ్లు పెట్టి ఉన్నాయి. కాళ్లు కడుగుకున్న  తర్వాత లోపలికి తీసుకువెళ్లి మర్యాదగా కుర్చీల్లో కూర్చోబెట్టి  మంచినీళ్ల గ్లాస్ అందించారు. 

ఆ కుర్చీలన్నీ కూడా పాతకాలంనాటి చెక్క కుర్చీలు . మంచినీళ్లు తాగిన తర్వాత ఇల్లు చూద్దాం రండి !అంటూ ఇల్లంతా తిప్పి చూపించారు.పెద్ద పెంకిటిల్లు. చుట్టూ అందమైన కొబ్బరి తోట మామిడి మొక్కలు అరటి మొక్కలు అక్కడ లేని మొక్క అంటూ లేదు వెనకాల పశువుల శాల తనకు సొంత వ్యవసాయం ఉందని ,ఇల్లు తన తండ్రిగారు కట్టారని  కృష్ణ రావు గారి మాటల్లో చెప్పారు. అక్కడ వాతావరణం అంతా చూడడానికి చాలా బాగుంది. చల్లటి గాలి. అందమైన ప్రకృతి. మాయా మర్మం లేనటువంటి మాటలు చాలా ఆనందపడ్డాడు పెళ్లి కొడుకు.

ఇంతలో కృష్ణారావు గారి భార్య పెరటి వైపుకు వచ్చి అందరూ ఫలహారం తీసుకుందాం !రండి అంటూ మర్యాదగా లోపలికి తీసుకువెళ్లింది. అప్పటికే అక్కడ శుభ్రంగా తుంగ చాపలు పరిచి ఉన్నాయి . ఎదురుగుండా అరిటాకులో కొద్దిగా కారప్పూస మినప సున్ని ,పాలకోవా ,పూతరేకు ,కొద్దిగా వేయించిన అటుకులు వడ్డించి ఉన్నాయి. ఇది టిఫినా! లేక భోజనమా !అని అనుమానం వచ్చింది పెళ్ళికొడుకు రఘు కి. ఇవన్నీ మేము స్వయంగా ఇంట్లో తయారు చేసుకున్నవి. బజారు వస్తువులు కాదు. అసలు మా ఆయన బజారు వస్తువులు తీసుకురారు పిల్లల్ని తిననివ్వరు. ఆరోగ్య సూత్రాలు బాగా పాటిస్తారు. పైగా సైన్స్ మాస్టారు కదా! అంటూ  కృష్ణారావు గారి భార్య కొసరి కొసరి వడ్డించింది.

 తినకూడదనుకుంటూనే పెళ్ళికొడుకు వాళ్ల మాటలు వింటూ ప్లేటు ఖాళీ చేసేసాడు. చాలా రుచిగా ఉన్నాయి.ఇవి నిజంగా ఇంట్లో తయారు చేసినవే. సాధారణంగా ఎవరైనా పెళ్లిచూపులు అంటే బజార్ నుంచి నాలుగు సీట్లు, నాలుగు హాట్లు తెచ్చి పెడతారు. ఎవరు తయారు చేస్తున్నారు ఇలాగా! ఇదివరకు పెళ్లి పెళ్లి చూపులకు వెళ్లిన చోట ఇలాగే కక్కుర్తి పడే ఒకటి రెండు స్వీట్లు తింటే ఆ డాల్డా నోరు పట్టుకుని వదలలేదు. పైగా వారం రోజులు దగ్గు కూడా ఏడిపించింది. ఇంతలో కృష్ణారావు గారి అబ్బాయి ఒక గాజు గ్లాసులో కొబ్బరిబొoడంనీళ్లు తీసుకువచ్చి అందరికీ ఇచ్చాడు. ఇవి కూడా మా దొడ్లోవే. వేసవికాలం కదా కాఫీ టీలు ఎందుకని ? అంటూ మాట పూర్తి చేయలేదు కృష్ణారావు గారు. 

ఇంతలో రఘురామయ్య గారు టైం అవుతుంది అమ్మాయిని తీసుకురండి అంటూ అడ గగానే కృష్ణారావు గారు భార్య పెళ్లి కూతుర్ని తీసుకొచ్చి కూర్చోబెట్టారు. నిజానికి సీతాదేవిలాగే ఉంది పెళ్లికూతురు ఆధునికమైన మేకప్ లు ఏమీ లేవు.  గోదావరి నీళ్ళల్లాగా ఆ మొహం లో స్వచ్ఛత కనబడింది పెళ్ళికొడుకు కి. ఆమె అలంకరణలో ఎక్కడ ఆధునికత కనబడలేదు. కట్టుబొట్టు అన్ని సాంప్రదాయంగా ఉన్నాయి. అమ్మాయి తోటి మీరేమైనా మాట్లాడతారా? అని అడిగారు పెళ్లికూతురు తల్లి. అంగీకారంగా తల ఊపేడు రఘు. ఇద్దరినీ వెంటబెట్టుకుని పెళ్లికూతురు తల్లి పక్క గదిలోకి తీసుకెళ్ళి  కూర్చోబెట్టింది.

ఇద్దరి మధ్య మాటలు లేవు చాలాసేపు. ఆఖరికి రఘు ధైర్యం చేసి మీ పేరు ఏమిటి? అని పలకరించాడు. సీతాదేవి అని నెమ్మదిగా చెప్పింది. సమాధానంలో ఎక్కడ కరుకుదనం లేదు. నీ పేరేమిటి అని తిరిగి అడగలేదు. అంటే పల్లెటూర్లో పుట్టి పెరిగిన పిల్ల కదా !ఎక్కువ భయం అనుకుంటాను అనుకున్నాడు. ఆ అమ్మాయి అడిగిన అడగకపోయినా తన పేరు చేస్తున్న ఉద్యోగం పూర్తి వివరాలు అన్ని చెప్పుకుంటూ వచ్చాడు. మీరేం చేస్తున్నారు! అని అడిగారు చివర్లో ఇక్కడ ప్రైవేట్ స్కూల్లో టీచర్ గా పని చేస్తున్నానంటూ చాలా నెమ్మదిగా చెప్పింది. ఇంత నెమ్మదిగా  మాట్లాడుతుంది ఏమిటి ?అసలు ఈ పిల్ల చెప్పిన పాఠాలు విద్యార్థులకు వినపడతాయా! వినపడవా! అనిపించింది రఘు కి.

 పది నిమిషాలు పిచ్చపాటి మాట్లాడుకున్న తర్వాత ఇద్దరు గదిలోంచి బయటకు వచ్చేసారు. బయటకు వచ్చిన తర్వాత తండ్రి చెవిలో తన అంగీకారం తెలియజేశాడు రఘు.
రఘురామయ్య గారు కూడా వారి మర్యాద, ఆ ఇంటి వాతావరణం, మాటతీరు, పెళ్లికూతురు నడవడిక చాలా నచ్చాయి. ఇదే విషయం భార్యతోటి కూతురు తోటి చర్చించి  మాకు మీ సంబంధం నచ్చింది అమ్మాయిని కూడా అడిగి మీకు కూడా నచ్చితే ఏ విషయం తెలియజేయండి అంటూ బయలుదేరడానికి సిద్ధమయ్యారు. 

కృష్ణారావు గారి దంపతులు కారు వరకు వచ్చి మర్యాదగా సాగనంపారు మగ పెళ్లి వారిని రఘురామయ్యగారు తాము  సాయంకాలం బస్సు కి హైదరాబాద్ వెళ్ళిపోతున్నామని అంతవరకు రావులపాలెం లోని హోటల్లోనే ఉంటామని చెప్పారు.

కృష్ణారావు గారి దంపతులకు పెళ్ళికొడుకు  ,ఉద్యోగం కుటుoబం బాగా నచ్చాయి  గాని  మనసులో ఇంకో దిగులు ఉంది. పెళ్లి విషయంలో  కృష్ణారావు గారి భావాలకి మగ పెళ్లి వారు ఒప్పుకుంటారో లేదో!. ఒప్పుకోకపోతే ఎలాగా మనసు చంపుకుని పెళ్లి చేయడం ఎలాగా?. మంచి సంబంధం వదులుకోలేరు. అందరికీ ఆదర్శంగా ఉండేలా ఉండాలని చిన్నప్పటినుంచి కృష్ణారావు గారి ఆశ. 

అలాగే ఉద్యోగ విషయంలో కూడా చాలా కష్టపడి పిల్లలకి పాఠాలు నేర్పిస్తాడు. ఆ గ్రామ పాఠశాలలో సొంత ఖర్చులతోనే ఒక ప్రయోగశాల నిర్మించాడు. అక్కడ లేని పరికరం లేదు. ఆదర్శ ఉపాధ్యాయుడుగా ఇప్పటికి రెండుసార్లు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ చేత అవార్డులు అందుకున్నాడు. 

"సరే ఎప్పటికైనా చెప్పక తప్పదుగా అనుకుంటూ భార్య కూతురు అంగీకారం తీసుకుని భార్యాభర్తలిద్దరూ రావులపాలెం బయలుదేరి  వెళ్ళేటప్పటికి మధ్యాహ్నం 3:00 అయింది.

కృష్ణారావు గారి దంపతులను సాదరంగాలోపలికి ఆహ్వానించి కూర్చోబెట్టి చేయగలిగిన మర్యాదలు అన్నీ చేశారు. "చూడండి మీ సంబంధం బాగా నచ్చింది మాకు. మా అమ్మాయి కూడా అంగీకారం తెలిపింది. మీ పద్ధతి, గౌరవo అన్ని బాగా మాకు నచ్చాయి. మాది ఏమీ లోటు లేని సంసారం. మేము అసలు సిటీలో ఉన్న పెళ్ళికొడుకుల సంబంధం చూడకూడదు అనుకున్నాము. కానీ మీ తండ్రి గారు మన కోనసీమ జిల్లా వాళ్లే కాబట్టి మన పద్ధతులు,  ఆచార వ్యవహారాలు ఒకే విధంగా ఉంటాయని ఉద్దేశంతో మిమ్మల్ని పెళ్లి చూపులకు ఆహ్వానించాం.

 అయితే పెళ్లి విషయంలో నాకు కొన్ని భావాలు ఉన్నాయి. అంటే నేను ఆధునిక భావాలతోటి పెళ్లి చేయలేను. పర్యావరణ పరిరక్షణ అంటే నాకు చాలా ఇష్టం. అంటే హంగులు ఆర్భాటాలు ఏవి ఉండవు. మన శాస్త్రం ఏ విధంగా చెప్పిందో పర్యావరణాన్ని పాడు చేయకుండా పూర్వీకుల పద్ధతిలో పెళ్లి చేసి పదిమందికి ఆదర్శంగా ఉండాలని నా ఆకాంక్ష. సాధారణంగా ఆడపిల్లల తల్లిదండ్రులు ఎవరు ధైర్యంగా ఈ మాట చెప్పరు. మగ పెళ్లి వారు ఏ విధంగా చేయమంటేనే ఆ విధంగా చేస్తారు పెళ్లి. అందుకనే ముందుగానే నా మనసులో ఉన్న విషయాలన్నీ చెప్పేస్తున్నాను. మీకు ఇష్టమైతే  తాంబూలాలు పుచ్చుకుందాం! అంటూ తన మనసులోని మాటని గబగబా చెప్పేశారు కృష్ణారావు గారు. 

"మాకు ఏమీ తొందర లేదు మీరు నిదానంగా ఆలోచించుకుని హైదరాబాద్ వెళ్ళిన తర్వాత కబురు చేయండి  అంటూ అరటిపళ్లబట్ట వాళ్లకి ఇచ్చి మా దొడ్లో  పండినవే. మేము మందులు మాకులు వాడము. మాది అంతా గో ఆధారిత వ్యవసాయం అంటూ నవ్వుతూ చెప్పి బయటకు వెళ్లిపోయారు కృష్ణారావు గారు.

మర్నాడు ఇంటికి వచ్చిన తర్వాత కుటుంబ సభ్యుల అభిప్రాయం అడిగి తెలుసుకున్నారు రఘు రామయ్య గారు. పెళ్ళికొడుకుని గుచ్చి గుచ్చి మరీ మరీ అడిగారు. అంటే కొంతమందికి పెళ్లి చాలా ఆర్భాటంగా జరగాలని పెద్దపెద్ద కళ్యాణ మండపాల్లో చేయాలని, ప్రీ వెడ్డింగ్ షూటింగు, పోస్ట్ వెడ్డింగ్ షూటింగు, డాన్సులు ,బ్యాండ్ మేళాలు, ఊరేగింపులు ఇవి ఈనాటి పిల్లల కోరికలు. అటువంటి ఉద్దేశం రఘుకు ఏమైనా ఉందేమో !అని చాదస్తంగా ప్రశ్నించారు.

 రఘు చెప్పిన మాటలు విని రఘురామయ్యగారికి చాలా ఆశ్చర్యం కలిగింది. "చూడు నాన్న ఈ హంగులు ఆర్భాటాలు ఊరేగింపులు డాన్సులు ఆ ఒక్క రోజుకు మాత్రమే ఉంటాయి. కానీ జీవితాంతం నాతో కలిసి ఉండేది ఆ పెళ్లికూతురు మాత్రమే. ఆమె నాకు మనస్ఫూర్తిగా నచ్చింది. పెళ్లి ఎలా చేసినా పర్వాలేదు ఆ అమ్మాయి తోటే నా పెళ్ళంటూ కచ్చితంగా చెప్పేసాడు రఘు. 

"తమకి కట్నకానుకలు ఏమీ వద్దని  పెళ్లి ఆడపిల్ల వారి ఇష్టప్రకారమే చేయమని తాంబూలాలు పుచ్చుకునే అవసరం లేదని డైరెక్ట్ గా ముహూర్తాలు పెట్టించమని కబురు పంపారు రఘురామయ్య గారు.

మొత్తానికి అనుకున్న శుభ ముహూర్తం రానే వచ్చేసింది. మగ పెళ్లి వారి అయినవిల్లి లోని విడిది ఇంట్లోకి తరలి వచ్చారు. ఆడపిల్ల వారు డోలు సన్నాయి బాజా భజంత్రీలతో గౌరవ మర్యాదలతో లోపలకి ఆహ్వానించారు. లోపలికి రాగానే చూస్తే ఆ విడిదిల్లు పెద్ద పెంకుటిల్లు. ఇంటి ముందు తాటాకులతో వేసిన పందిరి ,దానికి మావిడాకులు తోరణాలు ఇంటి లోపల ప్రతి గుమ్మానికి మావిడాకులు తోరణాలు ఇల్లు కొత్తగా వెల్లవేసినట్టుంది. గుమ్మాలకి పచ్చగా పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి ఉన్నాయి. సుమారుగా పది గదులున్నాయి. పెద్ద మండువా ఇల్లు. లోపల ఫ్యాన్లు ఉన్నప్పటికీ పెరటి వైపు నుంచి మంచి చల్ల గాలి. ప్రాణం చాలా హాయిగా ఉందనుకున్నారు మగ పెళ్లి వారు. 

బయట అరుగు మీద ఒక ఇరవై వరకు మడత మంచాలు గోడకు చేర వేసి ఉన్నాయి. అచ్చు పల్లెటూరి పెళ్లి లాగే ఉంది అనుకున్నారు. కాఫీ టిఫిన్లు రెడీగా ఉన్నాయి రండి అంటూ ఆడపెళ్లి వారు బొట్టు పెట్టి పేరుపేరునా ఆహ్వానించారు కృష్ణగా రావు గారి ఇంటికి మగ పెళ్లి వారిని. 

కృష్ణారావు గారి ఇంటికి వెళ్లేటప్పటికి ఇంటి వెనకాల ఉన్న పెరడులో పెద్ద తాటాకుల పందిరి వేసి ,పచ్చటి మావిడాకులు తోరణాలు కట్టి , నేలంతా   శుభ్రంగా అలికేసి, అందంగా ముగ్గులు పెట్టి  ,నేల బల్లలు వేసి, అరిటాకులో ఇడ్లీ కారప్పొడి పెసరట్టు ,రెండు రకాల పచ్చళ్ళు వడ్డించి రెడీగా ఉన్నాయి. పంచలు కట్టుకున్న వంట బ్రాహ్మలు చేతిలో  తాటాకు బట్టలతో అటు ఇటు తిరుగుతూ ఆప్యాయంగా వడ్డిస్తున్నారు. కృష్ణారావు గారు భార్య దగ్గరుండి కొసరి కొసరి వడ్డించారు. ఈ వంట బ్రాహ్మలు ఎక్కడి నుంచి తీసుకొచ్చారు? అని అడిగారు రఘు రామయ్య గారు. అమలాపురం పక్కనున్న ఇందుపల్లి నుంచి తీసుకొచ్చామని చెప్పారు.టిఫిన్ చాలా రుచికరంగా ఉందని మెచ్చుకున్నారు రఘు రామయ్య. 

కాఫీలు గాని టీలు గాని ఎక్కడ లేవు. పాలు తప్పితే చెరుకు రసం ఈ రెండింటితోటే  టిఫిన్ కార్యక్రమం ముగించారు. ఈ విందు చాలా వెరైటీగా ఉందని హైదరాబాద్ నుంచి వచ్చిన రఘురామయ్యగారి బంధువులు మెచ్చుకున్నారు. పెళ్లి వేదిక చూద్దురుగాని రండంటూ మగపెళ్లి వారిని కృష్ణారావు గారు ఆ పెద్ద పందిరిలోనే  తూర్పుముఖంగా కట్టిన పెళ్లి వేదిక దగ్గరికి తీసుకువెళ్లారు.. చుట్టూ అరటిగె లతో ఉన్న అరటి మొక్కలు ఆ నాలుగు రాటలకి కొబ్బరి ఆకులు లోపల  మామిడి తోరణాలు నాలుగు పక్కల మల్లెపూల దండలు అబ్బా !ఎంత అందంగా ఉంది కళ్యాణ వేదిక.మధ్యలో ట్యూబ్ లైట్లుతో చాలా చూడముచ్చటగా ఉంది. ఎక్కడ అధునాతన అలంకరణలు లేవు.
 కంటికి ఆకర్షణీయమైన రంగులే గాని ప్రమాదకరమైన రంగులు లేవు.సాయంకాలము ఈ మల్లెపూలు దండలు తీసేసి గులాబీ దండలు కడతామని చెప్పారు కృష్ణారావు గారు

 పురోహితులనుకుంటాను ఒక వారగా కూర్చుని స్నాతకం ఏర్పాట్లు చేస్తున్నారు. కృష్ణారావు గారిని చూడగానే "అయ్యా మళ్లీ దుర్ముహూర్తాలు వచ్చేస్తాయి. స్నాతకం పీటల మీద కూర్చోవాలని మగ పెళ్ళి వారికి చెప్పండి అంటూ తొందర పెట్టాడు."నమస్కారం నా పేరు రఘురామయ్య నేను పెళ్ళికొడుకు తండ్రిని మీది ఏ ఊరు? అంటూ ప్రశ్నించారు. అయ్యా మాది తణుకు పక్కన ఉన్న ఇరగవరం. మేము వేద పండితులం. మా గురువుగారు సాయంకాలం వస్తారు అంటూ చెప్పుకుంటూ వచ్చారు. 

"సరేనండి మేము తయారయ్యే వస్తాo అంటూ మగపెళ్లివారు వెళ్లిపోయారు .కాసేపటికి  కృష్ణారావు గారు  మేళతాళాల తోటి భజంత్రీలు తోటి  పెళ్ళికొడుకుని పల్లకిలోను మగ పెళ్లి వారిని  వేదిక దగ్గరికి సగౌరవంగా తీసుకుని వచ్చారు. ముందుగానే చెప్పిన విధంగానే ఫోటోగ్రాఫర్ వేదికను ఎక్కకుండా కింద పందిరి లోనే కెమెరా పెట్టుకుని ఫోటోలు వీడియోలు తీయడానికి ప్రయత్నం చేస్తున్నాడు. 

కాశీ ప్రయాణం సజావుగా జరగకుండా బావమరిది బతిమాలి అక్కను పెళ్లి చేస్తానని మాట ఇచ్చి నోరు తీపి చేసి పెళ్ళికొడుకును వెనకకు తీసుకొచ్చాడు. పురోహితులు గారు ఎక్కడా కాంప్రమైజ్ అవ్వకుండా మంత్రాలుదాటించకుండా శాస్త్ర ప్రకారం  స్నాతకం పూర్తి చేసేటప్పటికి మధ్యాహ్నం ఒంటి గంట అయింది. 

ఈ మధ్యకాలంలో ఇంత సేపు స్నాతకం చేయించిన వారిని ఎక్కడ చూడలేదు అనుకుని రఘురామయ్య గారు సంతృప్తి పడ్డారు. నిజమే మరి ఆ కాలం మనుషులకి ఆ కార్యక్రమ యొక్క విలువ ఏమిటో తెలుస్తుంది.

ఈలోగా కృష్ణారావు గారు భార్య మగ పెళ్లి వారిని వంటలు రెడీగా ఉన్నాయని "వంటలు రెడీగా ఉన్నాయి భోజనాలకు రండి  అని బొట్టు పెట్టి ఆహ్వానించారు ప్రతి ఒక్కరిని. 
ఉదయం లాగే నేల బల్లలు వేసి ఎదురుగుండా అరిటాకు లో  పప్పు టమాట, కొత్త అవకాయి, గుత్తి వంకాయ కూర, పనసపొట్టు కూర బూరె లు ,పులిహార  ,ముక్కల పులుసు అప్పడాలు ,వడియాలు తో ఆకు అంతా నిండుగా ఉంది. గాజు గ్లాసులతో మంచినీళ్లు చక్కగా పెట్టి ఉన్నాయి.కొమ్ము చెంబుతో నెయ్యి పట్టుకుని మడి కట్టుకున్న వంట బ్రాహ్మలు పెళ్లి వారికి వడ్డనలోమునిగిపోయారు. కృష్ణారావు గారు భార్య ప్రతి వారి దగ్గరికి వచ్చి ఏం కావాలో? దగ్గరుండి చూసుకుంటున్నారు.

 అసలు ఈ కాలంలో క్యాటరింగ్ భోజనాలు తప్పితే ఇలా గౌరవంగా మర్యాదలతో ఆప్యాయంగా భోజనాలు వడ్డించేవారిని చూడలేదని ఊరి ప్రజలతో పాటు హైదరాబాదు పెళ్ళివారు కూడా ఆనందపడ్డారు. భోజనాల్లో ఎక్కడ అధునాతనమైన వంటలు గానీ ,మసాలా దినుసులు గాని కృష్ణారావు గారు వాడనివ్వలేదు. అంతా సాంప్రదాయ పద్ధతే తృప్తిగా భోజనం చేసి మగపెళ్లి వారు ఆనందంగా విడిదిలోకి వెళ్లిపోయారు. వెళ్లేటప్పుడు తమలపాకులు వక్కపొడి సున్నం రాసి చిలకల్లా చుట్టి పెళ్ళివారికి అందించారు ఇది చూడడానికి చాలా అందంగా ఉంది.

సాయంకాలం ఆరు గంటలకల్లా ఎదురు సన్నాహాలని  , మధ్యాహ్నం పూట ఫలహారాలు విడి దిలోకే తీసుకొస్తామని, రాత్రి ఏడు గంటలకు అలా పెళ్లి పీటల మీద కూర్చోవాలని ఒకపక్క పెళ్లి అవుతుంటే మరొక పక్క భోజనాలు ఏర్పాట్లు చేసుకుంటామని రఘురామయ్యగారికి చెప్పాడు కృష్ణారావు గారు.

పెళ్లిలో ప్రతి కార్యక్రమం నిదానంగా ఆనందంగా నడిపిస్తేనే దాని అందం తెలుస్తుంది. మగ పెళ్లి వారిని బెల్లం పానకంతో నోరు తీపి చేసి ,ఆడపడుచులను ఇత్తడి బిందువులతో సత్కరించి, శుభలేఖను తప్పులు లేకుండా చదివి ఇరు వర్గాల పెళ్లి వారిని ఒకరినొకరు సత్కరించుకుని అందంగా ఆనందంగా పరిచయాలు పూర్తి చేసుకుని ఎదురు సన్నాహం కార్యక్రమం ముగించి "భోజనాలు రెడీ అంటూ ఆహ్వానించారు.
శనివారం నియమం ఉన్నవాళ్లు టిఫిన్లు, కాని వాళ్ళు భోజనాలు ఉదయం లాగే అరిటాకులలో నేల బల్లల మీద కూర్చుని సంతృప్తిగా భోజనాలు కాని చ్చారు. రాత్రి భోజనానికి బంగాళదుంప ఉప్మా కూర ,అరటికాయ వేపుడు, కొబ్బరికాయ పచ్చడి ,సాంబారు, అప్పడాలు ,వడియాలు, బొబ్బట్లు, పొట్టి కాజా ,అరటికాయ బజ్జి, గడ్డ పెరుగు లు తయారు చేయడంలో ఇందుపల్లి వంట వాళ్ళు తమ ప్రతాపం చూపించారు. మజ్జిగ లోకి మామిడిపండు అంటూ కొసరి కొసరి వడ్డించారు. కోనసీమ భోజనమా మజాకా. వంట వాళ్ళు అటు ఇటు వడ్డన చేస్తూ నాలుగైదు గాజు గ్లాసులు పగలగొట్టేశారు. 

ఈ కృష్ణారావు గారి శ్రద్ధ చూడండి ఫలహారాలు భోజనాలకి అరటి ఆకులు   ,మంచినీళ్లకి గాజు గ్లాసులు వాడి పర్యావరణానికి పెద్ద పీట వేశారు. ఎక్కడా ప్లాస్టిక్ అనే మాట లేదు. 

డైనింగ్ టేబుళ్లు షామియానాలు కుర్చీలు  అసలు లేవు. 
ఎందుకంటే షా మియనాలు ఈ మధ్యన చావుకి ,పెళ్లికి కూడా అవే  వాడేస్తున్నారు. అదీ కృష్ణారావు గారు భయం. ఎన్నాళ్ళయిందో ఇలాంటి పెళ్లి చూసి అని మగపెళ్లి వారు అనుకున్నారు. ఇక పెళ్లి సందడి మొదలైంది. పెళ్లి తంతులన్నీ శాస్త్రం చెప్పిన ప్రకారం యధావిధిగా పురోహితులు వారు చేయించుకుంటూ వెళ్ళిపోతున్నారు.

 తలంబ్రాలు స్వచ్ఛమైన బియ్యంతో ఆనందంగా ,సంతోషంగా పెళ్లికూతురు ,పెళ్ళికొడుకు నిదానంగా ఒకరి తల మీద ఒకరు పోసుకున్నారు. పెళ్లి మండపం మీద పురోహితులు కన్యాదానం చేసే వాళ్ళు మగ పెళ్లి వారిలో ముఖ్యులు పెళ్ళికొడుకు, పెళ్ళికూతురు తప్ప ఇంకెవరికి ఆస్కారం ఇవ్వలేదు కృష్ణారావు గారు. దాని మూలంగా ఆహుతులు అందరికీ కూడా పెళ్లి శుభ్రంగా కనబడింది. యధావిధిగా కార్యక్రమాలన్నీ తూచా తప్పకుండా చేయించి మర్నాడు ఉదయమే అయినవిల్లి వినాయకుడి దర్శనం చేయించి నూతన దంపతులను పెళ్లి వారిని సాగనంపారు.

రఘురామయ్య గారు బస్సు ఎక్కబోతు ఈ పెళ్లి ఆరోగ్యకరమైన పెళ్లి అని చాలా సంతోషంగా ఉందని ఇది చాలా కాలం పాటు ప్రజలందరూ చెప్పుకుంటారని ఆదర్శవంతమైన వివాహం అని పదేపదే కృష్ణారావు గారిని ప్రశంసించి హైదరాబాద్ వెళ్లిపోయారు. 

ఈ పెళ్లి గురించి పేపర్ వాళ్ళు టీవీలు వారు పెద్ద ఎత్తున ప్రచారం చేసాయి. పర్యావరణానికి పెద్ద ఎత్తున పీఠo వేసే ఆ జిల్లా కలెక్టర్ గారు కృష్ణారావు గారిని రఘురామయ్య గారిని ఇద్దరిని సన్మానించి గౌరవించారు.....

Thursday, June 19, 2025

ఉత్తరాలు - ప్రత్యుత్తరాలు

ఉత్తరాలు - ప్రత్యుత్తరాలు 
"ఒకప్పుడు పోస్ట్‌మ్యాన్‌ను చూస్తే బంధువును చూసినట్టే ఉండేది
ఉత్తరం చదువుతుంది మమకారంతో మాట్లాడుతుంది అనుభూతి కలిగేది
ఈ రోజుల్లో వీడియో కాల్స్ మాట్లాడుతున్నా.. ఆ అప్యాయత కనిపించడం లేదు!"
ఈనాటి తరానికి దూరమైన ఉత్తరాలు... ఒకప్పుడు మా తరం వరకు ఇవి అందరికీ పరిచయమైనవే. మా ఇంట్లో నాకు ఉత్తరాలు వ్రాసే అలవాటు బాగా ఉండేది. ఎందుకంటే అప్పట్లో నాన్నగారు అమ్మ  భీమవరం లో  ఉండేవారు. మేము హైదరాబాద్‌కి వచ్చిన కొత్తల్లో, ఇక్కడ జరిగిన విషయాలు అన్నీ సవివరంగా వ్రాసేవాడిని. ఇంచుమించు మూడు నాలుగు పేజీలు ఉండేవి. నాన్నగారికి నా దగ్గర నుంచి ఉత్తరం వచ్చింది అని అమ్మ చెప్పేది. నాన్నగారు తీరిగ్గా భోజనం చేసి, అమ్మ పనులు ముగించుకున్నాక, ఇద్దరూ కలసి ఆ ఉత్తరాన్ని చదివేవారు. నాన్నగారు ఆలా ఊ కొట్టుతూ వింటూ ఉండేవారు. నా ఉత్తరం చదవడం అయ్యాక, అమ్మ – "ఇదండీ విశేషాలు, చిన్నాడివి వ్రాసినవి" అనేది.

రెండు రోజులకు ఒకసారి నాన్నగారు అడిగేవారు – "చిన్నాడు ఉత్తరం వ్రాశాడా?" అని. కనీసం పోస్ట్‌కార్డు, కవర్‌, ఇన్లాండ్ లెటర్‌,  పంపే వాడిని. నా దగ్గర ఎప్పుడూ స్టాంపులు స్టాక్‌లో ఉండేవి. కొత్త స్టాంపులు వస్తే కోనేసేవాడిని . పోస్ట్ ఆఫీస్ కి నాకు చాల అవినాభావ సంభందం ఉండేది అప్పట్లో ... 

నేను చాలా కాలం మా తాతగారు, తాతనాన్న వ్రాసిన ఉత్తరాలు దాచుకున్నాను. వాళ్ల దస్తూరి (చెరసి, రాత) చాలా శుభ్రంగా, చక్కగా ఉండేది.

అలాగే మా చిన్నతనం లో "మా మావయ్య (ఓరుగంటి వేణు గోపాలకృష్ణ) అప్పట్లో అమెరికా, జర్మనీలో ఉండేవారు. మా మావయ్య కూడా అక్కడి విశేషాలు, అనుభవాలు అన్నీ సమగ్రంగా ఉత్తరాల్లో వ్రాసి పంపేవారు. ఆ ఉత్తరాలు మేము మళ్ళీ మళ్ళీ చదువుతుండేవాళ్లం. మావయ్య ఉత్తరాల్లో అమెరికా విశేషాలు, తాను ఎక్కడెక్కడికైనా వెళ్లారో వివరంగా వ్రాసేవారు. ఆ వివరాలను మేమూ చదివి, మేమూ అక్కడికి వెళ్లినట్టే ఫీలయ్యేవాళ్లం. ఆ విశేషాలు మా స్నేహితులకు కూడా ఉత్సాహంగా చెప్పుకునే వాళ్లం. తర్వాత మావయ్య అక్కడ తీయించిన ఫోటోలు పంపేవారు. ఆ ఫోటోల వెనుక చిన్న కాగితం అతికించి, ఆ ప్రదేశం గురించి, దాని విశిష్టత గురించి వివరంగా వ్రాసేవారు."
ఇప్పుడు తపాలా..తప్పయిపోయింది మన్నించు..ఎన్ని సంవత్సరాల అనుబంధం , తర తరాలు  గా పెంచుకున్నాం..పంచుకున్నాం.. ఇప్పుడు తుంచుకున్నాం..! తుంచేశాము కూడా 
ఊహ తెలిసిన కొత్తలో వీధి చివర పోస్టు డబ్బా ఇదేంటబ్బా..అదో జిజ్ఞాస ఇంటికి పోస్ట్ మాన్ వస్తే చుట్టమొచ్చినంత సంబరం 
కవర్ అందుకుని అమ్మకో నాన్నకో ఇచ్చాక కొస చింపుతుంటే అదో ధ్రిల్..
సినిమాల్లో గుమ్మడో, ఏయెన్నారో ఉత్తరం చదువుతున్నప్పుడు  సావిత్రి కనిపించినట్టు ఉండేది 
అమ్మ చేతి  లేఖలో అమ్మమ్మ.. నాన్న చదివే లెటర్లో బాబాయ్  కనిపిస్తారేమోనని భ్రమ..అప్పుడప్పుడు 
పోస్ట్ మాన్ డబ్బిస్తే  అదో ప్రశ్న..ఎందుకు ఇస్తున్నారు అని..!? మా నాన్నమ్మ మనీ ఆర్డర్ కోసం అప్పట్లో ఎదురు చూపులు 
ఎన్ని కబుర్లు..ఎన్నెన్ని విశేషాలు..సంగతులు..సమాచారాలు..కుశలాలు..కౌసలాలు..
వందల కిలోమీటర్ల  దూరంలో చదువుకుంటున్న  బాబాయ్ డబ్బులు పంపండి అంటూ కొన్ని ఉత్తరాలు 
తాతకు వేదన అప్పు కోసం యాతన.. అని మరికొన్ని .. చాలా ప్రశ్నలకు  ఒకటే ... జవాబు
అలాంటి ఉత్తరం లు ఇప్పుడు ఇంచుమించు అదృశ్యం.. అలా కాకపోయినా  అరుదైన దృశ్యం..
ఎన్నో తరాలకు ఉత్తరకాండ. ప్రస్తుతం దాని బ్రతుకే అరణ్యకాండ..!
ఇక ఇప్పుడు స్మార్ట్ ఫోన్ వచ్చాక  ఉత్తరాలు..ప్రత్యుత్తరాలు..అన్ని ఒక పరంపర లోనే 
అన్నిటికీ ఫోనే గతి.. ఆ క్రమంలో  ఉత్తరానికి హారతి..
ఎర్ర డబ్బా.. ఇప్పుడెక్కడబ్బా.. ఎగిరిపోయిందా ... 

ఇట్లు 
శర్మ రాణీ

Sunday, March 23, 2025

శ్రీకాళహస్తీశ్వర శతకమును అర్థాలతో

శ్రీకాళహస్తీశ్వర శతకమును అర్థాలతో

శ్రీకాళహస్తీశ్వర శతకమును మహాకవి ధూర్జటి రచించినారు. ధూర్జటి శ్రీ కృష్ణదేవరాయల అష్టదిగ్గజాలలో ఒకడు. కాళహస్తీశ్వర భక్తుడు. ఇతనిని పెద ధూర్జటి అని అంటారు, ఎందుకంటే ఇదే పేరుతో ఇంకో నలుగురు ధూర్జటులు ఉన్నారు. ధూర్జటి 16వ శతాబ్దము ఉత్తర భాగములో 1480 నుండి 1545 వరకు జీవించిఉండవచ్చని భావిస్తున్నారు. ఈయన ఆనాటి పొత్తపి సీమ లోని, ప్రస్తుతం చిత్తూరు జిల్లా లో ఉన్న శ్రీకాళహస్తి పట్టణ వాస్తవ్యుడు. ఈయన తల్లితండ్రులు సింగమ మరియు రామనారాయణ. ఈయన తాత పేరు జక్కయ నారాయణ. వీరి పేర్లను బట్టి ధూర్జటి జన్మత: వైష్ణవుడైనా ఆ తరువాత కాలములో గొప్ప శివభక్తుడైనాడని భావిస్తున్నారు. ధూర్జటి అష్టదిగ్గజములలో ప్రధానమైనవాడు. భక్తి ప్రబంధమైన శ్రీకాళహస్తి మహత్యం మరియు శైవ శతకమైన శ్రీకాళహస్తీశ్వర శతకం ఈయన యొక్క రెండు ప్రధాన రచనలు. ఆయా రీతులలో ఇవి మహోన్నత కావ్యాలు. ధూర్జటి చెప్పినవి మరియు ధూర్జటిపై చెప్పబడినవిగా అనేక చాటువులు ఆంధ్ర దేశములో ప్రచారములో ఉన్నవి.

 
శ్రీకాళహస్తీశ్వర శతకమును అర్థాలతో

శ్రీ విద్యుత్కలితాజవంజవ మహాజీమూత పాపాంబు ధా
రా వేగంబున మన్మనోబ్జ సముదీర్ణత్వంబుఁ గోల్పోయితిన్
దేవా! నీ కరుణా శరత్సమయ మింతేచాలు; చిద్భావనా
సేవన్‌ దామర తంపరై మనియెదన్ శ్రీ కాళహస్తీశ్వరా!     1
సంపదలు అనే మెరుపు తీగలతో కూడిన, సంసారమనే మేఘముల నుండి కురిసిన, పాపములనే నీటిధారల చేత నా మనఃపద్మము కాంతిలేక చిన్నబోయినది. నీ దయ అను శరత్కాలము వచ్చినది. చాలు. ఇంక నా మనఃపద్మము వికసించుటే కాదు సర్వసమృద్ధులు కలవాడనై, నీ చిన్మూర్తిని ధ్యానించుచూ బ్రతుకుతాను. (పద్మములు వానదెబ్బకు వాడిపోవును. శరత్కాలములో వికసించి కాంతివంతమగును).
వాణీవల్లభ దుర్లభంబగు భవద్ద్వారంబున న్నిల్చి, ని
ర్వాణశ్రీఁ చెరపట్టఁ చూచిన విచారద్రోహమో, నిత్య క
ళ్యాణ క్రీడలఁ బాసి, దుర్దశలపాలై, రాజలోకాధమ
శ్రేణీ ద్వారము దూరఁ జేసి తిపుడో శ్రీకాళహస్తీశ్వరా!         2
ఈశ్వరా! బ్రహ్మాదులకు కూడా సాధ్యం కాని, నీ ఇంటి సింహద్వారదేశమున నిలిచి ముక్తికాంతను చేపట్టాలను ఆలోచన, నా వంటి అల్పుడు చేసినందువల్లనో ఏమోకానీ, నీ సేవాభాగ్యమునకు దూరమై, అధములైన రాజులను సేవించునట్లు చేసినావు కదా!
అంతా మిథ్య తలంచి చూచిన నరుండట్లౌ టెరింగిన్ సదా
కాంతల్‌ పుత్రులు నర్థముల్ తనువు నిక్కంబంచు మోహార్ణవ
భ్రాంతింజెంది చరించుగాని, పరమార్థంబైన నీయందుఁ దా
జింతాకంతయుఁ జింత నిల్పడు గదా, శ్రీ కాళహస్తీశ్వరా!     3
ఆలోచించినచో ఈ జగత్తంతా మాయేకదా! మానవుడా సంగతి తెలిసీ కూడా, భార్య, పుత్రులు, ధనము, తన శరీరము అన్నీ శాశ్వతము అని భావించి మోహము పొందుచూ, జీవనమునకు పరమార్థభూతుడవైన నిన్ను మనసులో ఒక్క నిమిషమైననూ ధ్యానించడు కదా! ఎంత అజ్ఞానము.
నీ నా సందొడఁబాటుమాట వినుమా! నీ చేత జీతంబు నే
గానిం బట్టక సతతంబు మది వేడ్కంగొల్తు నంతస్సప
త్నానీకంబున కొప్పగింపకుము నన్నాపాటియే చాలుఁదే
జీ నొల్లన్‌ గరినొల్ల నొల్ల సిరులన్ శ్రీ కాళహస్తీశ్వరా!         4
ఈశ్వరా! నీకూ నాకూ అంగీకారమైన మాట ఒకటి చెప్తాను వినుము. నీ నుండి ఏ కాణీ కూడా జీతము ఆశింపక, నిత్యము నిన్ను సేవిస్తాను. నీవు నన్ను కామక్రోధాదులైన లోపలి శత్రువులకు అప్పగింపక రక్షించు. ఆ అనుగ్రహము చాలు. ఇంక నాకు గుర్రాలు వద్దు. ఏనుగులు వద్దు. ఐశ్వర్యములు వద్దు. అటువంటివేమీ కోరను.
భవకేళీ మదిరా మదంబున మహా పాపాత్ముడై వీడు న
న్ను వివేకింప డటంచు నన్ను నరకార్ణోరాశి పాలైనఁ బ
ట్టవు, బాలుండొక చోట నాటతమితోడన్‌ నూతఁ గూలంగఁ దం
డ్రి విచారింపక యుండునా? కటకటా! శ్రీ కాళహస్తీశ్వరా!     5
జనన మరణ రూపమైన సంసారమనే ఆటలోపడి, కల్లు తాగినట్లు మత్తెక్కి అదే సుఖమనుకొని యీ నరుడు మహాపాపియై నన్ను (భగవంతుని) తెలుసుకొనలేకున్నాడని, నరక సముద్రములో మునిగిపోతుండగా చూస్తూ ఊరుకుంటావా? ఆటలధోరణిలో బాలుడు బావిలో పడినప్పుడు తండ్రి వానిని గురించి పట్టించుకొనకుండా ఊరుకుంటాడా? నీవు నన్ను రక్షింపకుండుట న్యాయము కాదని భావము.
స్వామిద్రోహము చేసి వేరొకనిఁ కొల్వన్‌ బోతినో? కాక నే
నీ మాట ల్విననొల్ల కుండితినో? నిన్నే దిక్కుగాఁ జూడనో?
యేమీ, యిట్టి వృధాపరాధి నగు న న్నీ దు:ఖవారాశి వీ
చీ మధ్యంబున ముంచి యుంపదగునా? శ్రీ కాళహస్తీశ్వరా!     6
ఈశ్వరా! నిన్ను కాదని స్వామి ద్రోహము చేసి, మరొక దేవుని సేవించానా? పోనీ, నీవు చెప్పిన వేదవాక్యములపై నమ్మకము లేక నిరాదరణ చేసి, నాస్తికుడనైతినా? నిన్నే దిక్కుగా భావించలేదా? ఏ తప్పూ చేయని నన్ను, ఈ సంసార దు:ఖసముద్రంలో ముంచి, చూసి వినోదించటం నీకు న్యాయమా? నన్ను ఉద్ధరించటం నీ కర్తవ్యం కాదా? (పరమేశ్వరుని ముఖము నుండి వేదాలు పుట్టినవని ప్రసిద్ధి. వారిని నమ్మినవారిని నాస్తికులంటారు.)
దివిజక్ష్మారుహ ధేను రత్న ఘనభూతిన్ ప్రస్ఫురద్రత్న సా
నువు నీ విల్లు; నిధీశ్వరుండు సఖుఁ డర్ణోరాశి కన్యా విభుం
డు విశేషార్చకుఁ డింక నీ కెన ఘనుండున్ గల్గునే? నీవు చూ
చి విచారింపవు; లేమినెవ్వఁడుడుపున్? శ్రీ కాళహస్తీశ్వరా!     7
కల్పవృక్షము, కామధేనువు, చింతామణి మొదలైన ఐశ్వర్యప్రదములైన వస్తువులతో నిండి ఉన్న బంగారు పర్వతము నీకు విల్లు. నవనిధులకు నాయకుడైన కుబేరుడు నీకు ప్రియమిత్రుడు. లక్ష్మీపతి అయిన నారాయణుడు నీ పరమ భక్తుడు. ఇన్ని ఉన్నా నీకంటే గొప్పవాడెవ్వడు? వీరిలో ఏ ఒక్కరితోనైనా చెప్పి దరిద్రమును పోగొట్టగల సామర్ధ్యము నీకున్నది. అయినా ఆ పని చేయవు. నిన్ను మరిచిపోతానని భయమా? నా మీద నీ అనుగ్రహ దారిద్రమును పోగొట్టేవాడవు నీవే తప్ప ఇంకెవరున్నారు?
నీతో యుద్ధము చేయనోపఁ; గవితానిర్మాణశక్తి నిన్నున్
బ్రీతుం చేయగలేను; నీ కొరకుఁ తండ్రిన్ చంపగాఁజాల; నా
చేతన్ రోకట నిన్ను మొత్తవెరతున్‌; చీకాకు నా భక్తి, యే
రీతిన్నాకిక నిన్నుఁ చూడగలుగున్? శ్రీ కాళహస్తీశ్వరా!     8
అర్జునునిలాగా నీతో యుద్ధము చేయలేను. కవిత్వము చెప్పి నిన్ను సంతోషపరచలేను. శివభక్తుని వలే తండ్రిని చంపలేను. శివభక్తురాలి వలే నిన్ను రోకలితో మొత్తలేను. నా భక్తి, నాకు అడ్డమై నీ దయను పొందనీయకుండా చేస్తుంది. నిన్ను చూసే అవకాశం ఇంక నాకెలా కలుగుతుంది?
ఆలున్ బిడ్డలు తల్లిదండ్రులు ధనంబంచు న్మహాబంధనం
బేలా నా మెడ గట్టినాడ విక నిన్నేవేళఁ జింతింతు, ని
ర్మూలంబైన మనంబులో నెగడు దుర్మోహాబ్ధిలోఁ గ్రుంకి, యీ
శీలామాలపుఁ జింత నెట్లుడిపెదో శ్రీ కాళహస్తీశ్వరా!         9
ఈశ్వరా! భార్యాపుత్రులు, తల్లిదండ్రులు, ధనములు అనే పాశములను నా మెడకు చుట్టావు. ఈ వ్యామోహంలో పడి నిన్ను నేనెట్లా స్మరించగలను? ఈ భరింపరాని దుఃఖము ఎలా పోగొడతావో శంకరా! నీ దయ.
నిప్పై పాతకతూలశైల మడచున్ నీనామము న్మానవుల్
తప్పన్ దవ్వుల విన్న నంతకభుజాదర్పోద్ధత క్లేశముల్
తప్పుం దారును ముక్తులౌదురనిశాస్త్రంబుల్‌ మహాపండితుల్
చెప్పంగాఁ దమకింక శంకలుండవలెనా? శ్రీ కాళహస్తీశ్వరా!     10
శ్రీకాళహస్తీశ్వరా! నీ పేరు స్మరిస్తేనే కొండల వంటి పాపాలు పోతాయని, యముని వల్ల కలుగు నరకబాధలు తప్పుతాయని వేదశాస్త్రాలు, పండితులు చెప్తుంటే, ఈ మానవులకు ఇంకా అనుమానాలెందుకు? నీ పేరును స్మరించుటకు సిద్ధపడరెందుకు?
వీడెం బబ్బినయప్పుడున్, దమనుతుల్ విన్నప్పుడుం, బొట్టలో
గూ డున్నప్పుడు, శ్రీవిలాసములు పై కొన్నప్పుడుం గాయకుల్
పాడంగా వినునప్పుడుం చెలగుదంభప్రాయ విశ్రాణన
క్రీడాసక్తుల నేమి చెప్పవలెనో శ్రీ కాళహస్తీశ్వరా!         11
ఈశ్వరా! నిన్ను, నీ ధ్యానమును మరచి, తమకు తాంబూలము దొరికినప్పుడు, అనగా భోగములు కలిగినప్పుడు, తమను ఎవరైనా పొగిడినప్పుడు, కడుపునిండా తిండి ఉన్నప్పుడు, ఐశ్వర్యవైభవములు బాగా ఉన్నప్పుడు, గాయకులు పాడినప్పుడు తమ గొప్పతనమును చూపుటకై ఆడంబరముగా దానధర్మములు చేస్తూ విర్రవీగు వారిని ఏమనాలో తెలియదు.
నిను సేవింపగ నాపదల్పొడమనీ, నిత్యోత్సవం బబ్బనీ,
జనమాత్రుండననీ, మహాత్ముడననీ, సంసార మోహంబు  పై
కొననీ, జ్ఞానము గల్గనీ, గ్రహగతుల్ కుందింపనీ, మేలు వ
చ్చిన రానీ, యవి నాకు భూషణములే శ్రీ కాళహస్తీశ్వరా!     12
ఈశ్వరా! నేను నిన్ను సేవిస్తుండగా, నాకు కష్టాలు రానీ, సుఖాలు రానీ, నన్ను లోకము సామాన్యుడననీ, గొప్పవాడననీ, సంసార వ్యామోహము కలుగనీ, జ్ఞానమే కలుగనీ, గ్రహాచారము నన్ను క్రుంగదీయనీ లేక మంచి చేయనీ, అవి అన్నీ నాకు ఆభరణములు వంటివే అవుతాయి. నీ పాదసేవ చేస్తున్న నాకు అన్నీ నీ అనుగ్రహములు గానే కనిపిస్తాయి.

Sunday, February 23, 2025

భళా కుంభమేళా ఇది ఒక మహా యజ్ఞం..



*_భళా కుంభమేళా.._*
*ప్రదర్శనం కాదది నిదర్శనం*
ఒక మహా యజ్ఞం..
గొప్ప క్రతువు..
ఇలలో జరుగుతున్న అద్భుతం..
కలియుగంలో దేవుని ఉనికిని  
చాటుతూ సాగుతున్న
అత్యద్భుత ఆధ్యాత్మికయాగం..
కోట్లాది మంది ఒకటిగా
జరుపుకుంటున్న 
దైవ కార్యక్రమం..
నభూతో నభవిష్యతి..
*_కుంభమేళా.._*
*_మహాకుంబ మహాకుంభ మహా కుంబ్.!_*

నలభై అయిదు రోజులు..
*_ప్రయాగరాజ్..హరిద్వార్.._*
*_ఉజ్జయిని..నాసిక్.._*
నాలుగు వేదికలు..
నలభై కోట్ల జనం..
ప్రభంజనం..
_అతి పెద్ద పండగ.._
_భరతజాతి వేడుక.._
_ఇంటింటి సంబరం.._
మనిషి.. సాటి మనిషి
కలిసి ఆచరిస్తున్న
మానవతా మహాకార్యం..
*_అందరూ ఒకటై తరిస్తున్న_*
*_కలియుగ మహాద్భుతం..!_*

మనుషులు పోయారు..
నిజమే..అత్యంత బాధాకరమే..
అయితే ఇలాంటి 
గొప్ప సందర్భంలో..
ఒక గొప్ప దీక్షలో..
మహావేడుకలో..
దివ్య ముహూర్తంలో
అసువులు బాయడమంటే
స్వర్గలోక ప్రాప్తికి..
కైలాస యాత్రకి..
సాక్షాత్ మహాదేవుని
సన్నిధికి చేరడానికి
ఇంతకు మించిన సందర్భం ఇంకేముంటుంది..
అది అపశ్రుతే అవనీ..
బంధువులకు బాధ కలిగించనీ..
పోయినోళ్ళు అందరూ మంచోళ్ళే..
కైవల్య ప్రాప్తికీ.. 
జన్మ రాహిత్యానికి 
ఇంతకంటే
దగ్గర దారి ఇంకొకటి ఉంటుందా..!?.

సరిగ్గా..ముప్పై ఆరు 
రోజుల క్రితం..
పుష్యమాసం..
పౌర్ణమి పుణ్యతిధి నాడు వెలిగింది మొదటి దీపం...
జరిగింది తొలి మునక..
పొంగింది ప్రతి భారతీయుని హృదయం..
ఉప్పొంగింది గంగా ప్రవాహం..
*_జలం జాలమై.._*
*_పురివిప్పిన జటాఝూటమై.._*
*_జనం జాగరణమై.._*
ఆకాశం చుక్కల పందిరై..
తారా తోరణమై..
భక్త హృదయం పరవశమై..
ప్రతి మది 
*_పరమశివుని వశమై..!_*

ఈ నెల 26..
మహాశివరాత్రి నాడు..
జనమంతా జాగరణకు
సిద్ధమవుతున్న వేళ..
జగమెల్ల హర నామ స్మరణంతో
పరవశించే ముహూర్తాన
అక్కడ..ఆ నాలుగు
దివ్య క్షేత్రాలలో కుంభమేళా ముగింపు..మరింతగా ఒడల
జలదరింపు..ఇంకా ఉంటే బాగున్నే అనిపించినా..
ఎంతటి వేడుకకైనా
కాలమానమే కొలమానం..!

ప్రస్తుతం జరుగుతున్న 
మహాకుంభమేళాతో 
పన్నెండు కుంభమేళా 
చక్రాల పూర్తి..
అఖండ స్ఫూర్తి..
కొలువై దగ్గరుండి నిర్వహించిన
మహాశివుని మూర్తి..
కలియుగ మహాద్భుత
ఘట్టం..భరత జాతి కీర్తి..!

ఇది 144 సంవత్సరాలకు ఒకసారి జరిగే మహాసమ్మేళనం..ఆనాడు జరిగిన మహాసమ్మేళనంలో
పాల్గొన్న సన్యాసులు..
సాధువులు..రుషులు..
మహామునులు..అఘోరాలలో
కొందరు ఇప్పటికీ జీవించి ఉండి వర్తమాన మహాకుంభమేళాకు కూడా హాజరయ్యారా..అన్నట్టు
ఎంతమంది వృద్ధులు..
ఎక్కడెక్కడి నుంచి వచ్చారో..
మామూలు సమయాల్లో 
బయటి ప్రపంచం చూడని..
ఆ బయట ప్రపంచానికి కనిపించని యోగులు..
కుంభమేళాలో ప్రత్యక్షమై
ఆ మహా వేడుకకు
పరిపూర్ణత చేకూర్చారు.

అసలు ఏం తిన్నారో..
ఎక్కడ ఉన్నారో..
ఎప్పుడు పడుకున్నారో..
ఎవరికీ అవగాహన కలగని
రీతిలో నాలుగు క్షేత్రాల్లో 
రేయనక పగలనక 
సంచరించి వేడుకకు సాధుసత్సంగపరిషత్
కళను తెచ్చి పెట్టారు.. దివి నుంచి దేవతలే ఆ రూపంలో వచ్చి అక్కడ తిరుగాడుతూ
ఉత్సవం ఇంత మహోన్నతంగా జరిగేలా అన్నీ దగ్గరుండి పర్యవేక్షించినట్టు కనిపించింది.

కుంభమేళాకు పురాణాల కాలం నాటి నుంచి మూలాలున్నాయి.
దేవదానవులు అమృతం కోసం పాలసముద్రాన్ని మధించిన సమయంలో అమృతం చుక్కలు నాలుగు ప్రయాగరాజ్..హరిద్వార్..
ఉజ్జయిని..నాసిక్ లలో పడ్డాయని ప్రశస్తి.

త్రివేణి సంగమంలో మునక
కుంభమేళాలో అత్యంత కీలక..పవిత్ర..పరాకాష్ఠ ఘట్టం.
ఈ సమయంలో ఇక్కడ చేసే పవిత్ర స్నానం వల్ల సకల 
పాప హరణం..మోక్ష సిద్ధి ఒనగూరుతాయని ప్రతీతి.

మహాకుంభమేళా జరిగే సమయాన్ని జ్యోతిష్య శాస్త్రం ప్రకారం నిర్ణయిస్తారు.
బృహస్పతి కుంభంలోకి
ప్రవేశించే తరుణంలో
సూర్యుడు మకరరాశిలోకి
చేరే ముహూర్తాన కుంభమేళాకు అంకురార్పణ జరుగుతుంది.

సరే..ఏదిఏమైనా 144 ఏళ్లకు ఒకసారి జరిగే ఈ ప్రపంచ అత్యద్భుత వేడుకకు 
పూర్వజన్మ సుకృత ఫలితంగా
మనం సాక్షీభూతులుగా నిలిచాం.

అవకాశం ఉండి మేళాకు వెళ్ళి మునకలు వేసిన వారు ధన్యులు..

లేకపోయినా టివిల్లో చూసి..
పేపర్లలో చదివి..
ఏదో ఒక మాధ్యమం ద్వారా విశేషాలు తెలుసుకున్న వారు సైతం అదృష్టవంతులు..

ఇవేవీ అనుభూతించని
మారుమూల ప్రాంతవాసులు..
నిరక్షరాస్యులు.. ఆపాటి జ్ఞానం లేని వారు కూడా 
ఈ మహాక్రతువు జరిగిన పుణ్యభూమిపై 
ఈ సమయంలో జీవించి ఉండి
పరమపదానికి బాటలు వేసుకున్నట్టే..

చేసుకున్న వాడికి చేసుకున్నంత మహాదేవా..
చేసుకోని వారికి కూడా
సమాన పుణ్యం..పురుషార్ధం లభించే అత్యద్భుత విశేషం
ఈ కుంభమేళా..

ఈ పవిత్ర భూమిలో పుట్టడమే ఒక అదృష్టం..
ఇక్కడ జన్మించిన 
ప్రతి ఒక్కరూ ఏదో ఒక గొప్ప వేడుకలో జన్మానికి 
ఒక శివరాత్రి అన్నట్టు 
పాల్గొన్న వారే..
యజ్ఞాలు..యాగాలు..
క్రతువులు..నిత్య పూజలు..
పండగలు..తిరనాళ్ళు..
జాతరలు..అమ్మవారి ఉత్సవాలు..బోనాలు..
బ్రహ్మోత్సవాలు..
పరాకాష్టగా పుష్కరాలు..
కుంభమేళాలు..ఇంకా ఇంకా
ఉత్కృష్టంగా ఇప్పుడు జరుగుతున్న 
*_మహా కుంభమేళా..!_*

*_కుంభమేళా.._*
భువిలో మనుజులు..
దివి నుండి దేవతలు..
కలిసి చేసుకుంటున్న
అతి పెద్ద..అరుదైన..
మహాద్భుతమైన..
*_విశ్వవేడుక.._*
అందుకు ప్రయాగ..
హరిద్వార్..
ఉజ్జయిని..
నాసిక్..
ఈ నాలుగు క్షేత్రాల
సంగమం..
*_విశ్వవేదిక..._*
ఇలాంటి మహోత్సవాలు
హిందూ సంస్కృతిలో
గొప్ప *_పారంపర్య వాడుక..!_*

ఈ మహోత్సవం రేపు 
26 న ముగిసేది కాదు..
ఇదొక నిరంతర ప్రక్రియ..
హిందూ ధర్మ పరిరక్షణ
కొనసాగింపు..
మానవధర్మ ఆకళింపు..
ఆధ్యాత్మికతకు కలియుగంలో
సరికొత్త రూపు..
భక్తిసాగర మధింపు..
చివరగా..ఏ యుగంలో జరిగినా ఆధ్యాత్మికతకు
పరిపూర్ణ గెలుపు..
ప్రతి యుగంలోనూ
ఒక మలుపు..
మేలుకొలుపు..!