Wednesday, June 10, 2020

ధూమావతి

ప్రియమైన శివ పరివారం కు జేష్ట మాస శుభాకాంక్షలు

మనం ఈ నెల 13 వ తారీఖున సరూర్ నగర్ చండీ అమ్మవారి దేవాలయం లో ధూమావతి హోమం చేయుటకు ఆ పరమేశ్వర సంకల్పం.

మనం చేసే చండీ హోమం పేరు ధూమావతి.. మీకు వివరాలు తెలియ చేసే ప్రయత్నం చేస్తాను..

మన శివ పరివారం లో అందరికీ దశమహావిద్యలు  తెలిసినదే

మరొకసారి తెలుసుకుందాం  దశ మహావిద్యలంటే ఏవి?

1. కాళీ
2. తార
3. త్రిపుర సుందరి
4. ధూమావతి
5. భువనేశ్వరి
6. భైరవి
7. ఛిన్నమస్త
8. మాతంగి
9. బగళాముఖి
10. కమలాత్మిక

అనేక దశాబ్దాల పాటు వీటి పేర్లు చెప్పుకోవడం కూడా వాటి ఆవాహనే అని భావించారు. వీటి సౌమ్యతరమైన రూపాలని, అర్ధాలని, అంతరార్ధాలని తెలుగు వారికి అందించిన వారు చాలా తక్కువ మంది ఉన్నారు. రమణ మహర్షి వంటి మహానుభావుల సమక్షంలో దశ మహా విద్యల సాధన చేసి అందులో ఉన్న శక్తి కేవలం గ్రంధాలుగా కాక నిజంగా చూపించిన వారు శ్రీ కావ్యకంఠ వాశిష్ట గణపతి ముని. వారు వ్రాసిన ఉమా సహస్రాన్ని అమ్మ వారికి అంకితం చేసినప్పుడు అన్నారుట, " అమ్మా ! ఈ రచన నీకు నచ్చినట్లయితే నాకు తెలియజెయ్యి. ఏ భాగం నీకు నచ్చక పోతే ఆ భాగాన్ని నేను అగ్నికి ఆహుతి చేస్తాను " అని. అలా ఆయన ఆ మహా గ్రంధాన్ని చదవడం మొదలు పెట్టే సరికి, ఆ అమ్మ వారు కరుణాసముద్రయై ప్రతి పద్యానికో మెరుపు ఆకాశంలో చూపించిదిట. అంతటి దివ్య శక్తిని దర్శనీయంగా చూడడానికి ఎంత తపస్సు చేయాలో అనిపిస్తుంది. మరి ఈ దశ మహావిద్యలు దేన్ని సూచిస్తాయి అని సందేహం వస్తుంది. వీటి చిత్రాలు, విగ్రహాలు కూడా అన్నీ సౌమ్యం గా ఉండవు. ఉదాహరణకి కాళీ విగ్రహం ఎప్పుడూ ముండ మాలతో, ఖడ్గంతో భయంకరంగానే ఉంటుంది. వీటిలో కోమలత్వం ఏది అనిపిస్తుంది. మరి ఈ కాళికే తెనాలి రామలింగడికి విద్యని, ఐశ్వర్యాన్ని ఇచ్చింది. వెర్రి వాడైన కాళి దాసుకి కవిత్వాన్నిచ్చింది. అమ్మ తలుచుకుంటే లోటేముంది. అమ్మ ఒక సారి కోపంగా ఉంటుంది. ఒక సారి సంతోషంగా ఉంటుంది. బాగా అల్లరి చేస్తే ఒకటి పీకుతుంది కూడా. అమ్మ చేతి దెబ్బలు తినకుండా పెరిగిన వారెవ్వరు? ప్రేమ అనేది ఒక అపురూపమైన తత్వం. తిట్టుకున్న, కొట్టుకున్నా ప్రేమతో ఉంటే అవి అద్భుతంగానే ఉంటాయి.

ఈ దశ మహా విద్యల తత్వాన్ని చూస్తే, అవి ఇలా సూచిస్తాయి.

కాళీ, ఛిన్నమస్త - కాల పరిణామము
తార, మాతంగి - వాక్కు, వ్యక్తావ్యక్తము
త్రిపుర సుందరి, కమల - ఆనందము, సౌందర్యము
భువనేశ్వరి, ధూమావతి - అంతరాళము, అతీత పరబ్రహ్మ శక్తి
భైరవి, బగళాముఖి - శక్తి, గతి, స్థితి కాలం మనకి అనిపించేదే కాక అమరత్వాన్ని చూపే అనంత బయొలాజికల్ క్లాక్ లో నడిచే సమయం అన్నమాట. ఇక్కడ కాలభైరవుడు మార్గం చూపగలడు. అంతరాళం కూడా శూన్యమే కాదు, అది అంతులేని ప్రేమ వ్యక్త ప్రపంచంగా ఆవిర్భవించిని శక్తి. ఇది అర్ధం కావాలంటే శ్రీ కృష్ణుడు దారి చూపవలసిందే. వాక్కు అంటే కేవలం మాట కాదు, శూన్యంలో కూడా ప్రయాణించగల మనో తరంగ విశ్వసృష్టి స్పందన. దీన్ని తారా దేవి తెలియజేయ గలదు. ఇలా ప్రతి తత్వం ఆ తత్వపు మూల స్వరూపంలో ఆద్యా శక్తులుగా ఉపాసించడమే దశ మహా విద్యల స్వరూపం. అందుకే వీటిలో ఒక మౌలిక భావ సముదాయం ఉపాసనగా ఉంటుంది. సాధరణంగా వీటిని ఉపాసించే వారు వీటి విసృత పరిధిని జ్ఞాపకంలో పెట్టుకుని ఉంటారు.

*ఇటువంటి హోమం ను స్వయం గా ఆ దేవదేవుడు , మహాదేవుడు, పార్వతీ పరమేశ్వరులు లోక కల్యాణార్థం ను దృష్టిలో ఉంచుకొని, మన పూజ్య గురువు లు చే నిర్వహిచాలని సంకల్పం చేయబడినది*..

దశ మహావిద్యలకు జ్యోతిష శాస్త్ర సారుప్యత దృష్ట్యా ధూమవతి కేతుగ్రహాదిష్టాన దేవత. ఈమె చూడటానికి వికారంగా, చేతిలో చాటతో, పొగసూరిన బట్టలతో, మెల్లకళ్ళతో, గుర్రంలేని బండిపై కూర్చుని ఉంటుంది.ధూమవతి సిద్ధిని ప్రసాదించే తల్లి.
యత్ర అగ్నిః తత్ర ధూమః– అవిద్య నుండి విద్యను, విద్యాతత్త్వాన్ని అనుభూతి చేయగలది ధూమావతి. మానవుని నిద్రా, నిద్రారాహిత్యాలు ధూమవతి యొక్కవైభవము

ధూమావతి అంటే ఉపాసనా పరంగా మహామౌనమని కూడా అర్థం. ఉపనిత్తులలో పేర్కొన్న భూమావిద్య. ఇది పూర్ణవిద్య మరియు అపూర్ణవిద్య కూడా – విద్యాఽవిద్యా స్వరూపిణి

లౌకికంగా ఆలోచిస్తే లక్ష్మీదేవి అనుగ్రహం పొందాలంటే ముందు జ్యేష్టాదేవి కృపతో అలక్ష్మిని తొలగించికోవాలి, జ్యేష్టాదేవి దయ ఉంటేనే లక్ష్మీదేవి ప్రాసాదించే సంపద మనకు దక్కుతుంది. ధూమావతి మంత్రాలలో జ్యేష్టాదేవి మంత్రంకూడా వుంది. లోకంలో సంపద ఉంచాలన్నా తీసేయాలన్నా ఈమే కారణం.


దశ మహావిద్యలలో 7వ మహావిద్య.. ధూమ వర్ణంతో దర్శనమిచ్చే శ్రీ ధూమవతీ దేవికి చెందింది. జ్యేష్ఠమాసం శుక్లపక్ష అష్టమీతిథి ఈ దేవికి ప్రీతిపాత్రమైంది. ఈ దేవతకి ఉచ్చాటనదేవత అని పేరు. తన ఉపాసకుల కష్టాల్ని, దరిద్రాల్ని ఉచ్చాటన చేసి అపారమైన ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తుంది. ఈ ధూమవతీదేవి ఆరాధనవల్ల సాధకుడికి వివిధ వ్యాధుల నుంచి, శోకాల నుంచి విముక్తి లభిస్తుంది.

                         ||శ్లోకం||

అత్యుచ్చా మలినాంబరాఖిలజనోద్వేగావహా దుర్మనా
రూక్షాక్షి త్రితయా విశాలదశనా సూర్యోదరీ చంచలా|
ప్రస్వేదామ్బుచితా క్షుధాకులతను: కృష్ణా తిరూక్ష ప్రభా
ధ్యేయా ముక్త కచా సదాప్రియకలిర్ధూమావతీ మంత్రిణా|

దుఃఖదాయకమైన పరివర్తనాన్ని ధూమవతిగా చెప్పారు. జ్యేష్ట శుక్ల అష్టమి రోజున ఈమె జయంతి జరుపుతారు. ధూమవతి రాత్రిని దారుణ రాత్రిగాను, అక్కడ శివుడిని కాలభైరవునిగానూ వర్ణిస్తారు. స్థిత ప్రజ్ఞతకు ధూమవతి ప్రతీక. ఈమెది కాకి వాహనం. వాసనాగ్రస్త మనసుకు ప్రతీక. అంతరం లేని మనసుకు, అసంతృప్తికి ప్రతీక. ఆమెకు ఉన్న ధూమశరీరం, తమో మయమైన బుద్ధికి అవివేకానికి చిహ్నం. జీవునికి (సాధకునికి) జన్మలో లభించిన దీనావస్థలన్నీ అంటే బుభుక్షా, పిపాస, కలహా, దారిద్య్రాది వ్యసనాలే ధూమవతి కార్యకలాపాలు.

వేదవిద్యలో లభించే క్రదువు అనే మాటకు అసురత్వ భూమికలైన వృక్షస్తేన, అహి, వృతభృతులను ఇది ఉత్పత్తి చేస్తుంది. తంత్ర గ్రంధాలలో ధూమవతి ఉగ్రతారగా వర్ణితమైనది. ఆమె ధూమ్రత్వమే ఆమెకు ఆ పేరు తెచ్చిపెట్టి సార్థకం చేసింది.

దేవి ప్రసన్నంగా ఉన్నప్పుడు ఏ విధంగా రోగాలను నయం చేస్తుందో కుపితగా మారితే సమస్త సుఖాలను, కామమును హరించి వేస్తుంది. దేవి శరణుపొందిన మానవులకు విపత్తులు ఉండవు. సంపద ప్రాప్తిస్తుంది. ఇతరులకు సహాయపడే శక్తి లభిస్తుంది.

ఋగ్వేద సూక్తంలో దేవి “సుతారా” అని వ్యవహరితమైంది. అంటే సుఖ పూర్వ యోగ్యదాయిని అని అర్థం. తారా తారిణి అనే పేర్లతో వర్ణించారు.

ఋణాన్ని దూరం చేసేది అంటే ఆ భావాన్ని, సంకటాన్ని దూరం చేసే ధనంగాను, సుఖాన్నిచ్చే తల్లిగాను అవతరించింది. కనుక ఈమెకు “భూతి” అనే పేరు కూడా ఉంది.

భగవద్గీతలో “ధూమే న వ్రియతేవహ్నిః” అని ఉంది. అంటే జ్ఞానం, అజ్ఞానం అనే ధూమం చేత ఆవరింపబడి ఉంటుంది అనీ, జ్యోతి స్వరూపిణి అయిన దేవి దానిని విచ్ఛిన్నం చేసి మోక్షాన్ని ఇస్తుందని అర్థం.  ధూమవతి వికృతి శక్తిగా చెప్పబడింది. ముసలమ్మ దేవత చావుపుట్టుకల గూర్చిన పాఠాలను ధూమవతి బాగా చెబుతుంది. ఆమె తన దివ్య స్వప్నాలకు స్వస్తిపలికి వ్యక్తంగాని యువస్వప్నాలలోని నిజాలను ముసుగు తీసి ప్రదర్శిస్తుంది. ధూమం అంటే పొగ. పొగతో నిండేది ప్రకాశం కాదు. ఆమె స్వభావం అంతర్థానం. తెలివిని అంతర్థానం చేసి దాని (లోతున) చాటున ఉన్న నిజాన్ని లాగి చూపిస్తుంది. ప్రళయ కాలంలో యోగనిద్ర యుక్త పురుషులలో నిత్యానంద నిద్ర ధూమవతీ లక్షణం. సంసారంలో చిక్కుకుని ఉన్నవాళ్ళను నిద్ర, మూర్ఛ, మరపులాంటి ఏ అజ్ఞానం కప్పి ఉండటం వల్ల సంసారులు ఆత్మను వెతుక్కోలేక పోతున్నారో అది కూడా ధూమవతియే.!!

ఇటువంటి హోమం ను స్వయం గా ఆ దేవదేవుడు , మహాదేవుడు, పార్వతీ పరమేశ్వరులు లోక కల్యాణార్థం ను దృష్టిలో ఉంచుకొని, మన పూజ్య గురువు లు చే నిర్వహిచాలని సంకల్పం చేయబడినది..


సశేషం
మరికొన్ని వివరాలు తో మీకు మరింత సమాచారం ను అందిస్తాము..

ఇట్లు
శివ పరివారం

No comments:

Post a Comment