Monday, July 13, 2020

చెట్లను సేవించడం వల్ల కలిగే ప్రయోజనాలు -శాస్త్రం

ప్రియమైన శివ పరివారం కు శ్రీ కృష్ణ శరణం మమ

ఈ రోజు భాగవతం లో గురువు గారు చెట్లు మొక్కలు వాటి వివరణ చెప్పారు

పచ్చదనం, పరిశుభ్రం అంటూ మొక్కలు పెంచడం గురించి, వృక్షాల వల్ల ఉపయోగాల గురించి ఇటీవలికాలంలో ఊదరగొట్టేస్తున్నారు. కానీ, వృక్షాల గొప్పదనం గురించి బమ్మెర పోతన గారు  ఏనాడో భాగవతంలోనే చెప్పారు. బృందావనంలో గోపకులు గోవుల్ని మేపుతూ అలసిపోయి దట్టంగా ఉన్న చెట్ల నీడలకు చేరతారు. ఆ సందర్భంలో వారు బలరామకృష్ణులనుద్దేశించి చెప్పిన పద్యమిది..

‘‘అపకారంబులు సేయవెవ్వరికి, నేకాంతంబు నందుండు, నా
తప శీతానిల వర్ష వారకములై, త్వగ్గంధ నిర్యా సభ
స్మపలా శాగ్ర మరంద మూల కుసుమచ్ఛాయా ఫలశ్రేణి చే
నుపకారంబులు సేయునెల్లరకు నీ యుర్వీజముల్‌ గంటిరే?’’

ఈ చెట్లకున్న 16 సుగుణాల గురించి చెప్పే పద్యమిది. అవేంటంటే.. చెట్లు ఎవరికీ అపకారం చేయవట. ఉపకారం చేయకపోయినా పర్వాలేదు అపకారం చేయకుంటే అదే పదివేలు. ఈ యుగానికి ఇదే గొప్ప లక్షణం. చెట్లు ఏకాంతంగా ఉండగలుగుతాయట. ఏకాంతంగా ఉండగలిగినప్పుడే మనం ఎవ్వరమో ఆలోచించుకునే అవకాశం లభిస్తుంది. అందువల్ల ఇవి మనుషులకు ఆదర్శం. అలాగే.. చెట్లు ఎండ నుంచి, చలిగాలి నుంచి రక్షిస్తాయి. మర్రిచెట్టు వంటివాటి నీడలు ఎండాకాలంలో చల్లగా, శీతాకాలంలో వెచ్చగా ఉంటాయని శాస్త్రం. వర్షంలో తడిసిపోకుండా దట్టమైన చెట్లు కాపాడతాయి. చెట్లపై తోలు వస్త్రాలకు, తాళ్లకు వాడతారు (త్వక్‌). వాటి సుగంధం గాలిని ఆరోగ్యకరంగా చేస్తుంది (గంధ). వాటి జిగురు కూడా ఉపయోగపడుతుంది (నిర్యాస).

వాటి బూడిదను వైద్యంలో ఉపయోగిస్తారు (భస్మ). వాటి ఆకుల పచ్చదనంతో పర్యావరణం మొత్తం ప్రాణవాయుమయం అవుతుంది(పలాశ). వాటి చిగుళ్లు కూరల్లో, పచ్చళ్లలో వాడతారు (అగ్ర). పూలలో ఉండే తేనె ఉపయోగం మందుల్లో ఎంతో ఉంది (మరంద). వాటి వేళ్లు ఆహారంగా, వైద్యంలో ఉపయోగపడతాయి(మూల). పూలు పూజకు ప్రశస్తం, శిరోధార్యం (కుసుమ). వాటి నీడ తాపోపశమనం (ఛాయా). వాటి ఫలాలు పుష్టికరమైన ఆహారం (ఫలశ్రేణి). ఇలా 16 ఉపయోగాలను ఒకే పద్యంలో నాలుగు పంక్తుల్లో పోతన తెలియజేశాడు. ఇంత చక్కని పద్యాలను పిల్లలకు పాఠ్యాంశాలుగా పెట్టకపోవడం వల్ల ఎంత కోల్పోతున్నాం?
ఇలాంటి పద్యాలూ కనీసం ఉద్యాన వనం లో పెట్టి వాటి వివరణ పెడితే బాగుంటుందని మా శివ పరివారం అభిప్రాయం

చెట్లను సేవించడం వల్ల కలిగే ప్రయోజనాలు కూడా మనకి శాస్త్రం తెలియచేస్తోంది 

మన చుట్టూ ఉంటూ వాటి ఉనికి తో మనకి అన్నివిధాల మేలు చేస్తున్న వృక్షాలు చాలానే ఉన్నాయి. పరిసరాల శుద్ది కోసం, వాతావరణ నైర్మల్యం కోసం, ప్రాణ వాయు సంచారం వల్ల అనేక జీవ కోటి బ్రతకడం కోసం వృక్షాలు చెట్ల యొక్క ఆవశ్యకత ఎంతో ఉంది. ఫల పుష్పాలతో కూడిన చెట్లతో, కంటికి ఇంపుగా ఆహ్లాదం గా వనాలు ఉన్న చోట దేవతలుఉంటారు, ఇటువంటి ప్రదేశాలు వారికి ప్రీతికరమై కొలువుతీరుతారు. దైవ సంబంధితమైన వృక్షాలను కాపాడుతూ, వాటి ని పూజించడం ద్వారా ఎంతో మేలు జరగడమే కాకుండా, గ్రహాల వలన కలిగే దోషాలు కూడా నివారింపబడతాయి.

అగ్ని హోత్రం నిర్వహించడం కంటే, పుత్రుడిని కనడం కంటే, బాటలో నీడనిచ్చు మహా వృక్షాలను నాటడం పుణ్యకరమని భావిష్యపురాణం ద్వారా తెలుస్తుంది. చెట్లు ఇహలోకం లో పరలోకం లో సుఖానిచ్చే సత్పుత్రుల తో సమానమని, దేవ, నాగ, గంధర్వ, కిన్నెర, రాక్షసులకు నిలయమై రాబోవు పితృదేవతలను తృప్తి  పరుస్తాయని చెప్పబడింది.

చెట్లకు బాధను కలిగిస్తే, అంటే నరకడం, కొట్టడం చేస్తే మహాపాపమని, ముఖ్యం గా మర్రి, రావి, చందనం చెట్లను నరికితే బ్రహ్మహత్య తో సమానమని, మూలాన్ని నరికివేస్తే వంశక్షయమని, చెట్లను కొట్టినవాడు రాబోవు జన్మలో మూగవాడుగా, అనేక శారీరిక, మానసిక రోగగ్రస్తుడిగా పుడతాడని భవిష్యపురాణం ద్వారా తెలుస్తుంది. వృక్షాలను తడపడం, రోగాలు లేకుండా కాపాడడం చేస్తే స్వర్గలోక ప్రాప్తి కలుగుతుందని విష్ణుధర్మోత్తర పురాణం ద్వారా తెలుస్తుంది.

నదీ తీరాల్లో వృక్షాలను నాటడం ద్వారా పితృదేవతలకు తృప్తి కలుగుతుందని పద్మపురాణ వచనం. ప్రతి పర్వం లో వాటి ఆకులు పడితే అవి పిత్రుదేవతలకు పిండాలని సృష్టి ఖండం ద్వారా తెలుస్తుంది.

మార్గాల గుండా, దేవాలయాల్లో ను చెట్లను నాటడం వలన కీర్తి లభిస్తుందని చెప్పబడింది.

మఱ్ఱిచెట్టు శివరూపతత్వం అని స్కాందపురాణం ద్వారా తెలుస్తుంది.

తులసి మొక్క సర్వపాపహరమనీ దీనితో సాటి వచ్చునది ఏది లేకపోవడం వలన దీని పేరు సార్ధకమని, పాపాలకు అగ్నిశిఖ వంటిదని ముక్తిని ప్రసాదిన్చేదని, శ్రీ మహావిష్ణువు భక్తీ నోసంగునదని దేవి భాగవతం లో తులసి యొక్క పవిత్రతను చెప్పబడింది. తులసి మొక్కకి ఎన్నో ఆరోగ్య గుణాలు, దైవిక గుణాలు ఉన్నాయి. ఇంట్లో ఉత్తరం వైపు తులసి చెట్లని ఉంచడం వలన వాస్తురీత్యా ఎంతో ఉపకరిస్తుందని చెప్పవచ్చు.

బిల్వ వృక్షం గురించి ఋగ్వేద, యజుర్వేదాలలో ప్రస్తావన చేయబడింది. శివునికి ఎంతో ప్రీతికరమైన వృక్షం. ఈ చెట్టు కి 365 రోజులు పండ్లు ఉంటాయి. ఈ పండ్లని లక్ష్మి ఫలమని లేక శ్రీ ఫలమని అంటారు.

రావి చెట్టు ప్రకృతి లోని పావన వృక్షాలలో ఒకటైనది. పురాణాలలో రావి చెట్టు యొక్క విశిష్టత గురించి అనేక విధములుగా ప్రస్తావించ బడింది. రావి చెట్టుని విష్ణు స్వరూపం గా పూజిస్తారు. అనేక సందర్భాలలో రావి చెట్టును పూజించే సంప్రదాయం ఉంది. రావి వృక్షాన్ని అశ్వథ వృక్షమని కూడా అంటారు. రావి చెట్టు మొదట్లో విష్ణువు, బోదేలో కేశవుడు, శాఖలో నారాయణుడు, పత్రాలలో హరి, ఫలాల్లో సర్వ దేవా సాహితుడైన అచ్యుతుడు నివసిస్తారు. ఇది మూర్తి దాల్చిన విష్ణు స్వరూపం. మహాత్ములు దీనిని పుణ్య మూలమని సేవిస్తారు. దీనిని ఆశ్రయించడం వలన అభీష్ట సిద్ది కలగడమే గాక, పాప నాశనం కలుగుతుంది.

వాతావరణ కాలుష్యం, రోగకారక కీటకాలను నాశనం చేసే వృక్షం కనుక దీనిని దేవతా వృక్షం గా భావిస్తారు. ధార్మిక విశ్వాసం  గల హిందువులు దీనిని దేవాలయ పరిసరాల్లో నాటుతారు. ఈ వృక్షానికి హాని చేయడం బ్రహ్మ హత్య తో సమానం అని భావిస్తారు. వైజ్ఞానిక పరం గా రావిచెట్టు నిరంతర ప్రాణ వాయువుని వెలువరించే ఏకైక అధ్బుత వృక్షం. దీని సమీపం లో ఉండటం వల్ల ప్రాణ శక్తి వృద్ది చెందుతుంది.

అరటి చెట్టు ని విష్ణు మూర్తి కి ప్రతీకగా చెప్పబడింది. గురు గ్రహ ప్రీతి కొరకు గురువారం రోజున అరటి చెట్టుని పూజిస్తారు. కుజ దోషం ఉన్నవారు ఈ చెట్టు ని పూజించడం ద్వారా మంచి ఫలితాన్ని పొందుతారు. ఎన్నో ఉత్తమ కార్యాలకు వీటి ఆకులను పలు సందర్బాలలో వాడుతారు.

మామిడి చెట్టు ని యజ్ఞ యాగాదులలో లోను, ప్రతి శుభకార్యాలలోను వీటిని వాడుతారు. దృష్టి దోషాలు తగలకుండా ఉండడానికి ఈ ఆకులు ఎంతో ఉపకరిస్తాయి. ఇంటి ద్వారానికి వీటి ఆకులని కట్టడం ద్వారా ఇంట్లో చక్కటి ఆహ్లాదకరమైన వాతావరణం నెలకొంటుంది. మామిడి చెట్టు ఇంట్లో ఉంటే జ్ఞానం, ప్రశాంతత , మరియు అదృష్టం వృద్ది చెందుతాయని చెప్పబడింది.

వేప చెట్టు లక్ష్మీ స్వరూపం గా చెప్తారు. ఈ చెట్టు ని సాక్షాత్తు అమ్మవారి రూపం గా పూజించి ఆరాదిస్తారు. అధ్బుతమైన ఔషదగుణాలు కలిగిన ఈ వృక్షాన్ని చాలా  ఇళ్ళలో చూడవచ్చు. చర్మ, ఉదర, చిగుళ్ళు వంటి ఎన్నో సమస్యలకు ఉపకరిస్తుంది. ఈ వృక్షం ఇంట్లో ఉండడం ఆరోగ్యం తో పాటు సకల శుభాలు కలుగుతాయి.

అత్తి  చెట్టు ని సాక్షాత్తు త్రిమూర్తి స్వరూపుడైన దత్తాత్రేయుని ప్రతీకగా చెప్పబడింది. వీటి పండ్లని చాలా  ఔషదాలలో వాడుతారు. ఈ చెట్టు ని పూజించడం వలన కుజ గ్రహం వలన కలిగే సమస్యలు తగ్గుతాయి. గ్రహాల పీడలనుండి ఉపసమనం లభిస్తుంది. ఆర్ధిక సమస్యలు ఉన్న వారు ఈ చెట్టు కింద కూర్చొని ధ్యానించి పూజించడం ద్వారా సమస్యలు తగ్గుతాయి. అవివాహితులు ఈ చెట్టు ని పూజించడం ద్వారా శీఘ్ర వివాహానికి కి కూడా అవకాశం కలదు.

ఉసిరిగ చెట్టు లో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. దీనిని పూజించటం వలన గ్రహ బాధలు బూత ప్రేతాది బాధలు తొలగుతాయి. శరదృతువు లో ఉసిరి చెట్టుని పూజించి ప్రదక్షిణాలు చేయడం వల్ల  శరీర రుగ్మతలు సమసిపోతాయి. బుద్ది కుశలత వృద్ధి చెందుతుంది. ఉసిరిక చూర్ణం, రసం శరీరానికి లేపనం వేసి స్నానం చేయడం వల్ల శరీర సౌందర్యం కాపాడబడుతుంది. చర్మం కోమలంగా మారుతుంది చలి నుండి రక్షణ కలుగుతుంది. ఈ చెట్టు ని పూజించి దాని కింద కూర్చొని భోజనం చేసేటప్పుడు ఆ చెట్టు గాలిని పీల్చడం వల్ల పైత్యప్రకోపం శమించి అనేక ఆరోగ్య ప్రయోజనాలు శరీరానికి కలుగుతాయి.

అశోక చెట్టుని నాటడం, పూజించడం వలన సోక నాశనమని తెలుస్తుంది. పురాణాల ఆధారం గా యక్షులు ఈ చెట్టు పైన నివాసం ఉంటారని తెలుస్తుంది. అందువలన ఈ చెట్టు కింద ఏ దైవకార్యం చేసినా వెంటనే మంచి ఫలితాలు కలుగుతాయి. స్త్రీ గర్భ సంబంధిత సమస్యలు కూడా తగ్గుతాయి. కొన్ని రకాల మందుల తయారీ లో  అశోక చెట్టు ఆకులను వినియోగిస్తారు. ఆర్ధిక సమస్యలు, ఆలస్య వివాహ సమస్యలు , కుజ దోషం ఉన్నవారు ఈ చెట్టు ని పూజిస్తే మంచి ఫలితాలు కలుగుతాయి, ఎటువంటి దైవ కార్యాలైనా ఈ చెట్టు కింద చేయడం వలన ఉత్తమ ఫలితాలనిస్తుంది.

ఇట్లు 
శివ పరివారం 

Monday, July 6, 2020

జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం- శ్రీమద్ భాగవతం లో కథలు


ప్రియమైన భాగవత శివ పరివారం కు శ్రీ కృష్ణ శరణం మమ 

గురువు గారు మనకి భాగవత ప్రవచనం లో అగస్యులు మహా ముని గురించి చెబుతూ జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం  అని ఎలా వచ్చిందో తెలియచేసారు 

జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం..! ఇది చాలా మంది వినే ఉంటారు . .

జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం’: అని మన ఇళ్ళల్లో పిల్లలకు గనుక కడుపులో నొప్పి వస్తోంటే, వారి పొట్టపై అరచేతితో రాస్తూ, "జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం.." అంటూ మంత్రం అనడం మనకు అలవాటు.

ఆహారం జీర్ణం కానట్లు అనిపిస్తే వయసుతో సంబంధం లేకుండా అందరూ ఇలా స్మరించుకోవడం ఆనవాయితీగా వస్తోంది. ఇంతకీ ''జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం..'' అనే నానుడి ఎలా వచ్చింది? దాని వెనుక ఉన్న కథేమిటో ఇప్పుడు తెలుసుకుందాం…

ఈ వృత్తాంతం రామాయణంలో అరణ్యకాండలో చెప్పబడింది. శ్రీరాముడు అరణ్యవాసం చేస్తూ, సుతీష్ణుడు అనే ఋషి ద్వారా, అగస్త్యుడు ఉండే ఆశ్రమం జాడ తెలుసుకుంటాడు..

సీతారామ లక్ష్మణులు అగస్త్యుడి ఆశ్రమాన్ని వెదుకుతూ వెళుతుంటే వారికి ఒక పెద్ద బూడిద రాశి, ఎముకల గుట్ట కనిపిస్తాయి. అప్పుడు రాముడు..సీతా లక్ష్మణులతో గతంలో ఆక్కడ జరిగిన వృత్తాంతాన్ని ఇలా చెబుతాడు.

ఇప్పుడు దాని కధ తెలుసుకుందాము

ఇల్వలుడు, వాతాపి అను ఇద్దరు రాక్షసులుండేవారు. వారిద్దరు బ్రాహ్మణ వేషాలు వేసుకొని దారిన పోయే పండితులను, వేదాధ్యయన పరులను భోజనానికి పిలిచేవారు. అతిథి పూజ చేస్తేగాని మేము భోజనం చేయమనే నిబంధన మాకు పెట్టుకున్నాము. రండి రండి అని పిలిచేవాళ్లు. వీళ్లు చెప్పేది నిజమనుకొని బాటసారులు భోజనానికి వచ్చేవారు. (అపుడు అంతా నడుచుకొంటూ వెళ్లేవారుకదా ) అలా వచ్చిన వారికి వాతాపిని ఇల్వలుడు ఆహార పదార్థంగా తయారు చేసి వారికి వడ్డించేవారట. వారు తిని భుక్తాయాసం తీర్చుకోవడానికి కాసేపు అరుగు పైన కూర్చునేసరికి ‘వాతాపి, వాతాపి! ఇలా బయటకు రా’ అని ఇల్వలుడు పిలిచేవాడట. వాతాపి ఆ తిన్నవారి కడుపు చీల్చుకుని బయటకు వచ్చేశేవాడట. దాంతో ఆహారం తిన్నవారు చనిపోయేవారు.

ఇక ఏముంది ? హాయిగా ఇద్దరూ ఆ మనిషిని తినేసేవారట. ఇట్లా వీరి ఆగడాలు మరీ శ్రుతిమించి పోయాయి. బాటసారులు అటు వెళ్లాలంటే భయపడిపోయేవారట. దాంతో వారంతా వచ్చి అగస్త్యునికి తమ బాధను చెప్పుకున్నారు. ఆయన కూడా వాతాపి, ఇల్వలుల దగ్గరకు వెళ్లాడు. ఆ మహర్షిని వీరు భోజనానికి పిలిచారు. భోజనం పెట్టారు.
కాని అగస్త్యుడు భోజనం తినగానే తన పొట్టను తడుముకొంటూ జీర్ణం జీర్ణం వాతాపి అన్నాడట. అంతే అక్కడ వాతాపి జీర్ణం అయిపోయాడు.

ఇల్వలుడు ఎప్పటిలాగే ‘వాతాపి బయటకు రా’అని పిలిచాడట. మహర్షి ‘ఇల్వలా! ఇంకెక్కడ వాతాపి వాడు నా పొట్టలో జీర్ణమైపోయాడు..ఇక నీవంతు’అన్నాడట. దాంతో వీనికి బుద్ధి వచ్చింది. మహర్షి కాళ్లావేళ్లా పడ్డాడు.

అదిగో అప్పట్నుంచే మన పెద్దలు చిన్న చిన్న పిల్లలకు ఉగ్గు పెట్టినప్పటినుంచి ఏం పెట్టినా వారు తిన్నవెంటనే ఇలా అంటారు.

జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం
గుఱ్ఱాల్ తిన్న గుగ్గిళ్లరిగి
ఏనుగుల్ తిన్న వెలక్కాయలరికిగి
అర్జునుడు తిన్న అరటిపళ్లరిగి
భీముడు త్ని పిండి వంటలరిగి
గణపతి తిన్న ఖజ్జాలరిగి
అబ్బాయి తాగిన పాలు ఆముదం అరిగి
పందల్లే పాకి, కుందల్లే కూర్చుండి
నందల్లే నడచి, గుఱ్ఱమంత పరుగు
ఏనుగంత సత్తువు ఉండేటట్టు
సాకుమీ రుూ బిడ్డను సంజీవ రాయా! అనేవారు. 

చూశారా వాతాపి జీర్ణం వెనుక ఎంత కథ ఉందో ...

ఇట్లు 
శివపరివారం 

Sunday, July 5, 2020

కశ్యపుని వంశవృక్షం

DATE : 07/05/2020

ఈ రోజు భాగవత ప్రవచనం లో మన గురువు గారు కశ్యపు మహర్షి వంశము గురించి వివరించారు..
ఆ వంశం ఎలా వచ్చిందో తెలుసుకుందాం. ఈ ఒక్క వంశం తెలుసుకుంటే మన వంశాభివృద్ధి బాగుంటుంది అని గురువు గారు తెలియచేసారు

కశ్యపుడు ప్రజాపతులలో ముఖ్యుడు.కశ్యపుడు 'ఆకారాత్‌ కూర్మ' అని శతపథ బ్రాహ్మణంలో ఉంది. అంటే, ఈయన ఆకారం కూర్మం లేదా తాబేలు అని భావించవచ్చు. 'కశ్యపం' అంటే తాబేలు అని అర్థం. అథర్వ వేదంలో కశ్యపుడు, కాలంలోంచి పుట్టాడని ఉంది. అంటే, అతనికి ముందు ఎవ్వరూ లేరనీ, అతను ప్రప్రథమ మానవుడనీ అర్థం.

ఇప్పుడు మనమున్నది వైవస్వత మన్వంతరం. దీనికి వివస్వతుడు మనువు. ఈ వివస్వత మనువుకు తండ్రి కశ్యపుడు .

వాల్మీకి రామాయణం ప్రకారం బ్రహ్మ కొడుకు.

పురాణాలు పేర్కొన్న అత్యంత ప్రాచీనమైన ఋషులలో ఒకరు కశ్యపుడు.  ఇతనికి ఇరవైఒక్క మంది భార్యలు.

వీరిలో దితి, అదితి, వినత, కద్రువ, సురస, అరిష్ట, ఇల, ధనువు, సురభి, చేల, తామ్ర, వశ, ముని మొదలైనవారు దక్షుని కుమార్తెలు.

కశ్యపుని వంశవృక్షం

కశ్యపునికి అదితి వలన ఆదిత్యులు జన్మించారు. వీరు సూర్య వంశానికి మూలపురుషులు. ఇదే ఇక్ష్వాకు వంశంగా పరిణమించింది, వీరి వంశీయుడైన ఇక్ష్వాకు మహారాజు పేరుమీద. వీరి వంశీయులైన రఘువు పేరు మీద రఘువంశముగా పేరుపొందినది. తరువాత దశరథుని కుమారుడు శ్రీరాముని చేరింది.
కశ్యపునికి దితి వలన హిరణ్యకశిపుడు, హిరణ్యాక్షుడు జన్మించారు. హిరణ్యకశిపునికి నలుగురు కొడుకులు, అనుహ్లాద, హ్లాద, ప్రహ్లాదుడు, సంహ్లాద. వీరి మూలంగా దైత్యులు అనగా రాక్షసుల వంశం విస్తరించింది.
కశ్యపునికి వినత వలన గరుత్మంతుడు, అనూరుడు జన్మించారు.
కశ్యపునికి కద్రువ వలన నాగులు (పాములు) జన్మించారు. వారిలో వాసుకి, తక్షకుడు, అనంతుడు, కర్కోటకుడు, కాళియుడు, పద్మ, మహాపాదుడు, శంఖుడు, పింగళుడు ప్రముఖులు. తల్లి కారణంగా నాగులకు ‘కద్రుజ’ అనే పేరు వచ్చింది.

భాగవత పురాణం ప్రకారం కశ్యపునికి ముని వలన అప్సరసలు జన్మించారు.

ఒక ప్రజాపతి. ఇతఁడు మరీచికి కళవలన పుట్టినవాఁడు.శ్రావణ శుద్ధ పంచమి హస్తా నక్షత్రంతో కూడి ఉన్నపుడు కశ్యప మహర్షి జయంతిని ఆచరిస్తారు ఈయన దక్షప్రజాపతి కొమార్తెలలో పదుమువ్వురను, వైశ్వానరుని కొమార్తెలలో ఇరువురను వివాహము అయ్యెను. అందు-

దక్ష ప్రజాపతి తనకు గల మరో 27మంది కుమార్తెలను (అశ్వని నుంచి రేవతివరకూ గల 27 నక్షత్రాలు) చంద్రుడికి ఇచ్చి వివాహం చేశాడు. మరో కుమార్తె అయిన సతీదేవి పరమ శివుడిని వివాహమాడింది. ఈ బంధుత్వరీత్యా విధంగా కశ్యపునికి ఈశ్వరుడు, చంద్రుడు తోడల్లుళ్లు అవుతారు.

  కశ్యప సంతానం  

కశ్యపుడు తన వివిధ భార్యలతో అనేకమంది బిడ్డలను కన్నాడు. ఆ వివరాలు ఇవి:

LIST


  • దితికి పుట్టినవారు దైత్యులు, అంటే రాక్షసులు. కశ్యపునికి దితివల్ల హిరణ్యాక్షుడు, హిరణ్యకశిపుడు కూడా జన్మించారు.
  • అదితికి పుట్టినవారు దేవతలు, ఆదిత్యులు. ఈమె దేవతలకు తల్లి గనుక ఇంద్రునికీ తల్లి అవుతుంది. ఈమె అవతారపురుషుడైన వామనుడికీ తల్లి.
  • దనుకు పుట్టినవారు దానవులు, అంటే రాక్షసులు. అలాగే, కళ, దనయుల కుమారులు కూడా దానవులే.
  • సింహికకు పుట్టినవారు సింహాలు, పులులు.
  • క్రోధకు పుట్టినవారు కోపంతో నిండిన రాక్షసులు.
  • వినతకు పుట్టినవారు గరుడుడు, అరుణుడు.
  • కద్రువకు జన్మించినవారు నాగులు.
  • మనుకు జన్మించిన వారు మానవులు.

అయితే, కశ్యపుడి కుటుంబంగురించి కొంత భిన్నాభిప్రాయంకూడా మనకు కనిపిస్తోంది. కశ్యపుడికి
1. దితి    2. అదితి  3. దను   4. కష్ట     5.అరిష్ట     6. సురస  7. ఇళ   8. ముని   9. క్రోధావసు 10. తమ్ర    11. సురభి 12. సరమ    13. తిమి అనే భార్యలు ఉన్నారని అంటారు. ఇక్కడకూడా 13 మందే భార్యలు అయినప్పటికీ, ఇందులో కొన్ని పేర్లు వేరుగా ఉన్నాయనేది గమనార్హం.


  • తిమి వల్ల జన్మించినవి జలచరాలు,  
  • సరమ వల్ల భయంకరమైన జంతువులు,
  • సురభి వల్ల గోవులు, గేదెలు, తదితర గిట్టలు పగిలిన జంతువులు,
  • తమ్ర వల్ల డేగలు, గద్దలు, తదితర పెద్ద పక్షులు,
  • ముని వల్ల దేవతలు, అప్సరలు,
  • క్రోధావసు వల్ల సర్పాలు, దోమలు, తదితర కీటకాలు,
  • ఇళ వల్ల చెట్టు, పాకుడు తీగలు,
  • సురస వల్ల చెడు ఆత్మలు,
  • అరిష్ట వల్ల గుర్రాలవంటి గిట్టలు పగలని జంతువులు, (కిన్నెరలు, గంధర్వులు కూడా అరిష్ట వల్లనే జన్మించారని మరొక కథ),
  • విశ్వ వల్ల యక్షులు,
  • దితి వల్ల 49 మంది వాయుదేవులు,

అదితి వల్ల 33 కోట్ల మంది దేవతలు, 12 మంది ఆదిత్యులు, 11 మంది రుద్రులు, 8మంది వసులు, దను వల్ల 61 మంది పుత్రులు జన్మించారు. వీరిలో 18మంది ముఖ్యులు.
మత్స్య పురాణం (1.171) ప్రకారం, వీరు కాకుండా అనసూయవల్ల తీవ్రమైన వ్యాధులు, సింహిక వల్ల గ్రహాలు, క్రోధ వల్ల పిశాచాలు, రాక్షసులు జన్మించారనీ ఉంది.
అలాగే, మత్స్య పురాణం ప్రకారమే, కశ్యపునికీ తమ్రకూ 6గురు కుమార్తెలు జన్మించారు. వారు : సుఖి, సేని, భాసి, గృధి, సుచి, సుగ్రీవి.

వీరివల్ల కూడా భూమిమీద సృష్టి జరిగింది. సుఖి చిలుకలు, గుడ్లగూబలకు; సేని గద్దలకు; గృధి రాబందులు, పావురాలకు; సుచి హంసలు, కొంగలు, బాతులకు; సుగ్రీవి గొర్రెలు, గుర్రాలు, మేకలు, ఒంటెలవంటి వాటికీ జన్మను ఇచ్చాయి.

వీరు కాకుండా కాశ్యపునికి ఆవత్సర, అసిత అనే ఇద్దరు కుమారులూ ఉండేవారు. ఆవత్సర వల్ల నైద్రువ, రేభ అనే కుమారులు, అసిత వల్ల శాండిల్య అనే కుమారుడు జన్మించారు

వైశ్వానరుని కొమార్తెలు ఇరువురిలోను కాలయందు కాలకేయులును, పులోమయందు పౌలోములును పుట్టిరి. వీరు కాక కశ్యపుని కొడుకులు ఇంకను కొందఱు కలరు. వారు పర్వతుఁడు అను దేవ ఋషి, విభండకుఁడు అను బ్రహ్మ ఋషి.

కాశ్యప గోత్రము

హిందూ సమాజములో సంప్రదాయములలో గోత్రము యొక్క ప్రాధాన్యత అపరిమితమైనది. ముఖ్యంగా పెళ్ళిళ్ళు చేసేటప్పుడు, వధూ వరులకు రాశి, నక్షత్ర, గోత్ర పొంతనలను చూస్తారు. ఎవరికైనా తమ యొక్క గోత్రము తెలియనప్పుడు తమది కాశ్యప గోత్రమని చెప్పుకోవచ్చును. అలాంటప్పుడు ఈ క్రింద ఉటంకించిన శ్లోకమును చెప్పుకోవలెను.

శ్లో. గోత్రత్వస్యాఽపరిజ్ఞానే! కాశ్యపం గోత్రముచ్యతే | ; యస్మాదాహ శ్రుతిః పూర్వం ప్రజాః కశ్యప సంభవాః||
తాత్పర్యము :- ప్రజలు కశ్యపుని వలన జన్మించారు అని శ్రుతివాక్యము.



ఇట్లు

శివ పరివారం 

Saturday, June 27, 2020

సామెతల్లో ఆయుర్వేదం!

సామెతల్లో ఆయుర్వేదం!
.
"తల్లిని చేసినవాడే కాయమూ పిప్పళ్ళు తెస్తాడు" ..అని ..కాయము అంటే బాలింతకు పాలు ఎక్కువగా రావటానికిమూలికలతో తయారు చేసే లేహ్యం ,పిప్పలి త్రిదోషాలను పోగొడుతుంది !
.
పేరులేని వ్యాధికి పెన్నేరు గడ్డ ! ...ఏ రోగమో ఎందుకొచ్చిందో తెలియక పోతే "అశ్వగంధ" పెద్ద మందు !
.
త్రిదోషహరం తిప్పతీగ అని సామెత !
.
"ఉత్తరేణు ఉత్తమం, మధ్యమం మారేడు,కనీసం కందిపుల్ల" ...ఇవి పళ్ళుతోముకోవడానికన్నమాట
.
 వాస్తే వాయిలాకు పాస్తే పాయలాకు ..
.
అప్పుడే పుట్టిన శిశువుకు దొండాకు పసరు పోసేవారు లోపలి కల్మషాలు పోతాయని ...సామెత ఏమంటే  ...."కొడితే చిన్నప్పుడు తాగిన దొండాకు పసరు కక్కుతావు "
.
పుండుమీదకు ఉమ్మెత్త ,నీరుల్లి నూరి నూనెలో వెచ్చజేసి గాయాలపై కట్టేవారట ...సామెత ఇలా ..."పుండుమీదకు నూనెలేదంటే  గారెలొండే పెండ్లామా అన్నట్లు"..."ఉల్లి చేసిన మేలు తల్లి కూడా చేయదు "...
.
వెల్లుల్లి చాలా రోగాలు నయం చేస్తుంది. అది క్షయరోగాన్ని కూడా హరించే శక్తి కలది ...సామెత ...ఇలా ..."ఆశపడి వెల్లుల్లి తిన్నా రోగము అట్లానే ఉన్నది "
.
కరక్కాయ పువ్వు ,పిందె,పండు చాలా ఉపయోగకరమైనవి ...శ్వాస,కాస,ఉదర,క్రిమి,గుల్మ,హృద్రోగం ,గ్రహణి,కామిల,పాండు ..ఇన్ని రోగాలు హరిస్తుంది..అందుకే ..."మున్నూట ఇరవై రోగాలకు మూడు గుప్పిళ్ళ కరక్కాయ పొడి "..అని సామెత 
.
ఆయుర్వేదం మితంగా తినమని చెపుతుంది ..సామెత ఇదుగో ..."పిడికెడు తిన్నమ్మ పీటకోడు లాగ ఉంటే చాటెడు తిన్నమ్మ చక్కపేడులాగుంది "...."ఒక పూట తింటే యోగి రెండు పూటలా తింటే భోగి మూడు పూటలా తింటే రోగి "
.
అలానే ...శిశువు పాలు వాంతి చేసుకోవడం ఆరోగ్యలక్షణమని చెప్పే సామెత ..."కక్కిన బిడ్డ దక్కుతుంది " అని...
.
 ఇలా ఎన్నో సామెతలు ఒక్కొక్కటీ కనుమరుగవుతున్నాయి ! 
.
పిల్లవాడు భాషనే నేర్వనప్పుడు సామెత ఎలా వస్తుంది ? 
.
సామెత తెలియనప్పుడు సంస్కృతి ఎలా తెలుస్తుంది ?
.
అందుకే భాషను చంపితే సంస్కృతి చస్తుంది! 
జాతి జీవనాడి నశిస్తుంది!
ఈ ఆటా పాటలో నున్న ఆరోగ్య రహస్యం మీకు తెలుసా???
కాళ్ళ గజ్జీ కంకోలమ్మా!
వేగు చుక్క వెలగా మొగ్గ
మొగ్గా కాదు మోదుగ ఆకు
ఆకూ కాదు నిమ్మలవారి
వారీ కాదు వావింటాకు
ఆకు కాదు గుమ్మడి పండి
కాళ్ళు తీసి కడగాపెట్టు

 ఈ పాట ...
ఆట మనందరం ఆడినవారమే! పాడినవారమే! 

అయితే ఈ పాటలో ఏముందని ఏప్పుడు మనం ఆలోచించివుండం...ఆలోచిస్తే..ఇందులో దాగున్న అద్బుత వైద్య విజ్ఞానం  మనకు అవగాహనవుతుంది!

కాళ్ళకు గజ్జివస్తే..కంకోళం(గంగారపాకు) అనే ఆకును నూరిరాయాలి!!దానికి తగ్గకపోతే...తెల్లవారుజామున..లేత వెలగ కాయి గుజ్జురాయాలి!! దానికి తగ్గకపోతే మోదుగఆకు నూరిరాయాలి!!...తగ్గడం ప్రారంబించాక.. నిమ్మరసం ను పలచగాచేసి గజ్జి సోకిన కాలిని కడగాలి!! అప్పటికి గజ్జి మాడకపోతే వావింటాకు నూరిరాయాలి!! అంతేకాకుండా గుమ్మడిపండుగుజ్జుకూడా గజ్జికూడా మందుగా పనిచేస్తుంది...ఇలా మన పూర్వీకులు అద్భుతమైన వైద్య విజ్ఞాన రహస్యాలను పాటలరూపంలోను...సామెతల రూపంలోను భద్రపరిచారు  అలాభధ్రపరిచిన విజ్ఞానాన్ని వినోదంలాకాకుండా అంతర్ధుృష్టితో పరిశీలిస్తే.. విజ్ఞానంఅవగాహనకోస్తుంది

Thursday, June 25, 2020

ఆషాఢమాసం - శ్రీ వారాహి నవరాత్రులు

ఆషాఢమాసం - శ్రీ వారాహి నవరాత్రి

*ఆషాఢ శుద్ధ పాడ్యమి నుంచి ఆషాఢ శుద్ధ నవమి వరకు గల తిథుల రాత్రి సమయంలో వారాహీ అమ్మవారిని పూజిస్తారు.వీటిని గుప్తనవరాత్రులు అంటారు.* అమ్మవారి వైభవం గురించి కొంత.......

మనకు శ్రీ విద్యా సంప్రదాయంలో గల నాలుగు ముఖ్య నవరాత్రులలో ఆషాఢంలో వచ్చే వారాహి నవరాత్రి ఒకటి. వారాహి దేవి లలితా పరాభట్టారిక యొక్క సేనాని..లలిత యొక్క రధ, గజ, తురగ, సైన్య బలాలు అన్నీ వారాహి యొక్క ఆధీనంలో ఉంటాయి...అందుకే ఆవిడను దండనాథ అన్నారు...

లలితా పరమేశ్వరి యొక్క ఐదు పుష్పబాణాల నుంచి ఉద్భవించిన శక్తుల వరాహ ముఖంతో ఆవిర్భవించిన శక్తి శ్రీ మహా వారాహీ దేవి.లలితా దేవి సైన్యానికి ఆమె సర్వ సైన్యాధ్యక్షురాలు.ఆమెకు ప్రత్యేక రథం ఉంది,దానిపేరు కిరి చక్రం.ఆ రథాన్ని 1000 వరాహాలు లాగుతాయి, రథసారథి పేరు స్థంభిని దేవి. ఆమె రథంలో దేవతా గణమంతా కొలువై ఉంటుంది. ముఖ్యంగా ఆయుర్వేద మూలపురుషుడైన ధన్వంతరీ, మరియు దేవవైధ్యులైన అశ్విని దేవతలు.

కిరిచక్ర రథారూఢ దండనాథా పురస్కృతా |
జ్వాలామాలిని కాక్షిప్త వహ్నిప్రాకార మధ్యగా || 27 ||

భండసైన్య వధోద్యుక్త శక్తి విక్రమహర్షితా |
నిత్యా పరాక్రమాటోప నిరీక్షణ సముత్సుకా || 28 ||

భండపుత్ర వధోద్యుక్త బాలావిక్రమ నందితా |
మంత్రిణ్యంబా విరచిత విషంగ వధతోషితా || 29 ||
విశుక్ర ప్రాణహరణ వారాహీ వీర్యనందితా |

అంటూ లలితా సహస్రనామాల్లో హయగ్రీవ, అగస్త్యులు ఈ అమ్మవారి గురించే చెప్పుకున్నారు. విశుక్రుడిని ఈ తల్లి హతమార్చింది.ఈ అమ్మవారిని ఆజ్ఞా చక్రంలో ధ్యానిస్తారు.

వారాహీ అమ్మవారు అంటే భూదేవి.హిరణ్యాక్షుడు భూదేవిని జలాల్లోకి తీసుకువెళ్ళినప్పుడు,శ్రీ మహావిష్ణువు వరాహరూపంలో అవతరించి,వాడిని సంహరించి,భూదేవిని రక్షిస్తాడు.స్వామి మీద ప్రేమతో అప్పుడు అమ్మవారు వారాహీ రూపం తీసుకుందని, అందువలన ఈమె #వరాహస్వామి యొక్క స్త్రీ రూపమని కొన్ని ధ్యానశ్లోకాల్లో కనిపిస్తుంది.అంటే వారాహీ అమ్మవారు అంటే ఎవరో కాదు సర్వసంపదలను ఇచ్చే శ్రీ మహాలక్ష్మీ.అందుకే శ్రీ లక్ష్మీ సహస్రనామ స్తోత్రంలో వారాహీ ధరణీ ధ్రువా అని కనిపిస్తుంది. కాబట్టి ఈ అమ్మవారిని పూజిస్తే వరహాస్వామి లాగే అన్ని కోరికలను నెరవేర్చుతుంది. భూతగాదాలను నివారిస్తుంది, లేదా పరిష్కరిస్తుంది.

అమ్మ స్వరూపాన్ని గమనిస్తే వరాహ ముఖంతో, అష్ట భుజాలతో, శంఖ, చక్ర, హల(నాగలి),ముసల(రోకలి), పాశ, అంకుశ, వరద, అభయ హస్తాలతో ప్రకాశిస్తూ మనకు దర్శనం ఇస్తుంది...ఇది మహావారాహి(బృహద్వారాహి) యొక్క స్వరూపం...ఇంకా లఘువారాహి, స్వప్నవారాహి, ధూమ్రవారాహి, కిరాతవారాహిగా అమ్మ ఉపాసకుల పూజలు అందుకుంటుంది.

అమ్మవారి చిత్రాన్ని జాగ్రత్తగా పరిశీలిస్తే,ఆవిడ హలము (నాగలి), ముసలము (రోకలి) ధరించి కనిపిస్తుంది.నాగలిని భూమిని దున్నడానికి ఉపయోగిస్తే, రోకలిని ధాన్యం దంచడానికి వాడతారు. దీనిబట్టి అమ్మవారు సస్యదేవత అని గ్రహించాలి. అంటే పాడిపంటలను సమృద్ధిగా ఇచ్చే కల్పవల్లీ శ్రీ వారాహీ మాత.అందుకే అమ్మవారిని ఆషాఢ మాసంలో పూజించమన్నారు.నిజానికి రైతు గోఆధారిత వ్యవసాయం ద్వారా భూమిని శుద్ధి చేసి, సాగు చేస్తే అది కూడా ఒక రకమైన వారాహీ ఉపాసనే అవుతుంది.ఎందుకంటే వారాహీ అంటే ఎవరో కాదు సాక్షాత్తు భూమాత.

పరాశక్తిలోని సౌమ్యం శ్యామల అయితే, ఉగ్రం వారాహి...శ్రీ విద్యా గద్యంలో "అహంకార స్వరూప దండనాథా సంసేవితే, బుద్ధి స్వరూప మంత్రిణ్యుపసేవితే" అని లలితను కీర్తిస్తారు...దేవీ కవచంలో "ఆయూ రక్షతు వారాహి" అన్నట్టు...ఈ తల్లి ప్రాణ సంరక్షిణి....ఆజ్ఞాచక్రం ఆవిడ నివాసం

ప్రకృతి పరంగా చూసినట్లైతే...ఈ సమయంలో వర్షం కురుస్తుంది...రైతులు భూమిలో విత్తనాలు చల్లడానికి తయారవుతారు...దేశం ధాన్యంతో సుభిక్షంగా ఉండాలని ధాన్యలక్ష్మీ స్వరూపమైన వారాహిని ప్రార్థన చేయడం జరుగుతుంది…


వారాహీ అమ్మవారిని చూసి ఉగ్రదేవతగా భ్రమపడతారు కొందరు.కానీ వారాహీ చాలా శాంతస్వరూపిణి.వెంటనే అనుగ్రహిస్తుంది,కరుణారస మూర్తి అని గ్రంథాలు స్పష్టం చేస్తున్నాయి.వారాహీ అమ్మవారిని స్మరిస్తే శత్రు నాశనం జరుగుతుంది, అంటే వ్యక్తిలో ఉన్న అంతఃశ్శత్రువులైన కామం, క్రోధం,లోభం,మోహం,మదం, మాత్సర్యం,అహంకారం, అజ్ఞానం నశిస్తాయి. అంతఃశ్శత్రువులను జయించినవాడికి బయట శత్రువులు ఉండరు లేదా కనిపించరు,అంత విశాలమైన దృష్టి అతడికి కలుగుతుంది. అలాంటి దివ్యస్థాయిని ప్రసాదిస్తుంది వారాహీ మాత.
1. ఓం శ్రీం హ్రీం క్లీం వరాహై మమ వాక్మే ప్రవేశయా వాకు పాలితాయ ||
మమ మాతా వరాహి మమ దారిద్ర్యం నాశాయ నాశాయ హుం భట ||

2. ఓం శత్రు శంకరి సంకటహరణీ మమ మాత్రే హ్రీం దుం వం సర్వారిష్టం నివారాయ నివారాయ హుం భట్ ||

3. ఓం క్లీం వారాహి హ్రీం సిద్ధి స్వరూపిణి శ్రీం సిద్ధి స్వరూపిణి శ్రీం ధనవశంకరి ధనం వర్షాయా వర్షాయా స్వాహా ||

4. ఓం శ్రీం పంచమి సర్వసిద్ధి మాతా మమ గృహామి ధనం ధన్యాం సమృద్ధిం దేహి దేహి నమః ||

5. ఓం హ్రీం భయానకరీ అతి భయంకరి ఆశ్చర్యా భయంకరీ సర్వ జన భయంకరీ ||
సర్వ భూత ప్రేత పిశాచ భయంకరీ సర్వ భయం నివారాయ శాంతిర్ పావతు మే సదా ||
సర్వ భూత ప్రేత పిశాచ భయంకరీ సర్వ భయం నివారాయ శాంతిర్ పాదుమే సదా ||

అమ్మ ఉగ్రంగా కనబడినప్పటికి...బిడ్డలను కంటికి రెప్పలా కాపాడే కన్నతల్లి...ముఖ్య ప్రాణ రక్షిణి...హయగ్రీవ స్వామి అగస్త్యులవారికి చెప్పిన వారాహి నామాలు…




ఇట్లు
శివ పరివారం
(మిగిలిన సమాచారాన్ని పూర్తి చేసి మరల షేర్ చేస్తాను)

Tuesday, June 23, 2020

శ్రీ మహావిష్ణుని 21 అవతారములు

శ్రీ మహావిష్ణుని 21 అవతారములు

మనలను ఎవరైనా శ్రీ మహావిష్ణుని అవతారములు ఎన్ని అని అడిగితే నామం ఠక్కున 10 అని చెప్తాము కదా! కానీ హైందవ ధర్మం ప్రకారం భగవానుడు ప్రతి చరాచర సృష్టిలో నిండి ఉన్నాడు. కానీ ఆ విష్ణు భగవానుని లీలలు చెప్ప బడిన శ్రీమద్ భాగవతం ప్రకారం శ్రీమహావిష్ణువు ఇప్పటివరకు 21 ముఖ్యమయిన అవతారములు ధరించి భూమిమీదకు వచ్చారు. మరి అవి ఏమిటో ఇప్పుడు చూద్దామా!


  1.  సనత్కుమారుడు 
  2. వరాహ 
  3. నారదుడు 
  4. నర నారాయణులు (ఇద్దరు)
  5. కపిల మహర్షి 
  6. దత్తాత్రేయుడు 
  7. యజ్ఞుడు 
  8. ఋషభ దేవుడు 
  9. పృధు మహారాజు 
  10. మత్స్యం 
  11. ధన్వOతరి 
  12. కూర్మం 
  13. మోహిని 
  14. నృసింహ 
  15. వామన 
  16. పరశురామ 
  17. వ్యాస మహర్షి 
  18. శ్రీరామ 
  19. శ్రీ కృష్ణ 
  20. బుద్ధ (manam ippudu cheppukuntunna buddudu kadu)
  21. కల్కి 

వీరి గురించి వివరంగా తరువాతి టపా లలో తెలుసు కుందాం!

స్వయంభు మనువు కర్దమ ప్రజాపతి - దేవహుతి

ప్రియమైన భాగవత శివ పరివారం కు శుభాకాంక్షలు

గురువు  గారు రోజు చెబుతున్న భాగవతం లో అన్ని పేర్లు ఎలా గుర్తు పెట్టుకుంటున్నారు ? , గురువు గారు భాగవతం చెప్పిన తర్వాత ఒక్కసారి ఆ పేర్లు తలచుకుందాం అని ప్రయత్న పూర్వకం గా చాల రోజులు నుంచి ప్రయతిస్తున్నాను

స్వయంభు మనువు

స్వయంభు మనువు, మనకు ఉన్న పదునాలుగు మంది మనువులు  అందరిలో మొదటివాడు. అతని పేరు మీదుగానే మనకు మానవులు (ఆంగ్లంలో Man కూడా ఇక్కడి నుండే వచ్చింది) అని పేరు వచ్చింది.

బ్రహ్మదేవుడు తన సృష్టి కార్యమును మొదలు పెట్టినప్పుడు అతనికి సృష్టి చాలా నిదానంగా జరుగుతుంది అని అనిపించసాగింది. అందుకని బ్రహ్మదేవుడు కుమారులను సృష్టి కార్యక్రమములను కొనసాగిన్చావలసినదిగా కోరాడు. కానీ వారు నిరాకరించారు. ఆ పరిస్థితులలో బ్రహ్మదేవుడు ఒక యోచన చేసారు. మొదటిసారి స్త్రీ పురుషులను సృష్టిస్తే, మిగిలిన సృష్టి కార్యం తనంత తానుగా జరుగుతుంది అని భావించారు. తన ఆలోచనను అమలులో ఉంచుతూ బ్రహ్మదేవుడు తన శరీరాన్ని రెండుగా విభజించారు. ఒక బాగం స్వయంభుమనువు, మరొక భాగం శతరూప అనే ఒక స్త్రీ.



అప్పుడు బ్రహ్మదేవుడు వారిని సృష్టి కార్యం చేయమని చెప్పారు. అప్పుడు స్వయంభు మనువు తాము నివసించుటకు భూమి లేదు అని బ్రహ్మదేవునకు గుర్తుచేశారు. అప్పుడు పరిసరములను గమనించిన బ్రహ్మదేవుడు భూమి మరలా గర్భొదక జలములలో మునిగి ఉండుట చూసాడు. ఆ సమయంలోనే శ్రీ మహావిష్ణువు వరాహవాతారం ధరించి భూమిని ఉద్దరించారు.

శతరూప, స్వయంభు మనువులకు

పుత్రికలు                         పుత్రులు    
ఆకూతి                              ఉత్తానపాదుడు
దేవహూతి                          ప్రియవ్రతుడు
ప్రసూతి



బ్రహ్మదేవుడు తన సృష్టి కార్యమును మొదలుపెట్టి, మొట్ట మొదట నలుగురు పుత్రులను సృష్టించాడు.

సనకుడు                   సననందనుడు        సనత్కుమారుడు       సనత్ సుజాతుడు 



వారిని సృష్టి కార్యం సహాయం చేయమని చెప్పగా, వారు ఆ కార్యం చేయుటకు తమ అనంగీకారం తెలుపగా, బ్రహ్మదేవునికి కోపం వచ్చినది. కానీ తనకు గల శక్తితో ఆ కోపమును నియంత్రించుకొనెను. కానీ ఆ కోపం బ్రహ్మదేవుని నొసటి భాగం నుండి ఒక పుత్రుని రూపంలో బయటకు వచ్చాడు. క్రోధం కారణం గా జన్మించుట చేత, అతను నల్లగా ఉన్నాడు. పుట్టీ పుట్టగానే, ఏడ్చుట మొదలు పెట్టాడు. ఎందుకు ఏడుస్తున్నావు అని తండ్రి అయిన బ్రహ్మదేవుడు అడుగగా, తన పేరు ఏంటి? తను ఎక్కడ ఉండాలి? అని అడిగాడు. పుట్టుకతోనే ఏడ్చాడు కనుక అతనికి రుద్రుడు అని పేరు పెట్టారు. నలుపు ఎరుపు కలిగిన రూపం కలిగి ఉన్నాడు కనుక నీలలోహితుడు అని అన్నారు.

1. మన్యువు - ధీర - చంద్రుడు 
2. మనువు - వృత్తి - సూర్యుడు 
3. మహాకాలుడు - అశన - అగ్ని 
4. మహశ్చివుడు - ఉమ - వాయువు 
5. ఋతధ్వజుడు - నియతి - జలము 
6. ఉరురేతుడు - సర్పి - ఆకాశము 
7. భవుడు - ఇల - భూమి 
8. కాలుడు - అంబిక - ప్రాణములు 
9. వామదేవుడు - ఇరావతి - తపస్సు 
10. ధృతవ్రతుడు - సుధ - హృదయం 
11. నీలలోహితుడు - దీక్ష - ఇంద్రియములు 

తనకి పేర్లు, భార్యలు, నివాస స్థానములు నిర్ణయించిన మీదట, సృష్టి కార్యం చేయమని చెప్పగా, నీలలోహితుడు అలాగే చేసాడు. కానీ అతని వలన కలిగిన సంతానం తమోగుణం కలిగిన వారు అయినారు కనుక ఈ సృష్టికి విపత్తు ఏర్పడినది. అప్పుడు మరలా బ్ర్హమదేవుడు వారిని తపస్సు చేయమని అడిగారు. వారు అలాగే అని తపస్సు చేసారు.

నవబ్రహ్మలు

నీలలోహిత రుద్రుని తరువాత బ్రహ్మ సృష్టి క్రమంలో 10 మంది పుత్రులను తన శరీరం నుండి సృష్టించాడు. వారు

1. బ్రొటన వేలి నుండి దక్షుడు 
2. ఊరువులు (తొడలు) నుండి నారదుడు 
3. నాభి నుండి పులహుడు 
4. చెవుల నుండి పులస్త్యుడు  
5. చర్మం నుండి భృగువు 
6. చేతి నుండి క్రతువు 
7. ముక్కు నుండి అంగిరసుడు 
8. ప్ర్రాణం నుండి వసిష్ఠుడు 
9. మనస్సు నుండి మరీచి 
10. కన్నుల నుండి అత్రి 


ఈ పది మందిలో నారదుడు నిత్య బ్రహ్మచారి అగుట వలన తన సృష్టి కార్యంలో ప్రత్యక్షంగా తోడ్పడక పోయినందువలన, అతనిని తప్పించి మిగిలిన 9 మందిని నవబ్రహ్మలు అని అంటారు. వీరు 9 మంది దేవహుతి, కర్ధముల 9 మంది పుత్రికలను  వివాహం చేసుకుని బ్రహ్మదేవుని సృష్టి కార్యంలో సహాయం చేసారు.

కర్దమ ప్రజాపతి - దేవహుతి

కర్దమ ప్రజాపతి కృతయుగంలో జన్మించారు. ఒకనాడు సాక్షాత్తు బ్రహ్మదేవుడే ఈ మహర్షిని తన సృష్టి కార్యంలో సహాయం చేయవలసినది అని అడిగారు. అప్పుడు కర్దమ ఋషి సరస్వతి నదీతీరంలో తపస్సు మొదలు పెట్టారు. అలా 10000 సంవత్సరముల పాటు తపస్సు చేసిన తరువాత ఒకరోజు శ్రీమహావిష్ణువు అతనికి దర్శనం  ఇచ్చారు. ఆ ఆనందంలో కర్దమ ఋషి  అనేక విధములుగా విష్ణుని పూజించి, కీర్తించి, అప్పుడు బ్రహ్మ తనముందు ఉంచిన భాద్యతను నిర్వర్తించుటకు ఒక అనుకూలవతి అయిన కన్య ఎక్కడ ఉంటుందో చెప్పవలసినది అని కోరారు.

అతని సేవలకు , తపస్సుకు సంతోషించిన శ్రీమహావిష్ణువు ఆ  కన్య స్వాయంభువ మనువు కు జన్మించిన దేవహుతి అని చెప్పి, మరునాటి సమయంలో వారే స్వయంగా కర్ధముని వద్దకు వచ్చి కన్యాదానం చేస్తారు అని చెప్పారు.

మరునాటి సమయంలో స్వాయంభువ మనువు తన భార్య, పుత్రికలతో కలసి కొంతసైన్యం తోడు రాగా కర్ధముని ఆశ్రమమునకు వచ్చారు. తన ఆశ్రమమునకు వచ్చిన అతిధులకు కర్దముడు అతిధి మర్యాదలు చేసి, వారి రాజ్యంగురించిన కుశల ప్రశ్నలు అడిగినమీదట స్వాయంభువ మనువు తను వచ్చిన కార్యం చెప్పారు. గుణ,శీల,జ్ఞాన వంతురాలయిన తన కుమార్తె దేవహుతికోరకు తను వరునికోసం వెతుకుతున్నందున, ఆమె ఒకసారి నారదముని వలన కర్ధముని గురించి విని ఉండుట చేత ఆమె కర్ధముని మనస్సునందే వరించిన కారణంగా, ఆమెను కర్ధమునికి ఇచ్చి వివాహం చేయాలి అనే సంకల్పంతో తన కుమార్తెను కూడా వెంటబెట్టుకుని వచ్చారు అని.

ఆ మాటలు విన్న కర్దముడు అత్యంత లావణ్య రాశి అయిన దేవహుతిని వివాహం చేసుకొనుటకు తనకు సమ్మతమే కానీ ఒక షరతు ఉన్నది అని చెప్పాడు.
ఆమెకు ఎప్పటివరకు సంతానం కలుగకుండా ఉంటుందో అప్పటివరకు మాత్రమే ఆటను గృహస్థుగా ఉంటానని, పుత్రుడు కలిగిన మీదట అతను వానప్రస్థమునకు వెళ్ళేందుకు అంగీకరిస్తే వివాహం చేసుకుంటాను అని.

స్వయంభువమనువు తన భార్య శతరూప వలన తన కుమార్తె దేవహుతి అభిప్రాయం తెలుసుకుని, సంతోషించి, వారికి శాస్త్రబద్దంగా వివాహం చేసారు.

అప్పటి నుండి  పరమశాంతంగా, వినమ్రతతో భక్తితో దేవహుతి భర్త సేవచేస్తూ ఉంది.  కొంతకాలము తరువాత చిక్కిపోయిన దేవహుతిని చూసి, ఆమె చేసిన ఈ తపస్సు ఆమె తనఃమనస్సులను పరిశుద్ధం చేసుకొన్నది. కనుక ఆమెకు సకల సౌక్యములను అనుభావింప చేయవలసిన సమయం ఆసన్నమైనది అని భావించి, అతని అద్వితీయమైన తపఃశక్తి వల్ల అనేక అనన్య సామాన్యమైన సౌక్యములతో కూడిన ఒక విమానమును సృష్టించి, ఆమెతో సంతోషంగా కాలం గడుపసాగాడు. కొంతకాలమునకు దేవహుతికి 9 మంది పుత్రికలు కలిగారు.
మరికొంతకాలం తరువాత కర్దముడు వానప్రస్తామునకు వెళ్ళబోతున్నాడు అని తెలుసుకుని, దేవహుతి అతని పాదములకు నమస్కరించి తమకు ఇంకా పుత్రుడు కలుగలేదు కనుక అతనిని అప్పుడే వెళ్ళుటకు ఆమె అభ్యంతరం తెలిపినది.

ఆ మాటలు విన్న కర్దముడు శ్రీ మహావిష్ణువును మనస్సు నందు తలచుకుని చిన్న చిరునవ్వు మొహంపై తొణికిసలాడగ, ఆమెను అనునయిస్తూ, ఆమె ఇప్పుడు గర్భవతి అని, ఆ భగవంతుడే స్వయంగా తమ పుత్రునిగా జన్మించబోతున్నారని, అతని దయవలననే దేవహుతికి సంఖ్యాయోగం వినగలుగుతుంది, ఆమె తరించ గలదు అని చెప్పి,  కర్దముడు వానప్రస్థమునకు వెళ్లి పోయారు.

కొంతకాలమునకు దేవహుతి కపిలునికి జన్మను ఇచ్చినది.

వారికి గల 9 మంది పుత్రికలను 9 మంది బ్రహ్మలకు ఇచ్చి వివాహం చేశారు. కుమార్తెలు, అల్లుడుల పేర్లు

  1. కళ - మరీచి  
  2. అనసూయ - అత్రి 
  3. ఊర్జ - వసిష్టుడు 
  4. శ్రద్ధ  - అంగిరసుడు 
  5. హవిర్భవు - పులస్త్యుడు 
  6. గతి - పులహుడు 
  7. క్రియ - క్రతువు 
  8. ఖ్యాతి - భృగువు 
  9. చిత్తి  - అదర్వుడు 


సశేషం
ఇట్లు
శివ పరివారం