ప్రియమైన శివ పరివారం కు శ్రీ కృష్ణ శరణం మమ
మనకి నిత్యం జరిగే శ్రీ మద్ భాగవతం లో ఇప్పుడు శ్రీ కృష్ణ భగవానుడు జరాసంధుడు కధ లోకి వచ్చాము , అయితే శివ పరివారం లో ఒకరు చివరిలో సందేహాలు లో ఒక ప్రశ్న వేశారు
17 సార్లు దాడులు జరిగే వరకూ జరసంధాను శ్రీకృష్ణుడు ఎందుకు చంపలేదు?
ఒకనాడు కృష్ణ పరమాత్మ నిండు పేరోలగంలో సభ తీర్చి ఉన్నాడు. అపుడు ఒక బ్రాహ్మణుడు సభలోకి వచ్చి ఒక మాట చెప్పాడు. ‘అయ్యా, జరాసంధుడు అనే రాజు అనేకమంది రాజులను ఓడించి కారాగారంలో బంధించాడు. వారందరూ కూడా అనేకమయిన హింసలు పొందుతున్నారు. కాబట్టి మీరు త్వరలో విచ్చేసి జరాసంధుడిని వధించి ఆ రాజులందరికీ స్వేచ్ఛ కలిగేటట్లుగా అనుగ్రహించ వలసినది’ అని కోరాడు. ఆమాటలు విన్న కృష్ణ పరమాత్మ సంతోషించి ‘తప్పకుండా మేము తొందరలో వచ్చి జరాసంధుడిని వధిస్తాము’ అని మాట యిచ్చి, ఈ సందర్భంలో ఎం చేస్తే బాగుంటుందో ఆలోచనను చెప్పమని ఉద్ధవుడిని అడిగారు. పరమాత్మ అన్నీ తెలిసు ఉన్న వాడయి ఉంది ఉద్ధవుడిని అడగడం ఎందుకు? కానీ ఈశ్వరుడికి సహకరించిన పుణ్యమును పదిమందికి కట్టబెడతారు. అపుడు ఉద్ధవుడు అన్నారు “ఇటువంటి కార్యం చేసేముందు ఒకపని చేస్తే బాగుంటుంది. ధర్మరాజు గారి చేత రాజసూయయాగం చేయించి ఆ యాగం చేసేటప్పుడు నాలుగు దిక్కులా ఉండే రాజుల పీచమణచదానికి నలుగురిని పంపవలెను కనుక ఆ సందర్భంలో జరాసంధుడిని కూడా వధించి రాజసూయ యాగం చేస్తే బాగుంటుంది మీరు అలా ఆలోచించండి’ అన్నాడు. ‘చాలామంచి ఆలోచన చెప్పావు’ అని కృష్ణ పరమాత్మ ఇంద్రప్రస్థమునకు చేరుకున్నారు.
ధర్మరాజు కృష్ణ పరమాత్మకు ఎదురువచ్చి స్వాగతం పలికాడు. రాజసూయ యాగం చేయడానికి సంకల్పం జరిగింది. వెంటనే ధర్మరాజు గారు తన సోదరులను పిలిచి నలుగురినీ నాలుగు దిక్కులకు పంపారు. నాలుగు దిక్కులకు వెళ్ళిన వారు అన్ని దిక్కుల వాళ్ళని ఓడించి తిరిగి వచ్చారు. ధర్మరాజుగారి పేరు చెప్పగానే ఎవరూ వ్యతిరేకించిన వారు లేరు ఒక్క జరాసంధుడు తప్ప. ఏమి చెయ్యాలా అని ఆలోచిస్తుంటే కృష్ణ పరమాత్మ ‘ధర్మజా, నీవు బెంగ పెట్టుకోవద్దు. జరాసంధుడిని వధించడం కోసమని నేను అర్జునుడు భీమును బ్రాహ్మణ రూపంలో వెళతాము. జరాసంధుడి దగ్గర ఒక మంచి అలవాటు ఉంది. వాడు బ్రాహ్మణులు ఏదయినా అడిగితే లేదనకుండా ఇచ్చేస్తాడు. కాబట్టి బ్రాహ్మణరూపంలో వెళ్లి యుద్ధ భిక్షను అడుగుతాము. ఇస్తాను అనిన తరువాత వాడు తప్పుకోవడానికి వీలులేదు. వాడు యుద్ధం చేస్తాడు. యుద్ధంలో జరాసంధుడు మరణిస్తాడు. తరువాత రాజసూయ యాగం చేద్దాము’ అని ముగ్గురూ బ్రాహ్మణ రూపములు ధరించి మగధ దేశమునకు వెళ్ళారు. జరాసంధుడు బయటకు వచ్చి మీకేమి కావాలి?” అని అడిగాడు. వాళ్ళు మాకు యుద్ధభిక్ష కావాలి అన్నారు. బ్రాహ్మణులయిన వారు యుద్ధ భిక్ష కోరడం ఏమిటి అని జరాసంధుడు వారి ముగ్గురిని తేరిపార చూశాడు. వాడేమీ తెలివి తక్కువ వాడు కాదు. వచ్చినవాళ్ళు కృష్ణ భీమార్జునులని గుర్తించాడు. కృష్ణుడిని చూసి ఒక మాట అన్నాడు. జరాసంధుడు కృష్ణుని చేతిలో 17సార్లు ఓడిపోయాడు. కానీ 18 వ సారి జరాసంధుడిని తప్పించుకుని ద్వారకకు పారిపోయి అక్కడ ఉన్నాడు. 18 వ సారి కృష్ణుడు ఓడిపోయినట్లు నటించాడు. అపుడు ఆయన అలా ఓడిపోయినట్లు నటించడానికి కారణమే ఇప్పుడు జరాసంధుడు చచ్చిపోవడానికి కారణం అవుతుంది. 17 సార్లు తానూ ఓడిపోయానన్నది జరాసంధుడు మరచిపోయాడు. 18 వ సారి కృష్ణుడు పారిపోయాడు అన్నది గుర్తు ఉంది. జరాసంధుడు కృష్ణుడిని ఎంత మాట అన్నాడో చూడండి!
“ఏమి వింతయ్యా! నేను యుద్ధమునకు వస్తే పారిపోయిన వాడివి ఇవాళ వచ్చి యుద్ధ భిక్ష అడుగుతున్నావు. అడగడానికి నీకు సిగ్గు లేకపోవచ్చు. కానీ నీతో యుద్ధం చేయడానికి నేను సిగ్గుపడుతున్నాను. పారిపోయిన వాడితో నాకు యుద్ధం ఏమిటి? నేను నీతో యుద్ధం చేయను” అన్నాడు. ఈశ్వరుని అధిక్షేపించడంలోనే వాని మరణం వచ్చింది.
‘కృష్ణా నాతొ యుద్ధ భూమిలో నిలబడడం అంటే అంత తేలికయిన విషయం కాదు. ముందు నువ్వు పక్కకి వెళ్ళు. అర్జునుడు మంచి బలపరాక్రమములు ఉన్నవాడు. గాండీవం పట్టుకుంటే శత్రువులను దునుమాడుతాడు. కానీ అతడు నాకంటే చిన్నవాడు. వీనికన్న పెద్దవాడు భీముడు ఉన్నాడు కదా. అతడు మహా బలవంతుడు. పైగా వాయుపుత్రుడు. నాతో బలమునకు సరిపోతాడు’ అని మిక్కిలి కోపంతో చెయ్యి విసిరి యుద్ధమునకు రమ్మనమని అవతల వాళ్ళని లాగడం మొదలు పెట్టాడు. భీమసేనుడు జరాసందునితో యుద్ధానికి సిద్ధపడ్డాడు.
వెంటనే మల్లయుద్ధం చేయడానికి వీలుగా ఒకచోట భూమిని సమతలంగా తయారుచేశారు. జరాసంధుడు భీమసేనుడు యిద్దరూ మల్లయుద్ధం మొదలుపెట్టారు. భయంకరమయిన యుద్ధం సాగుతోంది. ఇద్దరూ కూడా ఒకరికొకరు తీసిపోని రీతిలో కొట్టుకుంటున్నారు. ముక్కుల్లోంచి కళ్ళల్లోంచి నెత్తురోడి పోయి యిద్దరూ కూడా ఎర్రటి రంగులోకి మారిపోయారు. అలా కొట్టుకుంటున్నారు. బీమునిలో ఉండే తేజస్సు క్షీణించకుండా కృష్ణ పరమాత్మ తనలో ఉన్న తేజస్సును భీమసేనుడియందు ప్రవేశపెట్టారు. కృష్ణుడు తేజస్సు కలియడం వలన భీమసేనుడి తేజస్సు క్షీణించలేదు. జరాసంధుడిది పదివేల ఏనుగుల బలం. యుద్ధంలో వాడేమీ సామాన్యుడు కాదు. యుద్ధం జరగగా జరగగా జరాసంధుడి శక్తి క్షీణించడం మొదలుపెట్టింది. ఎడతెరపి లేని యుద్ధం చేస్తున్న భీమసేనుడి వంక చూసి కృష్ణ పరమాత్మ ఒక్కసారి ఆయన దృష్టిని ఆకర్షించేటట్లుగా పిలిచి చెట్టుకొమ్మ తీసి దానిని రెండుగా చీల్చి చూపించారు. ఆ సంజ్ఞను భీముడు అర్థం చేసుకుని జరాసంధుని ఒకకాలును తన రెండు కాళ్ళతో తొక్కిపట్టి రెండవ కాలును పట్టుకుని ఉత్తరించేస్తే, శరీరంలో సగభాగం తలవరకూ జరాసంధుడి శరీరం రెండు ఖండములుగా విడిపోయింది. ఆ రెండిటిని భీముడు అటూ యిటూ విసిరేశాడు. ఆ రోజున జరాసంధుడు మరణించాడు. అతని మరణానంతరం కృష్ణుడు అక్కడ ఉన్న రాజులందరినీ విడిపించాడు. ‘ధర్మ బద్ధమయిన పాలన చేసే వాడు ఎవడు ఉంటాడో, వానియందు నేను సర్వకాలముల యందు ప్రీతిని కలిగి ఉంటాను. అందుకని మీరు ధర్మ బద్ధంగా పరిపాలించండి’ అని చెప్పి ఆ రాజులకు హితోపదేశం చేసి విడిచి పెట్టేశారు. ఆ రాజులందరూ కూడా బయలుదేరి వెళ్ళిపోయారు. జరాసంధుని వద్ద ఉన్న ధనకనకవస్తు వాహనములను పట్టుకుని కృష్ణ భీమార్జునులు ఇంద్రప్రస్థమునకు చేరుకున్నారు. అప్పుడు రాజసూయ యాగము చేయడానికి ధర్మరాజు సంకల్పం చేశారు.
మరొక కథనం కూడా ఉంది. మరియు ముఖ్యమైనది. భీముడు, బకాసురుడు, కీచకుడు, జరాసంధుడు, దుర్యోధనుడు, ఈ 5 మంది ఒకే నక్షత్రంలో జన్మించారు. వీరి వీరి జాతకాల ప్రకారం, వీరిలో ఎవరు ముందుగా మరొకరి చేతిలో హతమవుతారో మిగిలిన ముగ్గురు కూడా వారి చేతిలోనే మరణిస్తారు. క్రమంగా ఏకచక్రపురంలో పాండవులు నివసిస్తున్న సమయంలో, అంతగా తెలివిలేని బకాసురుడు ముందుగా భీముని చేతిలో సంహరించబడేలా శ్రీకృష్ణుడు ప్రణాళిక రచించాడు. క్రమంగా మిగిలిన ముగ్గురు కూడా భీముని చేతిలోనే మరణించవలసి ఉన్నది. అందుచేత ఆ అవకాశాన్ని భీమునికి ఇవ్వాలన్న కారణంగా కూడా జరాసంధుని సంహరించకుండా ఎదురుచూడవలసి వచ్చింది. సమయం వచ్చేలోపు, సమయాన్ని వృధా చేయకుండా మిగిలిన దుష్టులను మట్టికరిపించాడు శ్రీ కృష్ణ పరమాత్ముడు.
విష్ణు భగవానుడు భూమిపై అవతారం దాల్చిన ప్రతిసారీ, ఆ అవతారం ధర్మ సంస్థాపనకు కారణమయిందని మనందరికీ తెలుసు. క్రమంగా శ్రీ కృష్ణుని అవతారం దాల్చినప్పుడు, కౌరవులందరికి గుణపాఠం బోధించడం, తన మేనమామ కంసుని సంహరించడం అతని ముందున్న ప్రధాన లక్ష్యాలుగా ఉన్నాయి. దాన్ని సాధి౦చుకొడానికి ఆయన తనకు గల ముఖ్యమైన స౦బ౦ధాలను ఆధారితంగా చేసుకున్నాడు. క్రమంగా పాండవులను తన పంచన చేర్చుకున్నాడు. తన భావోద్వేగాలను పక్కకు పెట్టి, తెలివిగా ఆడటం అంత తేలికైన విషయం కాదు. బహుశా ఈ కథ ద్వారా అటువంటి పాఠాన్నే తెలియజేసాడేమో మనందరికీ. కానీ, శ్రీ కృష్ణుని ప్రతి అడుగులోనూ యుక్తి దాగి ఉంటుందని గమనించాలి.
జరాసంధుని ప్రయత్నాలన్నీ విఫలమవుతూ వచ్చాయి ..
శ్రీకృష్ణుడు నివసించే ద్వారక మీదకు దండెత్తడానికి వెళ్ళిన ప్రతిసారీ శ్రీ కృష్ణుడు పెళ్లి కొడుకు రూపంలో అయినా ఉండేవాడు, లేదా సైన్యాన్నంతా ఓడించి తననొక్కటే విడిచిపెట్టేవాడు. పురాణాల ప్రకారం జరాసంధుడు వివాహం చేసుకుంటున్న వారిని ఏమీ చేయడు. క్రమంగా నిరాశతో వెనుదిరగవలసి వచ్చేది. ఎన్నిమార్లు ప్రయత్నించినా, ఎంత శక్తిమంతమైన రాజ్యాలలోని రాజులను శ్రీ కృష్ణుని మీదకు ఉసిగొల్పినా ఓటమే చివరికి వరించేది. క్రమంగా జరాసంధుని ప్రయత్నాలన్నీ వ్యర్థమే అయ్యాయి. అయితే, అతని వైఫల్యం అతని నమ్మకాన్ని ఎన్నడూ బలహీనపర్చలేదు మరియు అతని ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీయలేదు. ఆ విధంగా శ్రీ కృష్ణుని సంహరించడానికి ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా పదిహేడు సార్లు ప్రయత్నించాడు జరాసంధుడు. వచ్చిన ప్రతిసారీ కృష్ణుని చేతిలో ఓడిపోయి సైన్యాన్ని కోల్పోయి, వెనుతిరిగేవాడు. ఇక్కడ శ్రీ కృష్ణుని యుక్తి బాగా తెలుస్తుంది. యుద్ధం చేయడం అంటే శత్రువుని ఓడించడం కానీ, సంహరించడం కాదు అని. క్రమంగా యుద్ధం చేయాల్సిన సమయంలో యుద్ధం చేశాడు, అవసరం లేదనుకున్న సమయంలో యుక్తిని ప్రదర్శించాడు.
అలా అయితే 17 వ దాడి తర్వాత శ్రీకృష్ణుడు ఎందుకని జరాసంధుని సంహరించవలసి వచ్చింది ?. పదిహేడు మార్లు జరాసంధుని ఏమీ చేయని శ్రీకృష్ణుడు, పద్దెనిమిదవసారి మాత్రం విడిచిపెట్టలేదు. నిజానికి జరాసంధుని పుట్టుక వెనుక ఒక కథ ఉంది., జరాసంధుడు తల్లి గర్భం నుండి జన్మించినప్పుడే రెండు భాగాలుగా జన్మించాడు. జరా అనే పేరుగల ఒక రాక్షస మహిళ, ఈ రెండు భాగాలను ఒకటిగా చేసింది. అందుచేత అతనికి జరాసంధుడు అని పేరు పెట్టడం జరిగింది. అతనికి మరో వరాన్ని కూడా ఆమె ప్రసాదించింది. జరాసంధుని ఎవరూ సంహరించలేరు, కేవలం అతని శరీరాన్ని విభజించి వ్యతిరేక దిశలో విసిరివేస్తే తప్ప. కావున దీనికి ఒక ప్రత్యేకమైన ప్రణాళిక అవసరం అవుతుంది. మరెలా సంహరించాడు ? ఇప్పుడు తెలుసుకుందాం.
జరాసంధుని మరణానికి కృష్ణుని ప్రణాళిక :
యుధిష్ఠిరుడు (ధర్మరాజు) రాజసూయ యాగము చేయాలని నిశ్చయించుకున్న సమయం వచ్చింది. అయితే, రాజసూయ యాగాన్ని నిర్వర్తించడం కోసం, ఒక రాజును చక్రవర్తిగా ప్రకటించి, ఇతర రాజులందరూ ఆతనిని తమ చక్రవర్తిగా అంగీకరించడం తప్పనిసరి చేశారు. కానీ జరాసంధుడు శ్రీకృష్ణుని చక్రవర్తిగా అంగీకరించడని తెలుసుకున్న యుధిష్టిరుడు కృష్ణుని సహాయం కోరుకున్నాడు. భీమార్జునులు బ్రాహ్మణులుగా మారువేషం వేసి, జరాసంధుని కడకు వెళ్లి కుస్తీ సవాలు చేయమని కృష్ణుడు సూచించాడు. క్రమంగా ' భీముని' తో కుస్తీకి జరాసంధుడు అంగీకరించాడు. ఈ కుస్తీ పోటీ నాలుగు రోజుల పాటు కొనసాగగా, భీముడు జరాసంధుని సంహరించలేకపోయాడు. క్రమంగా కృష్ణుడు పూనుకోక తప్పలేదు. దూరం నుండి పోటీని పర్యవేక్షిస్తున్న శ్రీ కృష్ణుడు, జరాసంధుని సంహరించడానికి సూచనగా, భీమునికి కనపడేలా ఒక ఆకును ఉపయోగించి, రెండు ముక్కలుగా చేసి వివిధ దిశలలో విసిరేశాడు. మార్గదర్శకంగా, భీముడు జరాసంధుని సంహరించడంలో సఫలీకృతం అయ్యాడు. క్రమంగా జరాసంధుని శరీరాన్ని రెండు సగాలుగా చీల్చి, రెండు భాగాలను వేర్వేరు దిశల్లో విసిరి, వాటిని తిరిగి కలుసుకోనివ్వకుండా చేసి జరాసంధుని సంహరించాడు.
బలరాముని ప్రశ్నకు శ్రీకృష్ణుని సమాధానం :
కంసుని మద్దతుదారుడైన జరాసంధుని మరణం జరిగిన చాలాకాలం తర్వాత, బలరాముడు, కృష్ణుడు ఒక చర్చకు పూనుకున్నారు. బలరాముడు శ్రీ కృష్ణుని అన్న. చర్చ సందర్భంగా, అతన్ని సంహరించగలిగిన నువ్వు ఇంత కాలం ఎందుకు వేచి ఉన్నావు అని అడిగాడు బలరాముడు. క్రమంగా, శ్రీ కృష్ణుడు బలరామునికి ఇలా చెప్పాడు, ప్రతిసారి జరాసంధుడు దాడి చేసే నిమిత్తం కొత్త సైన్యంతో వచ్చేవాడు. ఈ సైన్య౦లో అత్యంత శక్తిమ౦తులైన రాజులతో సహా భూమ్మీద ఉండే అనేకమంది దుష్ట ప్రజలు కూడా ఉన్నారు. క్రమంగా వారందరినీ ఒకే చోట మట్టుబెట్టే అవకాశం వచ్చింది. అలా దుష్టులను జరాసంధుడు తీసుకుని వచ్చేవాడు, నేను వారిని సంహరించేవాడిని. అని బదులిచ్చాడు. ఈ సమాధానం కారణంగా, శ్రీ కృష్ణుని మేధస్సును, ప్రజ్ఞాపాఠవాలను, యుక్తిని మెచ్చుకోకుండా ఉండలేకపోయాడు బలరాముడు.
ఇట్లు
శివ పరివారం
No comments:
Post a Comment