త్రికాలజ్ఞులై నిష్కాములైన భౌతికసుఖములనుకోరని ఋషీశ్వరులు యోగదృష్టితో లోకకళ్యాణమునకు ఉత్కృష్టమైన మంత్రములు ప్రసాదించిరి.
మకారం మననం ప్రాహు స్తకారస్త్రాణ ఉచ్యతే/మనన త్రాణసంయుక్తో మంత్ర ఇత్యభి ధీయతే //
'మ' మననం చేయువానికి 'త్ర' రక్షించును. అనగా మననం చేయువానిని రక్షించునది మంత్రమనబడును.
మంత్రములలో శైవ మంత్రములు ఒక కోటి, సౌరములు రెండు కోట్లు, గణేశ మంత్రములు ఏబది లక్షలు, వైష్ణములు ఏబది లక్షలు, శక్తి మంత్రములు మూడు కోట్లు గలవు. ఈ సప్తకోటి మహామంత్రములలో ఆది మంత్రం "గాయత్రి".
యోగులకంటే మంత్రజపం చేయువారు మిగుల ఉత్తములని భారతమున చెప్పబడెను. యజ్ఞములన్నింటిలో జపయజ్నం శ్రేష్టమైనది. యజ్ఞానం జపయజ్ఞోస్మి (భగవద్గీత) . 'సర్వమంత్రేషు గాయత్రీ వరిష్టా ప్రోచ్యతే బుధై:' సర్వమంత్రములలో గాయత్రిమంత్రం మిక్కిలి శ్రేష్టమైనది.
'గయాన్ త్రాయతేసా గాయత్రీ 'అనగా ఏది గయ - ప్రాణమును రక్షిస్తుందో - అది గాయత్రి (ఐతరేయ బ్రాహ్మణం). ప్రాణములను ఉద్ధరించే సామర్ద్యము కారణముగా ఆదిశక్తి గాయత్రి అనుబడినది. 'గాయత్రీ వేద మాతా చ' గాయత్రి వేదములయొక్క తల్లి. ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తియు గాయత్రీ శక్తిజనితములు. శంకరాచార్య భాష్యములో గాయత్రీశక్తిని స్పష్టం చేస్తూ ఇలా చెప్పబడినది - 'గీయతే తత్వమనాయ గాయత్రీతి ' అనగా ఏ వివేకబుద్ధి ఋతంభరా ప్రజ్ఞ ద్వారా వాస్తవికత యొక్కజ్ఞానము లభింపజేస్తుందో అది గాయత్రి.
గాయత్రీ తు స్వయం పూర్ణో యోగ ఇత్యుచ్చతే బుధై: / కించిత్తత్వం హి యోగస్య బహిరస్మాన్న విద్యతే //
భావం : గాయత్రి స్వయముగా పూర్ణయోగం అని పండితులు తెలియజేశారు. యోగం యొక్క ఏ తత్వాలు దీనికి బాహ్యముగా లేవు. యోగమనగా కలయిక. ఆత్మను పరమాత్మలో కలిపేదే యోగం. ఐతే యోగసాధన మార్గాలు అనేకం. ఒకొకరి సాధన ఓకోలా వుంటుంది. సాధకుని స్థితిబట్టి, అవగాహనబట్టి, అనుకూలతబట్టి, శక్తిబట్టి, యోగ్యతబట్టి తమకు నచ్చిన సాధనమార్గాన్ని అనుసరిస్తారు. ఏ సాధనైన దాని పరమార్ధం పరమాత్మలో సంలీనమే. ఈ సాధనామార్గాలలో గాయత్రీ సాధన ఒకమార్గం.
గాయత్రీమాతకు ఐదు ముఖములుండును. అందు మొదటిది ముత్యపురంగు, రెండవది పగడపురంగు, మూడవది బంగారపు వన్నెయు, నాల్గవది ఇంద్రనీలపువర్ణమును, ఐదవది వజ్రపువర్ణమును కలిగియుండును. ఈమె త్రినేత్రదారిణి. నవరత్నకిరీటమును ధరించి ప్రకాశమానమై యుండును. దశబాహువులు కలిగి అందు వరదాభయముద్రలను, అంకుశం, కొరడా, కపాలం, శంఖ చక్ర గదా పద్మద్వయమును ధరించి ఎల్లప్పుడూ భక్తులను రక్షించుచుండును.
* ఆదిశక్తి - వేదమాత - దేవమాత - విశ్వమాత *
గాయత్రి పరమాత్మ యొక్క ఇచ్చ్చాశక్తి. దాని కారణముగా సృష్టి మొత్తం నడుచుచున్నది. చిన్న పరమాణువు మొదలుకొని పూర్తి విశ్వబ్రహ్మాండం వరకు ఆమె యొక్క శక్తిప్రభావం వలననే చరిస్తున్నాయి. పరమాత్మ స్వయముగా మౌలికరూపంలో నిరాకారుడు, అన్నిటినీ తటస్థ భావముతో చూస్తూ శాంతియుత అవస్థలో ఉంటారు.సృష్టి ప్రారంభంలో ఆయనకు ఒకటి నుండి అనేకము అయే కోరిక కలిగినప్పుడు, ఆయన ఈకోరిక శక్తిగా తయారైనది.ఈ శక్తి సహాయంతోనే మొత్తం సృష్టి తయారై నిలబడినది. సృష్టిని తయారుచేసే ప్రారంభికశక్తి అయిన కారణముగా గాయత్రీనీ "ఆదిశక్తి " అనిఅన్నారు. బ్రహ్మకు సృష్టినిర్మాణ, విస్తరణల కొరకు అవసరమైన జ్ఞానము, క్రియాకౌశలము ఆదిశక్తి గాయత్రి యొక్క తపోసాధన ద్వారానే లభించినది. ఇదే జ్ఞాన -విజ్ఞానము, వేదము అనబడినది. ఈ రూపంలో ఆదిశక్తి పేరు "వేదమాత" అయినది. వేదముల సారము గాయత్రీ మంత్రములో బీజ రూపంలో నిండి ఉన్నది. సృష్టి యొక్క వ్యవస్థను రక్షించే, నడిపించే విభిన్న దైవశక్తులు ఆదిశక్తి యొక్క ధారలే. ఆదిశక్తి నిర్మాణం, పర్యవేక్షణ, పరివర్తనము మొదలైన క్రియలకు అనుగుణముగా బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల వంటి దైవశక్తులరూపంలో విడివిడిగా ప్రకటితమౌతుంది. ఇదేవిధముగా ఇతర దైవశక్తులు దీనియొక్క వివిధ ధారలు ఈశక్తి నుంచే పోషణ పొందుతాయి . ఈ రూపములో శక్తిని " దేవమాత " అనే పేరుతో పిలుస్తారు. విశ్వఉత్పతి మొత్తం ఆదిశక్తి గర్బములో జరిగినది . కనుక "విశ్వమాత" అనే పేరుతో కూడా పిలుస్తారు.
గాయత్రీ పరాశక్తి. మహాకాశ, చిత్తాకాశ, చిదాకాశ స్వరూపమే గాయత్రీస్వరూపం. గాయత్రిమంత్రం సర్వతత్త్వసంపూర్ణం. పరబ్రహ్మ మౌలికం. గాయత్రీ పరమేశ్వర స్వరూపం. పరమేశ్వరత్వమే భగత్వం. భగం కలిగినవాడే భగవంతుడు. భగమనగా బలం, తేజం, శక్తి, ఆరోగ్యం, ఐశ్వర్యములని అర్ధం. ఈ దైవీశక్తులే గాయత్రీశక్తులు. శక్తిమంతుడే పరమేశ్వరుడు, శక్తి ఉత్పాదనమే గాయత్రీయోగం.
గాయత్రి మూడు గుణములతో కూడిన శక్తి . హ్రీం - సద్బుద్ధి, శ్రీం - సమృద్ధి, క్లీం - శక్తి ప్రధానములు. దీనికి మూడు విశేష ధారలు కలవు. వీటిని గంగ, యమునా, సరస్వతిల త్రివేణీ సంగమం అని కుడా అనవచ్చును. దైవశక్తులతో జోడించినపుడు వీటిని సరస్వతి ,లక్ష్మి ,కాళి మరియు బ్రహ్మ ,విష్ణు, మహేశ్వర రూపంలో తెలుసుకొనగలము. గాయత్రి సాధనతో సాధకుని మనస్సు, బుద్ధి మరియు భావనలు ఈ త్రివేణిలో స్నానం చేసే అవకాశం లభించినపుడు, స్థితి కాయకల్పం వలె తయారవుతుంది. సద్గుణములు వృద్ధి, అంతర్గత శాంతి , సంతోషంతో పాటు సార్వజనిక సమృద్ధి సఫలతలను ఇచ్చేది గాయత్రి.
ప్రాపంచిక కష్టాల నదిని దాటుటకు ధైర్యము, సాహసము, ప్రతిభ, ప్రయత్నం అనే నాలుగు కోణములుగల నావ అవసరము. గాయత్రీ సాధన ఈ నాలుగు ప్రత్యేకతలను మనిషిలో బాగా పెంపొందిస్తుంది.
జీవాత్మ ,పరమాత్మ మధ్య సూక్ష్మ ప్రకృతి యొక్క మాయా పరద ఉన్నది . ఈ పరదాను దాటుటకు ప్రకృతిసాదనములతోనే ప్రయత్నించాలి. చింతన - మననం, ధ్యానం - ప్రార్ధన, వ్రతము - అనుష్టానము, సాధన వంటి అన్ని ఆద్యాత్మిక ఉపచారములు ఇందు నిమితమై ఉన్నాయి. వీటన్నిటిని వదిలి పరమాత్మను పొందుట ఏ విధముగాను వీలుకాదు. సత్యగుణం, చిత్ శక్తి ద్వారా మాత్రమే జీవాత్మ ,పరమాత్మల యొక్క కలయిక జరుగగలుగుతుంది. ఈ ఆత్మ పరమాత్మల కలయికను జరుపగలిగే శక్తియే గాయత్రి.
గాయత్రి బ్రహ్మప్రతిపాదకమగు మంత్రము. కుండలినీ శక్తి 24 తత్వంలతో జగత్తును సృజించును కావున గాయత్రి 24 అక్షరములు కలిగి యున్నదని శంకరులు ప్రపంచసారమున వ్రాసిరి.
ఈ శరీరం పంచభూతాత్మకం. ఇందలి జీవాత్మ చిదానందస్వరూపముగా పంచప్రాణస్వరూపముగా విహరించుచున్నది. తన్మాత్ర స్వభావంవలన ప్రలోభితమైన గుణసంపత్తును దైవీసంపత్తుగా మలచుకొని ఆధ్యాత్మికధారణ చేయవలెను. యోగసిద్ధివలన ఇది సాధ్యం. యోగసిద్ధి మంత్రసిద్ధివలన వచ్చును.
* గాయత్రీ మంత్రం *
గాయత్రీమంత్రములో తొమ్మిది నామములు కలవు. ౧. ఓం ౨. భూ ౩. భువః ౪.సువః ౫.తత్ ౬. సవితు: ౭. వరేణ్యం ౮. భర్గః ౯.దేవస్య ఈ తొమ్మిదినామములద్వార భగవంతుడు కీర్తింపబడుతున్నాడు. ధీమహీ అంటే ఉపాసన అని అర్ధం. ధియోయోనః ప్రచోదయాత్ అంటే భగవంతున్ని ప్రార్ధించుట.
ఈ మంత్రమును ఐదుచోట్ల ఆపి జపించవలెను. ౧. ఓం ౨. భూర్భువ స్సువః ౩. తత్స వితుర్వరేణ్యం ౪. భర్గోదేవస్య ధీమహీ ౫. ధియోయోనః ప్రచోదయాత్.
"ఓం భూర్భువ స్సువః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యోనః ప్రచోదయాత్"
అర్ధం : 'ఓం' కారంను ప్రణవమని అందురు. ప్రణవమునుండియే సమస్త శబ్దములు, మంత్రములు ఏర్పడుటచేత ఓంకారం సర్వమంత్రములకు హేతువు. ఓంకారముచే వ్యాహృతులు, వ్యాహృతులచే వేదములు ఆవిర్భవించినవి. (ఓంకారం వివరణ ఈ బ్లాగ్ మొదటి పోస్ట్ యందు కలదు) ఓం = ప్రణవాత్మకమైన పరమాత్మ(పరమేశ్వరుడు), భూ = ప్రాణము నకు ప్రాణము(సత్ స్వరూపుడు), భువః = సర్వదుఃఖములను పోగొట్టి(చిత్ స్వరూపుడు), సువః = సమస్తసుఖములను యిచ్చునట్టి(ఆనందస్వరూపుడు)పరమాత్మ, నః = మా యొక్క, ధియ = బుద్ధులను, ప్రచోదయాత్ = ప్రేరణ చేయునో, తత్ = ఆ, సవితు: = సర్వజగత్తులను సృష్టిచేయు, దేవస్య = దివ్యమహిమగల ఆ పరమాత్మయొక్క, వరేణ్యం =మిక్కిలి శ్రేష్టమై కోరదగిన, భర్గః = సర్వదుఃఖనాశకరమగు శుద్ధస్వరూపమును, ధీమహి = ధారణచేయుదునుగాక.
* గాయత్రీ గుణముల విశిష్టత *
ఈ మంత్రము యొక్క ఇరువదినాలుగు అక్షరములు ఇరువదినాలుగు గుణములను కలిగియున్నది.
'త' - అజ్ఞానాంధకారమును పోగొట్టును, 'త్స' - ఉపపాతకములను పోగొట్టును, 'వి' - మహాపాతకములను, 'తు' - దుష్టగ్రహ దోషములను, 'ర్వ' - భ్రూణహత్యాదోషములను, 'రే' - అగమ్యాగమనదోషములను, 'ణి' - అభక్ష్యాభక్షణ దోషములను,
'యం' - బ్రహ్మహత్యాపాతకములను, 'భ' పురుషహత్యాపాతకములను, 'ర్గో' గోహత్యదోషములను, 'దే' స్త్రీహత్యాదోషములను,
'వ' - గురుహత్యాదోషములను, 'స్య' - మానసికపాపములను, 'ధీ' - పితృ మాతృవధ పాపములను, 'మ' - పూర్వజన్మార్జిత పాపములను, 'హి' - అశేష పాపసమూహములను, 'ధీ' - ప్రాణివధపాపములను, 'యో' - ప్రతిగ్రహపాపములను, 'యో' - సర్వపాపములను పోగొట్టగా,
'నః' - ఈశ్వరప్రాప్తియు, 'ప్ర' - విష్ణులోకప్రాప్తియు, 'చో' - రుద్రపదప్రాప్తియు, 'ద' - బ్రహ్మపదప్రాప్తియు, 'యాత్' - త్రిమూర్తుల ప్రసాదసిద్ధిని కలగజేయును.
భూ:, భువః, సువః, అనే మూడు వ్యాహృతులు బ్రహ్మతత్వ స్వరూపలక్షణమైన సత్, చిత్, ఆనందాలు. భూ: అంటే సత్తు, భువః అంటే చిత్తు, సువః అంటే ఆనందము. ఈ మూడు కలిసిందే ఓం. ఇదే పరబ్రహ్మ. తత్ సవితు: అదే సవిత. సూయతే అనే నేతిసవితా - ఈ జగత్తు సృష్టి స్థితి లయలకు కారణమైంది సవిత (గాయత్రి).
* గాయత్రీ మంత్రోచ్చారణ ప్రభావం *
ఈ మంత్రోచ్చారణ సమయమందు శరీరములోని సర్వ నాడీస్థానములలో స్పందనాశక్తి చేకూరును. షట్ చక్రములలో స్పందన ఏర్పడి తద్వారా చక్రములు జాగృతమౌను. ఈ బీజాక్షర స్పందనాశక్తివలన శరీరావయములలో ఉన్న గ్రంధులలో శక్తులను మేల్కొలిపి మహత్వపూర్ణమగు సఫలతను, సంపన్నతను, సిద్ధులను చేకూర్చును. గాయత్రి మంత్రంలోని బీజాక్షరములు శరీరములోని ఈ దిగువ వివరించినస్థానములయందు స్పందనను చేకూర్చి పూర్ణయోగత్వమును సిద్ధింపజేస్తుంది.

సూర్యున్ని ఆరాధించిన ఆరోగ్యం, కుశలం, పుత్రులు పుణ్యం; మహాదేవున్ని ఆరాధించుట వలన యోగం, జ్ఞానం, కీర్తి; విష్ణువును ఆరాధించిన ధర్మార్ధ కామమోక్షములు; దుర్గోపాసనచే సర్వ మోక్షాది సకలకోరికలు; గణేశున్ని ఉపాసించిన కర్మసిద్ధి, విఘ్ననివారణ ప్రాప్తించును. అయితే గాయత్రీ మంత్రానుష్టానమువలన పంచాయతన దేవతలు చేకూర్చు సర్వఫలములు సమిష్టిగా చేకూరును. ఈ మంత్రం పఠనం చేయువారికి చతుర్విధపురుషార్ధములు, ధర్మార్ధకామమోక్షములను ప్రాప్తించును. సమస్తకోరికలను తీర్చు కామ్యఫలప్రదాత్రి 'గాయత్రీ'. గాయత్రి కామధేనువు. ఆత్మశక్తిని, మానసికశక్తిని, సంసారికశక్తిని లభింపజేయును. ప్రణవం (ఓం), భూ:, భువః, సువః, గాయత్రిమంత్రం అనునవి పంచమహాయజ్ఞములు (దేవయజ్ఞం, ఋషియజ్ఞం లేక బ్రహ్మయజ్ఞం, పితృయజ్ఞం, భూతయజ్ఞం, మనుష్యయజ్ఞములు). ప్రణవ వ్యాహృతిత్రయ గాయత్రీమంత్రమును నిత్యమును జపించినయెడల పంచపాపములనుండి పావనమై పంచయజ్ఞముల ఫలితంను పొందుదురు
గాయత్రి అంటే…
ఈ సందేహమే ఒకసారి వశిష్ఠ మహర్షికి వచ్చింది. వెంటనే విధాత వద్దకు వెళ్ళి గాయత్రీ తత్త్వాన్ని తెలుపని వేడుకోగా, ‘నా, స్ఫురణ మాత్రంగా ఏ చైతన్యశక్తి ఉత్పన్నమయిందో, దానినే జ్ఞానము లేక వేదముగా చెప్పుకోవచ్చు. దీనినే గాయత్రి నామంతో వ్యవహరిస్తారు. నా నుండి అగ్ని. అగ్ని నుం…డి వాయువు, వాయువు నుండి ఓంకారం, ఓంకారంతో హృతి, హ్రుతితో వ్యాహృతి, వ్యాహృతితో గాయత్రి, గాయత్రితో సావిత్రి, సావిత్రితో వేదాలు, వేదాలలో సమస్త క్రియలు ప్రవర్తిమవుతుదిన్నాయి’ అని బ్రహ్మ తెలియజేశాడు.
గాయత్రి మంత్రంలో నిక్షిప్తమై ఉన్న 24 దేవతా శక్తులు.
గాయత్రీ మంత్రంలోని 24 దేవతలు, వారి చైతన్య శక్తులు:
01. వినాయకుడు: సఫలత్వ శక్తికి అధిపతి.విఘ్ననాయకుడైన వినాయకుడు బుద్ధినీ, జ్ఞానాన్నీ ప్రసాదిస్తాడు.
02. నృసింహ స్వామి: పరాక్రమ శక్తికి అధిపతి, పురుషార్థ, పరాక్రమ, వీరత్వ విజయాలను ప్రసాదించేది ఈయనే.
03. విష్ణుమూర్తి: పాలనాశక్తికి అధిష్ఠాత అయిన విష్ణు సర్వజీవ రక్షకుడు.
04. ఈశ్వరుడు: సకల జీవులకూ ఆత్మ పరాయణత్వాన్ని సర్వవిధ కల్యాణ శక్తులనూ ప్రసాదించే దయామయుడు.
05. శ్రీకృష్ణుడు: యోగ శక్తికి అధిష్ఠాత అయిన కృష్ణ భగవానుడు ప్రాణులకు కర్మయోగ ఆత్మనిష్ఠలను, వైరాగ్య, జ్ఞాన, సౌందర్యాదులును ప్రసాదిస్తాడు.
06. రాధాదేవి: ఈమె ప్రేమ శక్తికి అధిష్ఠాత్రి, భక్తులకు నిజమైన ప్రేమ భావాన్ని కలుగజేసి అసూయద్వేష భావాలకు దూరం చేస్తుంది.
07. లక్ష్మీదేవి: ధన వైభవ శక్తులకు అధినేత్రి. సకల లోకానికీ ఐశ్వర్యం, సంపద, పదవి, వైభవం, ధనం, యశస్సులను పుష్కలంగా అందిస్తుంది.
08. అగ్నిదేవుడు: తేజోశక్తికి అధినేత అయిన ఈయన ప్రకాశం, శక్తి, తేజస్సు శక్తి సామార్ధ్యాలను ప్రాసాదిస్తాడు.
09. మహేంద్రుడు: రక్షాశక్తికి అధిష్ఠాత, అనారోగ్యాలు, శతృభయాలు, భూత ప్రేతాదులు నుండి రక్షిస్తాడు.
10. సరస్వతి: విద్యా ప్రదాత. జ్ఞానాన్ని, వివేకాన్ని, బుద్ధిని ప్రసాదిస్తుంది.
11. దుర్గాదేవి: దమన శక్తికి అధిష్ఠాత్రి. అన్ని బాధలనూ తొలగించి, శత్రువుల బారి నుండి కాపాడుతూ సకల ఐశ్వర్యాలను ప్రసాదిస్తుంది.
12. ఆంజనేయుడు: నిష్ఠాశక్తికి ఉపకారి హనుమంతుడు. తన భక్తులకు భక్తి, నిష్ఠ, కర్తవ్య పరాయణ తత్వం, బ్రహ్మచర్య పాల నాశక్తి ప్రసాదిస్తాడు.
13. భూదేవి: ధారణాశక్తికి అధినేత్రి. సకల ప్రాణకోటికి క్షమాశీలత్వాన్ని, ధైర్యాన్ని, దృఢత్వాన్ని, నిరంతరత్వాన్ని ప్రసాదిస్తుంది.
14. సూర్య భగవానుడు: ప్రాణశక్తికి అధిపతి. ఆరోగ్యాన్ని,సుదీర్ఘ జీవనాన్ని, ప్రాణశక్తికి, వికాసాన్ని, తేజస్సును ప్రసాదిస్తాడు.
15. శ్రీరాముడు: ధర్మం, శీలం, సౌమ్యత, మైత్రి, ధీరత్వం లాంటి గుణాలకు ప్రతీక. మర్యాదాశక్తికి అధిష్ఠాత ఈయన.
16. సీతాదేవి: తపశ్శక్తి అధిష్ఠాత్రి. అనన్య భావాలతో భక్తులను తపోనిష్ఠులుగా తయారుచేసి, అధ్యాత్మికోన్నత మార్గానికి ప్రేరేపించేదీమె.
17. చంద్రుడు: శాంతి శక్తికి అధిష్ఠాత. చింత శోకం, క్రోధం, మోహం, లోభం వంటి మానసిక వికారాలను అణిచివేసి శాంతిని ప్రసాదిస్తాడు.
18. యముడు: కాలశక్త్యాదిస్థాత. మృత్యువునకు భయపడకుండా సకల జనులను సమాయత్తం చేసేవాడు.
19. బ్రహ్మ: సకల సృష్టికి అధిష్ఠాత.
20. వరుణుడు: భావుకత్వాన్ని, కోమలత్వాన్ని, దయాళుత్వాన్ని, ప్రసన్నతను, ఆనందాన్ని అందిస్తాడు.
21. నారాయణుడు: ఆదర్శ శక్తికి అధిష్ఠాత. నిర్మలత్వాన్ని ప్రసాదిస్తాడు.
22. హయగ్రీవుడు: సాహన శక్తికి అధిష్ఠాత. ఉత్సాహాన్ని, సాహసాన్ని ప్రసాదిస్తాడు.
23. హంస: వివేక శక్తికి అధిష్ఠాత్రి. హంస క్షీరనీరవివేక జగత్ ప్రసిద్ధమైంది.
24. తులసీ మాత: సేవాశక్తికి అధిష్ఠాత్రి. ఆత్మశాంతి, దుఃఖ నివారణ వంటి ఫలాలను ప్రసాదిస్తుంది.
శ్రీ గాయత్రీ మాత మహాత్యం
వాల్మీకి రామాయణానికి మూలాధారం గాయత్రీ మంత్రమే. గాయత్రీ మహామంత్రానికి వ్యాఖ్యాన రూపంలో ఈ మహాకావ్య రచన జరిగిందని అంటారు.
ఓమ్ భూర్భువ స్వః ఓమ్తత త్సవితుర్వరేణ్యమ్
భర్గో దేవస్య ధీమహి ధియో యోనః ప్రచోదయాత్
ఇదే గాయత్రీ మూల మంత్రం. గాయత్రిని మించిన మంత్రం లేదు. తల్లిని మించిన దైవం లేదు.
త్రికాలలలోనూ గాయత్రీ మంత్రాన్ని అనుష్ఠించటం వల్ల ఎంతో మేలు జరుగుతుంది. ఆరోగ్యం, సంకల్ప బలం, ఏ కాగ్రత, ఇంద్రియాలపై అదుపు సాధించటానికి ఈ మంత్రం ఉపయోగపడుతుందని మన ప్రాచీన రుషులు చెబుతున్నారు. అటువంటి గాయత్రి మంత్రాన్ని మించిన మంత్రం, గాయత్రీదేవిని మించిన దైవం మరెవరూ లేరన్నది అక్షర సత్యం. హిందూ ధర్మ శాస్త్రాల్లో ఆత్మశక్తిని ప్రసాదించే మంత్రాలు ఎన్నో ఉన్నప్పటికీ, వాటన్నింటిలో గాయత్రీ మంత్రం సర్వ శ్రేష్ఠమైనది. నాలుగు వేదాలలో గాయత్రిలో సమానమైన మంత్రం ఏదీ లేదని విశ్వామిత్రుడు చెబుతాడు. ప్రతి నిత్యం నియమ నిష్ఠలతో గాయత్రిని ధ్యానించలేని, ఉపాసించలేని వారు గాయత్రీ మంత్రాన్ని త్రికాలలోనూ పదిసార్లు చొప్పున జపిస్తే చాల మంచిది. ఏ పనిలో ఉన్నప్పటికీ చేస్తున్న పనిని కాసేపు ఆపి, కాళ్ళకు ఉండే పాదరక్షలను వదిలిపెట్టి ఈ మంత్ర జపం చేయువచ్చు. గాయత్రీ మంత్రాన్ని జపం చేస్తే మనసుకు ప్రశాంతత చేకూరుతుంది. గాయత్రీ మంత్రంతో పాటుగా ప్రతి ఒక్కరూ ‘ఓం నమో గాయత్రీ మాత్రే’ అని ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు జపిస్తే తప్పక సత్ఫలితాలను పొందుతారు. శ్రీ గాయత్రీ మాత అనుగ్రహం తప్పక లభిస్తుంది.
బ్రాహ్మీ ముహూర్తకాలంలో ప్రకృతిలో చేతనాశక్తి పరుచుకుంటున్నవేళ, నిర్మల నదీ తరంగాలు వేదనాదంలా తరంగించే వేళ అపూర్వ తేజోవిరాజితుడైన మునిసత్తుముని కంఠంలో నుండి వెలువడిన సుస్వర మంత్రర్పరి, సృష్టి ఉత్పత్తి, వర్తన, పోషణాలను నిర్దేశించిన అద్భుత చంధో తరంగం గాయత్రీ మంత్రం. ఆ రుషి సత్తముడు మరెవరో కాదు. సృష్టికి ప్రతిసృష్టి చేసిన అపూర్వ తపోబల సంపన్నుడు విశ్వామిత్ర మహర్షి. ఆ మహారుషి తపశ్శక్తిలోంచి వెలువడిన మంత్రమే ఇది.
* గాయత్రి మంత్రాక్షరాలు
సహస్ర పరమాం దేవీం శతమధ్యాం దళవరాం
సహస్ర నేత్రాల గాయత్రీం శరణ మహం ప్రపద్యే
‘న గాయత్ర్యా నరం మంత్రం న మాతుః పర దైవతమ్’
గాయత్రీ మంత్రం అన్ని మంత్రాలలోకెల్లా శ్రేష్ఠమైనది. తల్లిని మించిన దైవం, గాయత్రిని మించిన దైవం లేదు. ‘గయాన్ త్రాయతే ఇతి గాయత్రీ.’ శంకరుని భాష్యం ప్రకారం ప్రాణాన్ని రక్షించేది గాయత్రి. అంటే ఒక స్వతంత్రమైన దేవి, దేవత కాదు. పరబ్రహ్మ పరమాత్మల క్రియాభాగం గాయత్రి. బ్రహ్మయే గాయత్రి. గాయత్రే బ్రహ్మమని శతపథ బ్రాహ్మణం చెబుతోంది. పరమశివుడు బ్రహ్మానందంలో తన డమరుకం చేసిన 24 ధ్వనులే శ్రీ గాయత్రీ మంత్రంలోని 24 అక్షరాలు. ఈ 24 అక్షరాలే 24 దైవిక శక్తులకు ప్రతీకలు. వీటికి 24 పేర్లు ఉన్నాయి. వీటిలో 12 వైదిక మార్గాలు కాగా, 12 తాంత్రిక మార్గాలు. ఈ 24 అక్షరాలు నివాసం ఉంటే 24 దైవశక్తులు ఆయా పేర్లతో పూజింపబడతాయి. గాయత్రి మంత్రాన్ని అనన్య భక్తితో పఠించేవారిని ఆ 24 శక్తులు సర్వవేళలా కాపాడుతాయి.
*************************************************************************************************************
గాయత్రి జపము వలన కలుగు ప్రయోజనాలు
గాయత్రీ మంత్రం చాలా గొప్పది. దాని ప్రభావం అనంతం. పూర్వం ఆ మంత్రాన్ని జపిస్తూ కొన్ని హోమాలు చేసి రోగాల్ని పోగొట్టుకున్నారని దేవీ భాగవతం వివరిస్తోంది. ఈ మంత్ర, జప, హోమ విధానాల్ని బాగా తెలుసుకొని చేయాల్సి ఉంటుంది. మంత్రం ఇంత శక్తిమంతమైనది కనుకనే ఈనాటికీ చాలా చోట్ల దీని మహత్వం ప్రచారంలో వినిపిస్తోంది. విశ్వామిత్రుడు గాయత్రీ మంత్రం వల్ల చేకూరే ప్రయోజనాల్ని దేవీ భాగవతం పదకొండో స్కంధంలో వివరించి చెప్పాడు.
రావిచెట్టు కింద శనివారం కూర్చొని నూరుసార్లు గాయత్రీ మంత్రాన్ని జపిస్తే భూత రోగ అభిచారాల నుంచి విముక్తి లభిస్తుంది. తిప్పతీగ ముక్కలు పాలలో నానపెట్టి గాయత్రీ మంత్రాన్ని జపిస్తూ ఆహుతి ఇస్తే అది మృత్యుంజయహోమం అవుతుంది. ఇలా చేయటం వల్ల సర్వరోగ నివారణ కలుగుతుంది. జ్వరం శాంతించటం కోసం గాయత్రీ మంత్రాన్ని జపిస్తూ మామిడాకులు, పాలను కలిపి ఆహుతి ఇవ్వాలి. పాలలో వసను నానపెట్టి అగ్నిలో వ్రేల్చితే (హోమం చేస్తే) క్షయరోగం తగ్గుతుంది.
పాలు, పెరుగు, నెయ్యి ఈ మూడింటినీ కలిపి గాయత్రీ మంత్రంతో హోమం చేస్తే రాజయక్ష్మ రోగం శాంతిస్తుంది. క్షీరాన్నాన్ని గాయత్రీ మంత్రాన్ని జపిస్తూ ఆహుతి ఇచ్చి, సూర్యుడికి నివేదించి దాన్ని రాజయక్ష్మ రోగికి తినిపిస్తే బాధ తగ్గుతుంది. సోమలతను కణుపుల వరకూ తుంచి ఆ ముక్కలను అమావాస్య నాడు పాలతో కలిపి ఆహుతి ఇస్తే క్షయవ్యాధి నివారణ అవుతుంది. శంఖవృక్షపు పూలను గాయత్రీ మంత్రాన్ని జపిస్తూ వ్రేల్చితే కుష్టురోగం తొలగుతుంది. పాలచెట్టు సమిధలతో హోమం చేస్తే ఉన్మాదం తగ్గుతుంది. మేడిచెట్టు సమిధలను గాయత్రీ మంత్రం జపిస్తూ హోమం చేస్తే మేహ రోగాలు నశిస్తాయి. చెరకురసం, తేనె కలిపి హోమం చేసినా మేహ సంబంధ రోగాలు శాంతిస్తాయి. పాలు, పెరుగు, నెయ్యి కలిపి ఆహుతి ఇస్తే మసూచి రోగం మటుమాయమవుతుంది.
కపిలగోవు నెయ్యిని వ్రేల్చినా మసూచి తొలగిపోతుంది. మేడి, మర్రి, రావి సమిధలను వ్రేల్చితే ఆవులు, గుర్రాలు, ఏనుగులకు సంబంధించిన రోగాలు దూరమవుతాయి. జమ్మి సమిధలను పాలు, నెయ్యితో కలిపి రెండేసి వందల సార్లు గాయత్రీ మంత్రంతో హవనం చేస్తే చీమలు తదితరాల వల్ల కలిగే కష్టనష్టాలు తొలగిపోతాయి. దీనివల్ల ఇంట్లో శాంతి నెలకొంటుంది. ఈ హోమం తర్వాత అన్నాన్ని బలిగా వేయాలి. మట్టిపెడ్డను నూరుసార్లు గాయత్రితో అభిమంత్రించి ఏ దిశకు విసిరితే ఆ దిశ నుంచి కలిగే అగ్నిభయం, గాలిభయం, దొంగలభయం నశిస్తాయి. దర్భను తాకి గాయత్రిని జపిస్తే భూతరోగాల నుంచి విముక్తి లభిస్తుంది. గాయత్రీ మంత్ర జలాన్ని తాగినా ఇదే ఫలితం కలుగుతుంది. భూత శాంతికి నూరుసార్లు గాయత్రీ మంత్రంతో భస్మాన్ని అభిమంత్రించి ఆ తర్వాత దాన్ని నొసటన ధరించాలి. అలాంటి వారికి భూతశాంతితో పాటు వ్యాధుల నుంచి విముక్తి కలుగుతుంది.
గాయత్రీ మంత్రంతో చక్కగా విచ్చిన పూలను తెచ్చి అగ్నిలో హోమం చేస్తే పుష్టి, కలివి కలుగుతాయి. ఎర్ర కమలాలను గాయత్రీ మంత్రంతో వ్రేల్చితే ధనప్రాప్తి కలుగుతుంది. అన్నాన్ని హోమం చేసినా సంపదలు కలుగుతాయి. మారేడు సమిధలను కానీ, ఫలపుష్పాలను కానీ, మారేడు వేళ్లను కానీ హోమం చేసిన వారింట సిరి సంపదలు తులతూగుతుంటాయి. మారేడు సమిధలు పాలలో, నేతిలో తడిపి రోజుకు రెండు వందల సార్లు చొప్పున వారం రోజుల పాటు హోమం చేస్తే తరగని సిరిసంపదలు, సుఖశాంతులు కలుగుతాయి. పాలు, పెరుగు, నెయ్యి, పేలాలు కలిపి గాయత్రీ మంత్ర హోమం చేసిన వరుడికి మంచి వధువు లభిస్తుందని దేవీ భాగవతంలో గాయత్రీ మంత్ర జప హోమాల విశేషాల వివరణ కనిపిస్తుంది. ఈ జపం ఎలా ఎన్నిసార్లు ఏయే నియమ నిష్టలతో చేయాలనే విషయాన్ని పండితుల నుంచి తెలుసుకొని అలా చేయటం ఉత్తమం.