వెండితెర మరోసారి చిన్నబోయింది.. తన కీర్తిని ఖండాంతరాలకు తీసుకుపోయిన స్రష్ట ఇక సెలవంటూ తిరిగిరాని లోకాలకు తరలివెళ్లిపోగా
తెలుగు కళామతల్లి మౌనంగా రోదిస్తోంది. అసలు సినిమా అంటే కుప్పిగంతులు., వెర్రి కేకలు.. చెవులు అదిరిపోయే మాటలు..
అర్థం కాని పంచులు..ఇవి కావంటూ..సినిమా అంటే కళ.. నృత్యసంగీత సంప్రదాయాల మేళవింపు.. ఇవన్నీ రంగరించి కలయపోస్తేనే సినిమా అని
ప్రతి ఒక్క సినిమాలో ఒక అర్థం.. ప్రతి కథలో పరమార్థం.. ప్రతి సన్నివేశంలో ఒక అందం.. ప్రతి పాటల్లో మకరందం..ఆ మాటల్లో భావుకత..
పాత్రధారుల్లో పరిపూర్ణత.. అభినయంలో పరిపక్వత.. మొత్తంగా అందమైన కాన్వాస్.. కళాతపస్వి శ్రీ విశ్వనాధుని సినిమా..!
మా ఇంట్లో మా నాన్నగారు కి విశ్వనాద్ గారు సినిమా ఉంటె చాలు ఎన్ని సార్లు చూసే వారో.. అప్పట్లో క్యాసెట్ , మా చిన్నతనం లో మా నాన్నగారు శంకరాభరణం , సాగర సంగమం , మొ. సినిమాలు ఎన్ని సార్లు చూసే వారో లెక్క లేదు..
తెలుగు సినిమాకి కొత్త నడకను నేర్పిన..నాట్యాన్ని మప్పిన.. అర్థం కాని పరుగులను కాక అందమైన గమనాన్ని చూపిన దార్శనికుడు కాశీనాథుని విశ్వనాథ్!
పాటల్లో శృతి.. ఆటల్లో లయ.. మాటల్లో భావం.. కథలో సందేశం.. సన్నివేశంలో పట్టు.. అదంతా ఆ విశ్వనాధుని కనికట్టు..!
విశ్వనాథ్ గారు మూగమనసులు డాక్టర్ చక్రవర్తి వంటి సాంఘిక చిత్రరాజాలకు ఆదుర్తి సుబ్బారావు
వద్ద పని చేసి సినిమాని పండించడంలో మెళకువలు ఔపోసన పట్టి ఆత్మగౌరవం తో దర్శకుడిగా
చేబట్టి నేను సైతం అంటూ దర్శక ప్రస్థానానికి శ్రీకారం చుట్టాడు.మొదట్లో గురువు ఆదుర్తి బాటలోనే ప్రయాణం సాగించారు
తన పేరుకు ముందు కళాతపస్వి అనే కీర్తి రావలసి ఉండగా ఆగుతాడా..ఆ దిశగా పడింది మొదటి అడుగు సిరిసిరిమువ్వ
తో.. వేస్తూ ఝుమ్మంది నాదం.. సై అంది పాదం..అని తన ప్రతిభతో నటరాజు శత సహస్ర రవితేజుడై.. నటగాయక వైతాళిక మునిజన భోజుడై..
అతడు సరికొత్త అవతారం దాల్చగా వెండితెర మురిసింది.. తనువూగి ఆ వేళ.. చెలరేగి ఒక రాసలీల..!
అప్పట్లో కమర్షియల్ సినిమాలు విజృంభించి వీరవిహారం చేస్తున్న వేళ..మహానటులు సైతం అదే మూసలో పడి
తమ స్థాయికి తగ్గ అభినయాలు మరచిన సమయాన..విశ్వనాథుడు సెల్యులాయిడ్ పై చేసిన అతి గొప్ప ప్రయోగం శంకరాభరణం! . అది శంకరునికి ఒక ఆభరణం
అనుకుని ఆ విశ్వనాథుడు సమర్పించ హరమ్
ఒక పాత్రను సృష్టించి.. దాని చుట్టూ అద్భుతమైన కథను ఆవిష్కరించి.. అపూర్వమైన పాటలను సంధించి...మునుపెన్నడూ చూడని డ్రామాను జోడించి..
నాటి సినిమాలకు సరిపడని క్లైమాక్సును రంగరించి.. అద్భుతమైన పాత్రలను పొదిగి..ఇన్నీ సిద్ధం చేసుకుని నాయకుడెవరు అనే దగ్గర మీమాంస..నిజానికి కథే నాయకుడై..పెద్ద నాయకుడు అవసరం లేని సినిమా కోసం వెతికి పట్టుకున్న ఆణిముత్యం మన జేవీ సోమయాజులు గారు ..ఆ పాత్ర ఆయన కోసం పుట్టిందా..
ఆయనే ఆ పాత్ర కోసం పుట్టాడా..అన్నంతగా మమేకమైపోయిన చేసారు శాస్త్రి గారు ఆయనకి. శంకరాభరణం శంకరశాస్త్రి..! అనే నామధేయం శాశ్వతం గా ఇచ్చేసారు
తెలుగు సినిమా చరిత్రలో ఒక వేణువు..నిఘంటువు.. విశ్వనాథుడు అయ్యాడు దర్శక మేరువు.. కళాత్మకతకు గురువు..!
ఇలా చెప్పుకుంటూ వెళితే. ఎక్కడ మొదలు పెట్టాలో , ఎక్కడ పూర్తి చెయ్యాలో తెలియని పరిస్థితి.
ఇక మొదలైంది విశ్వనాథ జైత్రయాత్ర.. కళాత్మక సినిమాల విజయయాత్ర ..సినిమా అంటే మసాలా దట్టింపు మాత్రమే కాదు సంగీతనాట్యాల అద్భుత మేళవింపు అని మామూలు జనాలకు.. సినిమా జనాలకు కూడా బోధపడేలా చేసిన విశ్వనాథుడు తానయ్యాడు కళాతపస్వి.. చిరయశస్వి..!
ఇప్పటికీ మేము మా పిల్లలు ఆ సినిమా పాటలు ఆ సినిమాలే చూస్తున్నాము
ఇక ఆగలేదు ఆ గమనం.. అద్భుత కళాఖండాల ఆగమనం.. హృదయంగమం అదే సాగరసంగమం..
ఆణిముత్యం స్వాతిముత్యం.. పాటల హొయలు శృతిలయలు శ్రమజీవి నాయకుడై.. స్వయంకృషి.. తానూ నటుడై.. కమల్ అభినయానికి
పట్టం కట్టిన శుభసంకల్పం పాటకు పట్టాభిషేకం స్వరాభిషేకం.. ఇవన్నీ ఒక కోవ.. నిజమైన కళా జగతికి ద్రోవ.. దొరకునా ఇటువంటి సేవ..
కళాతపస్వి మెలకువ.. ఆయనకే చెల్లిన అత్యద్భుత సినీగీతాల కువకువ..!
సంగీతం రాని ఓ మనిషి తానే రుషిగా మారి సృష్టించిన కళాఖండాలు
తెలుగు తెరను సుసంపన్నం చేశాయి..గొప్ప సినిమాలను మనకు అందించి దన్యులను
చేసిన కాశీనాధుని విశ్వనాధునికి ఏమిచ్చి..ఏమని చెప్పి తీర్చుకోగలం రుణం.. నా ప్రాణదీపమై
నిను గొల్చువేళ మహానుభావా.. అంటూ శిరస్సు వంచి ప్రణమిల్లడం తప్ప..!
వెండితెరను స్వర్ణమయం చేసిన కళాతపస్వి.. మహా మనస్వి.. అపార తేజస్వి.. చిరయశస్వి..
ఇక లేరంటే..తిరిగి రారంటే.. గుండెకు గాయం కదా.. అదెప్పటికీ నయం కానిదా..!
ఒక్కసారి కళ్ల ముందు తిరుగుతున్న రీళ్లు.. సినిమాలు కావవి దృశ్యకావ్యాలు.. అపురూపంగా నర్తిస్తున్న
సిరిసిరిమువ్వ.. అద్భుతంగా అభినయిస్తున్న సీతామాలక్ష్మి.. కళ్ళెదుట కూర్చుని పాడుతున్న శంకరశాస్త్రి..
అభినయపరాకాష్ట సాగరసంగమం.. పురోగమన భావాల జలనిధి సప్తపది.. అపూర్వ చిత్రరాజాల
సినీమా రుషి దర్శకత్వ ఖుషి.. స్వయంకృషి..
కాశీనాథుని ఆగమనమే తెలుగు సినిమాకి శుభోదయం.. శుభసంకల్పం..
శుభప్రదం.. పెరిగిన దర్శకుల ఆత్మగౌరవం.. కళాఖండాల ఆవిర్భావానికి
వెలుగురేఖ శుభలేఖ వెండితెరపై అందంగా పరచుకున్న సిరివెన్నెల...
దర్శక దిగ్గజం ప్రతి సినిమా ఒక స్వాతిముత్యం.. మహానటులు చిన్ననాటిస్నేహితులు
ఎందరో మహానుభావులు ఆయన విజయాల్లో సూత్రధారులు.. గొప్ప సినిమా ఆయన జీవనజ్యోతి
మొత్తంగా సినిమా విశ్వనాధుని జీవితనౌక మంచి సినిమా కోసం
ఆర్రులు చాచిన అభిమానులకు ఆయన ఆపద్బాంధవుడు..! చిరంజీవుడు
మనకు ఎన్నో కళాఖండాలను అందించిన అభిమాన దర్శకుడు కళాతపస్వి విశ్వనాథ్ కు
ఆయన సినిమా పేర్లతోనే అక్షరనీరాజనం..
PART 2
మూడు ఫై(ఫీ)ట్లు.. ఆరు పాటలు(పాట్లు) ఉంటేనే సినిమా అనే ఈ రోజుల్లో సంగీతం నాట్యం సాహిత్యం మొ కళాత్మక మైన సినిమాలు ను మనకి అందించిన
మహాదేవుడు , విశ్వనాధుడు కి శిరస్సు వంచి నమస్సుమాంజలి
శిశుర్వేత్తి పశుర్వేత్తి.. మీ చెయ్యే తెలుగు సినిమాకి పరశువేది..
తొంభై మూడేళ్ల కళాతపస్వి మరో సప్తపది పూర్తి చేసి సెంచరీ కొట్టాలని కోరుకుంటున్న తరుణంలో
దిగ్బ్రమ కలిగించే వార్త.. విశ్వనాథుడు ఇక లేరని.. ఆయన సినిమాలు చూస్తూ పెరిగాము..సినిమాలంటే
ఇలా ఉండాలని తెలుసుకున్నాం. సినిమాతో ముడి వేసుకున్న ప్రేమబంధం ఆయనది..
కళాత్మక చిత్రం ఆయనకు శంకరాభరణం.. మనిషి నిలువెత్తు ధనం సంపాదించినప్పటికీ
దొరకని కీర్తి ఆ ధన్యమూర్తిది.. అశ్రునయనాలతో పితృతుల్యునికి అక్షర నివాళి..
కాశీనాథుని వారింట పుట్టిన చిరయశశ్వి జనం నాడి పట్టిన కళాతపస్వి..
సినిమా ఆయన చిరునామా.. కళాఖండాలకు ఈ విశ్వనాధుడే శరణమా..
ఆయన లోగిలే కళాసరస్వతి చరణమా.. శంకరాభరణమా..!
సినిమా బాగుందిరా.. సొమ్ములు రావు..
అలాంటి టాక్ పై అటాక్ చేసి కళాత్మక సినిమాలకు కలెక్షన్ల వర్షం కురిపించిన దర్శకబ్రహ్మ..
ఇది అవార్డు మూవీరా.. పెట్టుబడి వెనక్కి రాదు.. ఇలాంటి మాటలకూ స్వస్తి చెప్పించి నిర్మాతలకు
డబ్బుల మూటలు అప్పజెప్పిన ఆయన సినిమాలే ఏడిద వారి నట్టింట పూర్ణోదయం..
తెలుగుతెరకు శుభోదయం..!
సినిమాని పరిశ్రమగా పూజించి షూటింగుల్లో ఖాకీ దుస్తులు ధరించే శ్రమజీవి..
తెలుగు సినీరంగానికి ఆదుర్తి అందించిన స్వాతిముత్యం..
నిర్మాతల పాలిట ఆపద్భాందవుడు.. స్వయంకృషి తో ఎదిగిన
దర్శక రుషి.. క్లాప్ కొట్టడమే శుభసంకల్పం.. దర్శక వాల్మీకిలా
ఆవిష్కరించె ఓ సీత కథ..!
సంగీత కళాకారుడు కాకపోయినా విశ్వనాధుడు
గొప్ప పాటల విరించి.. ఆయన ప్రతి సినిమా
అద్భుత గీతాల మరీచి.. ఆయన సినిమాల్లో పాటలు
మండుటెండలో సిరివెన్నెల.. స్వరజ్ఞానం లేని కూనిరాగాలకూ
సమకూర్చు శ్రుతిలయలు.. ఆయన తీసిన సినిమాలలో పాటలే
విజయాల సూత్రధారులు..!
కళాతపస్వి బాణి.. కళాత్మక చిత్రాలకు చెల్లెలికాపురం తో
పడిన బోణి.. తెలుగు సినిమాకి విశ్వనాథుడు సింగారించిన
కళాఖండాల నీలవేణి.. తులసి గా మారిన మంజుభార్గవి
అనే పూబోణి శంకరశాస్త్రి కుమార్తె శారద గా
పరిచయమైన రాజ్యలక్ష్మి అనే అలివేణి..
ఆయన ప్రతి సినిమాలో నాయిక కళల పట్టపురాణి..!
అసభ్యతకు తావులేని రసరమ్యత.. స్వాతిముత్యం లో
జలపాతంలో హిమపాతంలా రాధిక స్నానం..
సాగరసంగమం లో జయప్రద అభ్యంగనం...
ఎబ్బెట్టుగా అనిపించని మన్మధబాణం..
అదే కళాతపస్వి వశీకరణం.. అవార్డు చిత్రాల తోరణం..
తెలుగు వాకిళ్ళలో కళాఖండాల పచ్చతోరణం..!
మొత్తానికి విశ్వనాథుని రాక తెలుగు చిత్రరంగానికి ఏరువాక..
సంప్రదాయ సినిమాలకు శుభలేఖ.. పులకించిన
జననీ జన్మభూమి ఇన్నిన్ని గొప్ప అనుభూతులను పంచిన
ఓ కళాతపస్వీ.. నీ వైభోగమును స్తుతిస్తూ ఓ కవిత రాసే భాగ్యం..
దొరకునా ఇటువంటి సేవ.. నీ పద రాజీవముల జేరు
నిర్వాన సోపానమధి రోహణము సేయు త్రోవ..
రాగాలనంతాలు నీ కళారూపాలు.. భవరోగ తిమిరాలు
పోగార్చు దీపాలు.. నా ప్రాణ దీపమై
నాలోని జీవమై నిను గొల్చువేళ మహానుభావా మహానుభావా...!
No comments:
Post a Comment