ఉత్తరాలు - ప్రత్యుత్తరాలు
"ఒకప్పుడు పోస్ట్‌మ్యాన్‌ను చూస్తే బంధువును చూసినట్టే ఉండేది
ఉత్తరం చదువుతుంది మమకారంతో మాట్లాడుతుంది అనుభూతి కలిగేది
ఈ రోజుల్లో వీడియో కాల్స్ మాట్లాడుతున్నా.. ఆ అప్యాయత కనిపించడం లేదు!"
ఈనాటి తరానికి దూరమైన ఉత్తరాలు... ఒకప్పుడు మా తరం వరకు ఇవి అందరికీ పరిచయమైనవే. మా ఇంట్లో నాకు ఉత్తరాలు వ్రాసే అలవాటు బాగా ఉండేది. ఎందుకంటే అప్పట్లో నాన్నగారు అమ్మ భీమవరం లో ఉండేవారు. మేము హైదరాబాద్‌కి వచ్చిన కొత్తల్లో, ఇక్కడ జరిగిన విషయాలు అన్నీ సవివరంగా వ్రాసేవాడిని. ఇంచుమించు మూడు నాలుగు పేజీలు ఉండేవి. నాన్నగారికి నా దగ్గర నుంచి ఉత్తరం వచ్చింది అని అమ్మ చెప్పేది. నాన్నగారు తీరిగ్గా భోజనం చేసి, అమ్మ పనులు ముగించుకున్నాక, ఇద్దరూ కలసి ఆ ఉత్తరాన్ని చదివేవారు. నాన్నగారు ఆలా ఊ కొట్టుతూ వింటూ ఉండేవారు. నా ఉత్తరం చదవడం అయ్యాక, అమ్మ – "ఇదండీ విశేషాలు, చిన్నాడివి వ్రాసినవి" అనేది.
రెండు రోజులకు ఒకసారి నాన్నగారు అడిగేవారు – "చిన్నాడు ఉత్తరం వ్రాశాడా?" అని. కనీసం పోస్ట్‌కార్డు, కవర్, ఇన్లాండ్ లెటర్, పంపే వాడిని. నా దగ్గర ఎప్పుడూ స్టాంపులు స్టాక్‌లో ఉండేవి. కొత్త స్టాంపులు వస్తే కోనేసేవాడిని . పోస్ట్ ఆఫీస్ కి నాకు చాల అవినాభావ సంభందం ఉండేది అప్పట్లో ...
నేను చాలా కాలం మా తాతగారు, తాతనాన్న వ్రాసిన ఉత్తరాలు దాచుకున్నాను. వాళ్ల దస్తూరి (చెరసి, రాత) చాలా శుభ్రంగా, చక్కగా ఉండేది.
అలాగే మా చిన్నతనం లో "మా మావయ్య (ఓరుగంటి వేణు గోపాలకృష్ణ) అప్పట్లో అమెరికా, జర్మనీలో ఉండేవారు. మా మావయ్య కూడా అక్కడి విశేషాలు, అనుభవాలు అన్నీ సమగ్రంగా ఉత్తరాల్లో వ్రాసి పంపేవారు. ఆ ఉత్తరాలు మేము మళ్ళీ మళ్ళీ చదువుతుండేవాళ్లం. మావయ్య ఉత్తరాల్లో అమెరికా విశేషాలు, తాను ఎక్కడెక్కడికైనా వెళ్లారో వివరంగా వ్రాసేవారు. ఆ వివరాలను మేమూ చదివి, మేమూ అక్కడికి వెళ్లినట్టే ఫీలయ్యేవాళ్లం. ఆ విశేషాలు మా స్నేహితులకు కూడా ఉత్సాహంగా చెప్పుకునే వాళ్లం. తర్వాత మావయ్య అక్కడ తీయించిన ఫోటోలు పంపేవారు. ఆ ఫోటోల వెనుక చిన్న కాగితం అతికించి, ఆ ప్రదేశం గురించి, దాని విశిష్టత గురించి వివరంగా వ్రాసేవారు."
ఇప్పుడు తపాలా..తప్పయిపోయింది మన్నించు..ఎన్ని సంవత్సరాల అనుబంధం , తర తరాలు గా పెంచుకున్నాం..పంచుకున్నాం.. ఇప్పుడు తుంచుకున్నాం..! తుంచేశాము కూడా
ఊహ తెలిసిన కొత్తలో వీధి చివర పోస్టు డబ్బా ఇదేంటబ్బా..అదో జిజ్ఞాస ఇంటికి పోస్ట్ మాన్ వస్తే చుట్టమొచ్చినంత సంబరం
కవర్ అందుకుని అమ్మకో నాన్నకో ఇచ్చాక కొస చింపుతుంటే అదో ధ్రిల్..
సినిమాల్లో గుమ్మడో, ఏయెన్నారో ఉత్తరం చదువుతున్నప్పుడు సావిత్రి కనిపించినట్టు ఉండేది
అమ్మ చేతి లేఖలో అమ్మమ్మ.. నాన్న చదివే లెటర్లో బాబాయ్ కనిపిస్తారేమోనని భ్రమ..అప్పుడప్పుడు
పోస్ట్ మాన్ డబ్బిస్తే అదో ప్రశ్న..ఎందుకు ఇస్తున్నారు అని..!? మా నాన్నమ్మ మనీ ఆర్డర్ కోసం అప్పట్లో ఎదురు చూపులు
ఎన్ని కబుర్లు..ఎన్నెన్ని విశేషాలు..సంగతులు..సమాచారాలు..కుశలాలు..కౌసలాలు..
వందల కిలోమీటర్ల దూరంలో చదువుకుంటున్న బాబాయ్ డబ్బులు పంపండి అంటూ కొన్ని ఉత్తరాలు
తాతకు వేదన అప్పు కోసం యాతన.. అని మరికొన్ని .. చాలా ప్రశ్నలకు ఒకటే ... జవాబు
అలాంటి ఉత్తరం లు ఇప్పుడు ఇంచుమించు అదృశ్యం.. అలా కాకపోయినా అరుదైన దృశ్యం..
ఎన్నో తరాలకు ఉత్తరకాండ. ప్రస్తుతం దాని బ్రతుకే అరణ్యకాండ..!
ఇక ఇప్పుడు స్మార్ట్ ఫోన్ వచ్చాక ఉత్తరాలు..ప్రత్యుత్తరాలు..అన్ని ఒక పరంపర లోనే
అన్నిటికీ ఫోనే గతి.. ఆ క్రమంలో ఉత్తరానికి హారతి..
ఎర్ర డబ్బా.. ఇప్పుడెక్కడబ్బా.. ఎగిరిపోయిందా ...
ఇట్లు
శర్మ రాణీ