*ప్రదర్శనం కాదది నిదర్శనం*
ఒక మహా యజ్ఞం..
గొప్ప క్రతువు..
ఇలలో జరుగుతున్న అద్భుతం..
కలియుగంలో దేవుని ఉనికిని
చాటుతూ సాగుతున్న
అత్యద్భుత ఆధ్యాత్మికయాగం..
కోట్లాది మంది ఒకటిగా
జరుపుకుంటున్న
దైవ కార్యక్రమం..
నభూతో నభవిష్యతి..
*_కుంభమేళా.._*
*_మహాకుంబ మహాకుంభ మహా కుంబ్.!_*
నలభై అయిదు రోజులు..
*_ప్రయాగరాజ్..హరిద్వార్.._*
*_ఉజ్జయిని..నాసిక్.._*
నాలుగు వేదికలు..
నలభై కోట్ల జనం..
ప్రభంజనం..
_అతి పెద్ద పండగ.._
_భరతజాతి వేడుక.._
_ఇంటింటి సంబరం.._
మనిషి.. సాటి మనిషి
కలిసి ఆచరిస్తున్న
మానవతా మహాకార్యం..
*_అందరూ ఒకటై తరిస్తున్న_*
*_కలియుగ మహాద్భుతం..!_*
మనుషులు పోయారు..
నిజమే..అత్యంత బాధాకరమే..
అయితే ఇలాంటి
గొప్ప సందర్భంలో..
ఒక గొప్ప దీక్షలో..
మహావేడుకలో..
దివ్య ముహూర్తంలో
అసువులు బాయడమంటే
స్వర్గలోక ప్రాప్తికి..
కైలాస యాత్రకి..
సాక్షాత్ మహాదేవుని
సన్నిధికి చేరడానికి
ఇంతకు మించిన సందర్భం ఇంకేముంటుంది..
అది అపశ్రుతే అవనీ..
బంధువులకు బాధ కలిగించనీ..
పోయినోళ్ళు అందరూ మంచోళ్ళే..
కైవల్య ప్రాప్తికీ..
జన్మ రాహిత్యానికి
ఇంతకంటే
దగ్గర దారి ఇంకొకటి ఉంటుందా..!?.
సరిగ్గా..ముప్పై ఆరు
రోజుల క్రితం..
పుష్యమాసం..
పౌర్ణమి పుణ్యతిధి నాడు వెలిగింది మొదటి దీపం...
జరిగింది తొలి మునక..
పొంగింది ప్రతి భారతీయుని హృదయం..
ఉప్పొంగింది గంగా ప్రవాహం..
*_జలం జాలమై.._*
*_పురివిప్పిన జటాఝూటమై.._*
*_జనం జాగరణమై.._*
ఆకాశం చుక్కల పందిరై..
తారా తోరణమై..
భక్త హృదయం పరవశమై..
ప్రతి మది
*_పరమశివుని వశమై..!_*
ఈ నెల 26..
మహాశివరాత్రి నాడు..
జనమంతా జాగరణకు
సిద్ధమవుతున్న వేళ..
జగమెల్ల హర నామ స్మరణంతో
పరవశించే ముహూర్తాన
అక్కడ..ఆ నాలుగు
దివ్య క్షేత్రాలలో కుంభమేళా ముగింపు..మరింతగా ఒడల
జలదరింపు..ఇంకా ఉంటే బాగున్నే అనిపించినా..
ఎంతటి వేడుకకైనా
కాలమానమే కొలమానం..!
ప్రస్తుతం జరుగుతున్న
మహాకుంభమేళాతో
పన్నెండు కుంభమేళా
చక్రాల పూర్తి..
అఖండ స్ఫూర్తి..
కొలువై దగ్గరుండి నిర్వహించిన
మహాశివుని మూర్తి..
కలియుగ మహాద్భుత
ఘట్టం..భరత జాతి కీర్తి..!
ఇది 144 సంవత్సరాలకు ఒకసారి జరిగే మహాసమ్మేళనం..ఆనాడు జరిగిన మహాసమ్మేళనంలో
పాల్గొన్న సన్యాసులు..
సాధువులు..రుషులు..
మహామునులు..అఘోరాలలో
కొందరు ఇప్పటికీ జీవించి ఉండి వర్తమాన మహాకుంభమేళాకు కూడా హాజరయ్యారా..అన్నట్టు
ఎంతమంది వృద్ధులు..
ఎక్కడెక్కడి నుంచి వచ్చారో..
మామూలు సమయాల్లో
బయటి ప్రపంచం చూడని..
ఆ బయట ప్రపంచానికి కనిపించని యోగులు..
కుంభమేళాలో ప్రత్యక్షమై
ఆ మహా వేడుకకు
పరిపూర్ణత చేకూర్చారు.
అసలు ఏం తిన్నారో..
ఎక్కడ ఉన్నారో..
ఎప్పుడు పడుకున్నారో..
ఎవరికీ అవగాహన కలగని
రీతిలో నాలుగు క్షేత్రాల్లో
రేయనక పగలనక
సంచరించి వేడుకకు సాధుసత్సంగపరిషత్
కళను తెచ్చి పెట్టారు.. దివి నుంచి దేవతలే ఆ రూపంలో వచ్చి అక్కడ తిరుగాడుతూ
ఉత్సవం ఇంత మహోన్నతంగా జరిగేలా అన్నీ దగ్గరుండి పర్యవేక్షించినట్టు కనిపించింది.
కుంభమేళాకు పురాణాల కాలం నాటి నుంచి మూలాలున్నాయి.
దేవదానవులు అమృతం కోసం పాలసముద్రాన్ని మధించిన సమయంలో అమృతం చుక్కలు నాలుగు ప్రయాగరాజ్..హరిద్వార్..
ఉజ్జయిని..నాసిక్ లలో పడ్డాయని ప్రశస్తి.
త్రివేణి సంగమంలో మునక
కుంభమేళాలో అత్యంత కీలక..పవిత్ర..పరాకాష్ఠ ఘట్టం.
ఈ సమయంలో ఇక్కడ చేసే పవిత్ర స్నానం వల్ల సకల
పాప హరణం..మోక్ష సిద్ధి ఒనగూరుతాయని ప్రతీతి.
మహాకుంభమేళా జరిగే సమయాన్ని జ్యోతిష్య శాస్త్రం ప్రకారం నిర్ణయిస్తారు.
బృహస్పతి కుంభంలోకి
ప్రవేశించే తరుణంలో
సూర్యుడు మకరరాశిలోకి
చేరే ముహూర్తాన కుంభమేళాకు అంకురార్పణ జరుగుతుంది.
సరే..ఏదిఏమైనా 144 ఏళ్లకు ఒకసారి జరిగే ఈ ప్రపంచ అత్యద్భుత వేడుకకు
పూర్వజన్మ సుకృత ఫలితంగా
మనం సాక్షీభూతులుగా నిలిచాం.
అవకాశం ఉండి మేళాకు వెళ్ళి మునకలు వేసిన వారు ధన్యులు..
లేకపోయినా టివిల్లో చూసి..
పేపర్లలో చదివి..
ఏదో ఒక మాధ్యమం ద్వారా విశేషాలు తెలుసుకున్న వారు సైతం అదృష్టవంతులు..
ఇవేవీ అనుభూతించని
మారుమూల ప్రాంతవాసులు..
నిరక్షరాస్యులు.. ఆపాటి జ్ఞానం లేని వారు కూడా
ఈ మహాక్రతువు జరిగిన పుణ్యభూమిపై
ఈ సమయంలో జీవించి ఉండి
పరమపదానికి బాటలు వేసుకున్నట్టే..
చేసుకున్న వాడికి చేసుకున్నంత మహాదేవా..
చేసుకోని వారికి కూడా
సమాన పుణ్యం..పురుషార్ధం లభించే అత్యద్భుత విశేషం
ఈ కుంభమేళా..
ఈ పవిత్ర భూమిలో పుట్టడమే ఒక అదృష్టం..
ఇక్కడ జన్మించిన
ప్రతి ఒక్కరూ ఏదో ఒక గొప్ప వేడుకలో జన్మానికి
ఒక శివరాత్రి అన్నట్టు
పాల్గొన్న వారే..
యజ్ఞాలు..యాగాలు..
క్రతువులు..నిత్య పూజలు..
పండగలు..తిరనాళ్ళు..
జాతరలు..అమ్మవారి ఉత్సవాలు..బోనాలు..
బ్రహ్మోత్సవాలు..
పరాకాష్టగా పుష్కరాలు..
కుంభమేళాలు..ఇంకా ఇంకా
ఉత్కృష్టంగా ఇప్పుడు జరుగుతున్న
*_మహా కుంభమేళా..!_*
*_కుంభమేళా.._*
భువిలో మనుజులు..
దివి నుండి దేవతలు..
కలిసి చేసుకుంటున్న
అతి పెద్ద..అరుదైన..
మహాద్భుతమైన..
*_విశ్వవేడుక.._*
అందుకు ప్రయాగ..
హరిద్వార్..
ఉజ్జయిని..
నాసిక్..
ఈ నాలుగు క్షేత్రాల
సంగమం..
*_విశ్వవేదిక..._*
ఇలాంటి మహోత్సవాలు
హిందూ సంస్కృతిలో
గొప్ప *_పారంపర్య వాడుక..!_*
ఈ మహోత్సవం రేపు
26 న ముగిసేది కాదు..
ఇదొక నిరంతర ప్రక్రియ..
హిందూ ధర్మ పరిరక్షణ
కొనసాగింపు..
మానవధర్మ ఆకళింపు..
ఆధ్యాత్మికతకు కలియుగంలో
సరికొత్త రూపు..
భక్తిసాగర మధింపు..
చివరగా..ఏ యుగంలో జరిగినా ఆధ్యాత్మికతకు
పరిపూర్ణ గెలుపు..
ప్రతి యుగంలోనూ
ఒక మలుపు..
మేలుకొలుపు..!