SIVAPARIVARAM
Thursday, June 19, 2025
ఉత్తరాలు - ప్రత్యుత్తరాలు
Sunday, March 23, 2025
శ్రీకాళహస్తీశ్వర శతకమును అర్థాలతో
శ్రీకాళహస్తీశ్వర శతకమును అర్థాలతో
శ్రీకాళహస్తీశ్వర శతకమును మహాకవి ధూర్జటి రచించినారు. ధూర్జటి శ్రీ కృష్ణదేవరాయల అష్టదిగ్గజాలలో ఒకడు. కాళహస్తీశ్వర భక్తుడు. ఇతనిని పెద ధూర్జటి అని అంటారు, ఎందుకంటే ఇదే పేరుతో ఇంకో నలుగురు ధూర్జటులు ఉన్నారు. ధూర్జటి 16వ శతాబ్దము ఉత్తర భాగములో 1480 నుండి 1545 వరకు జీవించిఉండవచ్చని భావిస్తున్నారు. ఈయన ఆనాటి పొత్తపి సీమ లోని, ప్రస్తుతం చిత్తూరు జిల్లా లో ఉన్న శ్రీకాళహస్తి పట్టణ వాస్తవ్యుడు. ఈయన తల్లితండ్రులు సింగమ మరియు రామనారాయణ. ఈయన తాత పేరు జక్కయ నారాయణ. వీరి పేర్లను బట్టి ధూర్జటి జన్మత: వైష్ణవుడైనా ఆ తరువాత కాలములో గొప్ప శివభక్తుడైనాడని భావిస్తున్నారు. ధూర్జటి అష్టదిగ్గజములలో ప్రధానమైనవాడు. భక్తి ప్రబంధమైన శ్రీకాళహస్తి మహత్యం మరియు శైవ శతకమైన శ్రీకాళహస్తీశ్వర శతకం ఈయన యొక్క రెండు ప్రధాన రచనలు. ఆయా రీతులలో ఇవి మహోన్నత కావ్యాలు. ధూర్జటి చెప్పినవి మరియు ధూర్జటిపై చెప్పబడినవిగా అనేక చాటువులు ఆంధ్ర దేశములో ప్రచారములో ఉన్నవి.
శ్రీకాళహస్తీశ్వర శతకమును అర్థాలతో
శ్రీ విద్యుత్కలితాజవంజవ మహాజీమూత పాపాంబు ధా
రా వేగంబున మన్మనోబ్జ సముదీర్ణత్వంబుఁ గోల్పోయితిన్
దేవా! నీ కరుణా శరత్సమయ మింతేచాలు; చిద్భావనా
సేవన్ దామర తంపరై మనియెదన్ శ్రీ కాళహస్తీశ్వరా! 1
సంపదలు అనే మెరుపు తీగలతో కూడిన, సంసారమనే మేఘముల నుండి కురిసిన, పాపములనే నీటిధారల చేత నా మనఃపద్మము కాంతిలేక చిన్నబోయినది. నీ దయ అను శరత్కాలము వచ్చినది. చాలు. ఇంక నా మనఃపద్మము వికసించుటే కాదు సర్వసమృద్ధులు కలవాడనై, నీ చిన్మూర్తిని ధ్యానించుచూ బ్రతుకుతాను. (పద్మములు వానదెబ్బకు వాడిపోవును. శరత్కాలములో వికసించి కాంతివంతమగును).
వాణీవల్లభ దుర్లభంబగు భవద్ద్వారంబున న్నిల్చి, ని
ర్వాణశ్రీఁ చెరపట్టఁ చూచిన విచారద్రోహమో, నిత్య క
ళ్యాణ క్రీడలఁ బాసి, దుర్దశలపాలై, రాజలోకాధమ
శ్రేణీ ద్వారము దూరఁ జేసి తిపుడో శ్రీకాళహస్తీశ్వరా! 2
ఈశ్వరా! బ్రహ్మాదులకు కూడా సాధ్యం కాని, నీ ఇంటి సింహద్వారదేశమున నిలిచి ముక్తికాంతను చేపట్టాలను ఆలోచన, నా వంటి అల్పుడు చేసినందువల్లనో ఏమోకానీ, నీ సేవాభాగ్యమునకు దూరమై, అధములైన రాజులను సేవించునట్లు చేసినావు కదా!
అంతా మిథ్య తలంచి చూచిన నరుండట్లౌ టెరింగిన్ సదా
కాంతల్ పుత్రులు నర్థముల్ తనువు నిక్కంబంచు మోహార్ణవ
భ్రాంతింజెంది చరించుగాని, పరమార్థంబైన నీయందుఁ దా
జింతాకంతయుఁ జింత నిల్పడు గదా, శ్రీ కాళహస్తీశ్వరా! 3
ఆలోచించినచో ఈ జగత్తంతా మాయేకదా! మానవుడా సంగతి తెలిసీ కూడా, భార్య, పుత్రులు, ధనము, తన శరీరము అన్నీ శాశ్వతము అని భావించి మోహము పొందుచూ, జీవనమునకు పరమార్థభూతుడవైన నిన్ను మనసులో ఒక్క నిమిషమైననూ ధ్యానించడు కదా! ఎంత అజ్ఞానము.
నీ నా సందొడఁబాటుమాట వినుమా! నీ చేత జీతంబు నే
గానిం బట్టక సతతంబు మది వేడ్కంగొల్తు నంతస్సప
త్నానీకంబున కొప్పగింపకుము నన్నాపాటియే చాలుఁదే
జీ నొల్లన్ గరినొల్ల నొల్ల సిరులన్ శ్రీ కాళహస్తీశ్వరా! 4
ఈశ్వరా! నీకూ నాకూ అంగీకారమైన మాట ఒకటి చెప్తాను వినుము. నీ నుండి ఏ కాణీ కూడా జీతము ఆశింపక, నిత్యము నిన్ను సేవిస్తాను. నీవు నన్ను కామక్రోధాదులైన లోపలి శత్రువులకు అప్పగింపక రక్షించు. ఆ అనుగ్రహము చాలు. ఇంక నాకు గుర్రాలు వద్దు. ఏనుగులు వద్దు. ఐశ్వర్యములు వద్దు. అటువంటివేమీ కోరను.
భవకేళీ మదిరా మదంబున మహా పాపాత్ముడై వీడు న
న్ను వివేకింప డటంచు నన్ను నరకార్ణోరాశి పాలైనఁ బ
ట్టవు, బాలుండొక చోట నాటతమితోడన్ నూతఁ గూలంగఁ దం
డ్రి విచారింపక యుండునా? కటకటా! శ్రీ కాళహస్తీశ్వరా! 5
జనన మరణ రూపమైన సంసారమనే ఆటలోపడి, కల్లు తాగినట్లు మత్తెక్కి అదే సుఖమనుకొని యీ నరుడు మహాపాపియై నన్ను (భగవంతుని) తెలుసుకొనలేకున్నాడని, నరక సముద్రములో మునిగిపోతుండగా చూస్తూ ఊరుకుంటావా? ఆటలధోరణిలో బాలుడు బావిలో పడినప్పుడు తండ్రి వానిని గురించి పట్టించుకొనకుండా ఊరుకుంటాడా? నీవు నన్ను రక్షింపకుండుట న్యాయము కాదని భావము.
స్వామిద్రోహము చేసి వేరొకనిఁ కొల్వన్ బోతినో? కాక నే
నీ మాట ల్విననొల్ల కుండితినో? నిన్నే దిక్కుగాఁ జూడనో?
యేమీ, యిట్టి వృధాపరాధి నగు న న్నీ దు:ఖవారాశి వీ
చీ మధ్యంబున ముంచి యుంపదగునా? శ్రీ కాళహస్తీశ్వరా! 6
ఈశ్వరా! నిన్ను కాదని స్వామి ద్రోహము చేసి, మరొక దేవుని సేవించానా? పోనీ, నీవు చెప్పిన వేదవాక్యములపై నమ్మకము లేక నిరాదరణ చేసి, నాస్తికుడనైతినా? నిన్నే దిక్కుగా భావించలేదా? ఏ తప్పూ చేయని నన్ను, ఈ సంసార దు:ఖసముద్రంలో ముంచి, చూసి వినోదించటం నీకు న్యాయమా? నన్ను ఉద్ధరించటం నీ కర్తవ్యం కాదా? (పరమేశ్వరుని ముఖము నుండి వేదాలు పుట్టినవని ప్రసిద్ధి. వారిని నమ్మినవారిని నాస్తికులంటారు.)
దివిజక్ష్మారుహ ధేను రత్న ఘనభూతిన్ ప్రస్ఫురద్రత్న సా
నువు నీ విల్లు; నిధీశ్వరుండు సఖుఁ డర్ణోరాశి కన్యా విభుం
డు విశేషార్చకుఁ డింక నీ కెన ఘనుండున్ గల్గునే? నీవు చూ
చి విచారింపవు; లేమినెవ్వఁడుడుపున్? శ్రీ కాళహస్తీశ్వరా! 7
కల్పవృక్షము, కామధేనువు, చింతామణి మొదలైన ఐశ్వర్యప్రదములైన వస్తువులతో నిండి ఉన్న బంగారు పర్వతము నీకు విల్లు. నవనిధులకు నాయకుడైన కుబేరుడు నీకు ప్రియమిత్రుడు. లక్ష్మీపతి అయిన నారాయణుడు నీ పరమ భక్తుడు. ఇన్ని ఉన్నా నీకంటే గొప్పవాడెవ్వడు? వీరిలో ఏ ఒక్కరితోనైనా చెప్పి దరిద్రమును పోగొట్టగల సామర్ధ్యము నీకున్నది. అయినా ఆ పని చేయవు. నిన్ను మరిచిపోతానని భయమా? నా మీద నీ అనుగ్రహ దారిద్రమును పోగొట్టేవాడవు నీవే తప్ప ఇంకెవరున్నారు?
నీతో యుద్ధము చేయనోపఁ; గవితానిర్మాణశక్తి నిన్నున్
బ్రీతుం చేయగలేను; నీ కొరకుఁ తండ్రిన్ చంపగాఁజాల; నా
చేతన్ రోకట నిన్ను మొత్తవెరతున్; చీకాకు నా భక్తి, యే
రీతిన్నాకిక నిన్నుఁ చూడగలుగున్? శ్రీ కాళహస్తీశ్వరా! 8
అర్జునునిలాగా నీతో యుద్ధము చేయలేను. కవిత్వము చెప్పి నిన్ను సంతోషపరచలేను. శివభక్తుని వలే తండ్రిని చంపలేను. శివభక్తురాలి వలే నిన్ను రోకలితో మొత్తలేను. నా భక్తి, నాకు అడ్డమై నీ దయను పొందనీయకుండా చేస్తుంది. నిన్ను చూసే అవకాశం ఇంక నాకెలా కలుగుతుంది?
ఆలున్ బిడ్డలు తల్లిదండ్రులు ధనంబంచు న్మహాబంధనం
బేలా నా మెడ గట్టినాడ విక నిన్నేవేళఁ జింతింతు, ని
ర్మూలంబైన మనంబులో నెగడు దుర్మోహాబ్ధిలోఁ గ్రుంకి, యీ
శీలామాలపుఁ జింత నెట్లుడిపెదో శ్రీ కాళహస్తీశ్వరా! 9
ఈశ్వరా! భార్యాపుత్రులు, తల్లిదండ్రులు, ధనములు అనే పాశములను నా మెడకు చుట్టావు. ఈ వ్యామోహంలో పడి నిన్ను నేనెట్లా స్మరించగలను? ఈ భరింపరాని దుఃఖము ఎలా పోగొడతావో శంకరా! నీ దయ.
నిప్పై పాతకతూలశైల మడచున్ నీనామము న్మానవుల్
తప్పన్ దవ్వుల విన్న నంతకభుజాదర్పోద్ధత క్లేశముల్
తప్పుం దారును ముక్తులౌదురనిశాస్త్రంబుల్ మహాపండితుల్
చెప్పంగాఁ దమకింక శంకలుండవలెనా? శ్రీ కాళహస్తీశ్వరా! 10
శ్రీకాళహస్తీశ్వరా! నీ పేరు స్మరిస్తేనే కొండల వంటి పాపాలు పోతాయని, యముని వల్ల కలుగు నరకబాధలు తప్పుతాయని వేదశాస్త్రాలు, పండితులు చెప్తుంటే, ఈ మానవులకు ఇంకా అనుమానాలెందుకు? నీ పేరును స్మరించుటకు సిద్ధపడరెందుకు?
వీడెం బబ్బినయప్పుడున్, దమనుతుల్ విన్నప్పుడుం, బొట్టలో
గూ డున్నప్పుడు, శ్రీవిలాసములు పై కొన్నప్పుడుం గాయకుల్
పాడంగా వినునప్పుడుం చెలగుదంభప్రాయ విశ్రాణన
క్రీడాసక్తుల నేమి చెప్పవలెనో శ్రీ కాళహస్తీశ్వరా! 11
ఈశ్వరా! నిన్ను, నీ ధ్యానమును మరచి, తమకు తాంబూలము దొరికినప్పుడు, అనగా భోగములు కలిగినప్పుడు, తమను ఎవరైనా పొగిడినప్పుడు, కడుపునిండా తిండి ఉన్నప్పుడు, ఐశ్వర్యవైభవములు బాగా ఉన్నప్పుడు, గాయకులు పాడినప్పుడు తమ గొప్పతనమును చూపుటకై ఆడంబరముగా దానధర్మములు చేస్తూ విర్రవీగు వారిని ఏమనాలో తెలియదు.
నిను సేవింపగ నాపదల్పొడమనీ, నిత్యోత్సవం బబ్బనీ,
జనమాత్రుండననీ, మహాత్ముడననీ, సంసార మోహంబు పై
కొననీ, జ్ఞానము గల్గనీ, గ్రహగతుల్ కుందింపనీ, మేలు వ
చ్చిన రానీ, యవి నాకు భూషణములే శ్రీ కాళహస్తీశ్వరా! 12
ఈశ్వరా! నేను నిన్ను సేవిస్తుండగా, నాకు కష్టాలు రానీ, సుఖాలు రానీ, నన్ను లోకము సామాన్యుడననీ, గొప్పవాడననీ, సంసార వ్యామోహము కలుగనీ, జ్ఞానమే కలుగనీ, గ్రహాచారము నన్ను క్రుంగదీయనీ లేక మంచి చేయనీ, అవి అన్నీ నాకు ఆభరణములు వంటివే అవుతాయి. నీ పాదసేవ చేస్తున్న నాకు అన్నీ నీ అనుగ్రహములు గానే కనిపిస్తాయి.